‘అమ్మా ఆవేశంతో ఉన్నావు...వితండవాదం చేస్తే ఎలా’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘అమ్మా ఆవేశంతో ఉన్నావు...వితండవాదం చేస్తే ఎలా’

‘అమ్మా ఆవేశంతో ఉన్నావు...వితండవాదం చేస్తే ఎలా’

Written By news on Wednesday, February 27, 2013 | 2/27/2013

రేపల్లె: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర రేపల్లె నియోజకవర్గంలో మూడోరోజు జనం లేక బోసిపోయింది. విశ్వేశ్వరం పీహెచ్‌సీ ఆవరణలోని బస నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన చంద్రబాబుకు మార్గంమధ్యలో జంగాలపాలెం, మోర్తోట, మైనేనివారిపాలెం మీదుగా నాలుగు కిలోమీటర్ల చేసిన పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. రహదారి పక్కన గ్రామాల్నుం చి కనీసం 10 నుంచి 20 మంది కూడా గ్రామస్తులు కనిపించలేదు. టీడీపీ నాయకులు మాత్రం మహిళలతో హారతులిప్పించే హడావుడి మినహా స్పందన కరువైంది. టీడీపీకి పట్టున్న గ్రామాలను ఎంపికచేసి రూట్‌మ్యాప్ సిద్ధంచేసినా, ఇలా జరగడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవరించింది.

గ్రామాల్లో బాబు ప్రసంగించిన ప్రతిచోట యథాప్రకారం హామీలనిచ్చారు. జంగాలపాలెం వద్ద రోడ్డుపక్కన మహిళలను పలకరించి, అక్కడి విద్యార్థిని ఏం చదువుతున్నావని ప్రశ్నించారు. బీఎస్సీ పూర్తిచేశాననీ, బీఈడీ చేయాలనుకుంటున్నానని చెప్పడంతో.. బీఈడీ చదివితే ఉద్యోగాలు రావని, కంప్యూటర్స్, టూరిజం, బయోకెమిస్ట్రీ చేయాలని బాబు సూచించారు. ‘ఇంతకుముందో స్కూల్లో చూశా.. పదిమంది పిల్లల్లేరు.. మీ ఊళ్లో 20 మంది అని చెబుతున్నావు...రానురాను పిల్లలు తగ్గిపోతున్నారు, టీచర్లు ఎక్కువవుతున్నారు... ఉద్యోగాలెలా వస్తాయి’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో ఆ విద్యార్థిని మౌనం దాల్చింది. మీకు ఎవరూ చెప్పేవాళ్లు లేరా అంటూ అధికారంలోకి వచ్చాక అందరినీ గైడ్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతలో గ్రామానికి చెందిన యాజలి పద్మ ముందుకొచ్చి గ్రామంలోకి రాకుండా వెళితే ఎలాగని ప్రశ్నించారు.

రోడ్డు లేదు, లైట్లు లేవు, అంగన్‌వాడీకి పిల్లల్ని తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పగా, మేం అధికారంలో లేం క దా అని బాబు అనగానే.. మీరున్నపుడు అలాగే ఉందని ఆమె తిరుగు సమాధానమిచ్చింది. తాము అధికారంలో ఉండగా, జన్మభూమి పెట్టి అధికారుల్ని ఎమ్మెల్యేలను పంపామని గుర్తుచేశారు. సమస్యలపై లెటరు పెట్టుకోమని బాబు చెప్పగానే, మీరూ కుమ్మక్కయితే ఎలాగని పశ్నించటంతో బాబు కంగుతిన్నారు. వెంటనే ఆమె సర్దుకుని, ‘మీరంటే.. అధికారులు కుమ్మక్కయితే...అన్నానండీ’ అని చెప్పారు.

‘అమ్మా ఆవేశంతో ఉన్నావు...వితండవాదం చేస్తే ఎలా’ అంటూ ఆయన ముందుకు సాగారు. మైనేనివారిపాలెంలో వుయ్యూరి రోజారమణి మాట్లాడుతూ.. రెండో బిడ్డ ఆడపిల్ల పుట్టగానే రూ.5000 బ్యాంకులో వేస్తామంటే ఆపరేషను చేయించుకున్నానని, కేవలం రూ.500 మాత్రమే వేశారని చంద్రబాబుకు మొరపెట్టుకుంది. మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే పుస్తకం ఇచ్చారని, రెండో పిల్లకు ఇప్పుడు పధ్నాలుగో ఏడు రాబోతోందని చెప్పుకొచ్చింది. దీనిపై తాను ఏంచేయాలో పరిశీలిస్తానంటూ బాబు చెపాల్సి వచ్చింది. మైనేనివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు టీడీపీ టోపీలు, కండువాలు ధరింపజేశారు.

చంద్రబాబు వారి దగ్గరకు వెళ్లి, ‘పాఠాలు బాగా చెబుతున్నారా? మధ్యాహ్న భోజనం పెడుతున్నారా’ అని ఆరా తీసి బాగా చదువుకోవాలని సూచించారు. భోజన విరామం అనంతరం చాట్రగడ్డలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. మైనేనివారిపాలెం, నల్లూరు సౌత్ అడ్డరోడ్డు, నల్లూరు, రుద్రవరం నుంచి పెనుమూడి చేరుకుని అక్కడే బసకు వెళ్లారు.
Share this article :

0 comments: