ఓటర్ కార్డుల జారీకి కేంద్రాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటర్ కార్డుల జారీకి కేంద్రాలు

ఓటర్ కార్డుల జారీకి కేంద్రాలు

Written By news on Sunday, May 20, 2012 | 5/20/2012

రేపట్నుంచి ఉప ఎన్నికల నియోజకవర్గాల్లో ఏర్పాటు
ముఖ్య ఎన్నికల అధికారి భ న్వర్‌లాల్ వెల్లడి
పోలింగ్‌కు ముందే ఇంటింటికీ ఓటర్ స్లిప్‌ల పంపిణీ
ఒకవేళ అందకుంటే.. పోలింగ్ రోజున ప్రతి కేంద్రం వద్ద జారీ
శనివారం రెండో రోజున నాలుగు నామినేషన్లు దాఖలు
రూ.16.07 కోట్లు, 1.14 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికలు జరగనున్న నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నుంచి ఓటరు గుర్తింపు కార్డుల జారీకి ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేని వారందరూ ఆయా కేంద్రాల దగ్గరకు వెళ్లి, గుర్తింపు కార్డు కావాలని కోరితే ఉచితంగా జారీ చేస్తారని సచివాలయంలో శనివారం తనను కలిసిన విలేకరులకు ఆయన తెలిపారు. మూడు, నాలుగు గ్రామాలకు కలిపి.. ఒకే చోట ఓటర్ల గుర్తింపు కార్డుల జారీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. పోలింగ్‌కు ముందే బూత్ స్థాయి ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తారని, ఒకవేళ ఎవరికైనా ముందుగా ఓటర్ స్లిప్‌లు అందకపోతే, పోలింగ్ రోజు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద వాటిని పొందవచ్చునని తెలిపారు. పోలింగ్ రోజున ప్రతి కేంద్రం వద్ద ఓటర్ స్లిప్‌లు ఇచ్చేందుకు బూత్‌స్థాయి ఆఫీసర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్నందున.. ఉప ఎన్నికల్లో ఇతర గుర్తింపు కార్డులను అనుమతించడం లేదని, కేవలం ఓటర్ గుర్తింపు కార్డులు, ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్‌లతోనే ఓటు వేసేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు భన్వర్‌లాల్ వివరించారు. ఉప ఎన్నికల స్థానాలకు శనివారం(రెండో రోజు) మరో నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. తొలి రోజు శుక్రవారం పదకొండు నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

నగదు సమాచారమిచ్చేవారికి ప్రోత్సాహకం ఇవ్వమని కోరతాం..

ఉప ఎన్నికలు జరిగే 12 జిల్లాల్లో మద్యం, నగదు ప్రభావాన్ని మరింత గట్టిగా నిరోధించేందుకు ఏర్పాట్లు చేసినట్లు భన్వర్‌లాల్ చెప్పారు. ఇందుకోసం ఆ జిల్లాల్లో ప్రభుత్వ వాహనాలతో పాటు అన్ని రకాల వాహనాలు, అంబులెన్స్‌లు, మీడియా వాహనాలనూ తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.16.07 కోట్లను, 1.14 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యానికి సంబంధించి 7,917 కేసులు నమోదు చేయడంతోపాటు 2,448 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. లెక్కలు చూపని నగదుకు సంబంధించి సమాచారం ఇచ్చే వారికి ఐటీ శాఖ ప్రోత్సాహకంగా నగదు బహుమానం ఇస్తుందని, అదే తరహాలో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో సమాచారం ఇస్తున్న వారికి కూడా నగదు ప్రోత్సాహకం ఇవ్వాల్సిందిగా కోరతామని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడంలో భాగంగా మృతి చెందిన వారి పేర్లు, ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లిన వారి పేర్లను, డూప్లికేట్ పేర్లను గతంలోనే తొలగించామన్నారు. ఈ విధంగా ఓటర్ల జాబితా నుంచి 39 లక్షల ఓటర్లను తొలగించామని, అలాగే అర్హులైన కొత్త వారిని చేర్చుకున్నామన్నారు. దీంతో 5.67 కోట్లు ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 5.57 కోట్లకు తగ్గిందన్నారు.
Share this article :

0 comments: