త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ షర్మిల భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ షర్మిల భరోసా

త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ షర్మిల భరోసా

Written By news on Tuesday, February 26, 2013 | 2/26/2013

చుక్క చినుకు లేదు.. కరెంటు రానే రాదు
అదను మీద కురవాల్సిన వానలు కళ్లాల మీద పడ్డాయి
మూడేళ్ల నుంచీ అప్పుల బాధలేనంటూ ఆవేదన
ఆదుకునే నాథుడు లేడంటూ ఆక్రందన
త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ షర్మిల భరోసా
ఇప్పుడు కాకపోతే... ఇంకెప్పుడు అవిశ్వాసం పెడతారో చెప్పాలని చంద్రబాబుకు డిమాండ్
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 74, కిలోమీటర్లు: 1,046.8

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కరెంటేమో మూడు గంటలకు మించి రాదు. అది కూడా మూడు సార్లు మాత్రమే ఇస్తారు. పొలానికి పోయి ఎదురు చూసీ చూసీ ఇంటికి వస్తే అప్పుడు కరెంటొస్తది. పరిగెత్తుకొని పొలానికి పోయే సరికి మళ్లీ పోద్ది. పూతల మీద చుక్క చినుకు రాలలేదు.. తీరా పంట కోతకొచ్చాకా కళ్లాల మీద వానలు పడుతున్నాయి. మూడు ఎకరాల్లో.. అన్ని పెట్టుబడులూ కలుపుకొని రూ.2.10 లక్షలు ఖర్చు చేసి మిరప వేస్తే 18 క్వింటాళ్లు వచ్చింది. రూ. లక్ష వచ్చింది. మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఏం చేసి నా పిల్లలను బతికించుకోను?’’
... ఇనపరాజుపల్లి గ్రామానికి చెందిన రైతు కోరకూటి వెంకటేశ్వర్లు అవేదన.

‘‘భూమినే నమ్ముకున్న. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడాది పండక పోతుందా! అని అప్పులు చేసి మూడు ఎకరాల్లో మిరప తోట పెట్టినా. అదను మీద వాన పడలేదు. కరెంటు లేక మొక్కలు ఎండిపోయాయి. ఆయిల్ ఇంజన్‌పెట్టి తోట తడిపితే ఎకరానికి రూ. 2,500 కిరాయి. ఆరు తడులు పెట్టినా.. నేను, నా కొడుకూ..నా భార్యా అందరం రెక్కలు ముక్కలు చేసుకుంటే ఎకరానికి 8 క్వింటాళ్ల మిరప పట్టింది. దాన్ని తీసుకొని మార్కెట్‌కు పోతే కాటా పెట్టకముందే వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది. తడిసిన మిరప కొనబోమని చెప్తే తీసుకొచ్చి ఇంటి ముందు పోసినా. పంటను నమ్ముకొని నాశనమై పోయినాం’’... తక్కెళ్లపాడుకు చెందిన మిరప రైతు అంజిరెడ్డి కన్నీళ్లు..

గుంటూరంటే గుర్తుకొచ్చేది మిరపకాయ ఘాటు. దయలేని పాలకుల ఏలుబడిలో ఆ మిరపే ఇప్పుడు అప్పుల పాలు చేసి రైతుల కంట ఇలా కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రజల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో ఇలా రైతన్నలు ఆమె వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్ర 74వ రోజు సోమవారం షర్మిల మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇనపరాజుపల్లి గ్రామ శివారులో షర్మిల మిరప కళ్లాలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అక్కడే ఉన్న రైతులను పలకరిస్తే ‘‘మూడేళ్ల నుంచీ పంట లేదమ్మా.. భూమిని నమ్ముకొని నాశనమై పోయాం.. ఆదుకునే దేవుడు రాకుంటే ఆత్మహత్యలకు అంతే ఉండదమ్మా’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

రాజన్న రాజ్యంలో రైతే రాజు..

మిరప రైతు కన్నీళ్లను చూసిన షర్మిల గాదెవారిపల్లిలో జరిగిన రచ్చబండలో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీరును ఘాటుగా విమర్శించారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని, రాజన్న రాజ్యంలో రైతే రాజు అని భరోసా ఇచ్చారు. ‘‘ఇది మనసులేని ప్రభుత్వం.. వీళ్లు రైతుల రక్తం పిండుకొని తాగుతున్నారు. వాళ్లకు ఉన్న సమయమంతా పదవులు కాపాడుకోవడానికి, ఢిల్లీ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు.

బాబూ రైతుల కన్నీళ్లు కనిపించడంలేదా?

‘‘చంద్రబాబూ మీరు కూడా పాదయాత్ర చేస్తున్నారు కదా? మరి మీకు ఈ ప్రజల కన్నీళ్లూ, కష్టాలూ కనిపించడం లేదా? రైతన్నలు అప్పుల బాధతో ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. మరికొంత మంది రైతన్నలు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కాకుంటే ఈ ప్రభుత్వంపై ఎప్పుడు అవిశ్వాసం పెడతారో చెప్పండి. మీరు అవిశ్వాసం పెట్టరు. ఎందుకంటే ప్రజలు ఎటు పోయినా మీకు పట్టదు. మీరు బాగుంటే చాలు. అవిశ్వాసం పెట్టకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడతారు. అందుకు ప్రతిఫలంగా ఈ ప్రభుత్వం మీరు చేసిన అవినీతి పనుల మీద ఎలాంటి విచారణా వేయకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అది మీ ఇద్దరి మధ్యా కుదిరిన చీకటి ఒప్పందం’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

ప్రాణాలు తీసుకోవద్దు..

రైతులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ..‘‘అమ్మా..! అయ్యా..! ఒక్క మాటైతే భరోసా ఇచ్చి చెప్తున్నా.. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న కలలుగన్న కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. 9 గంటల ఉచిత విద్యుత్తు వస్తుంది. రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోకుండా రూ. 3000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారు. అంత వరకు ఓపిక పట్టండి. దయచేసి మీ విలువైన ప్రాణాలు, భూమిని పోగొట్టుకోవద్దు’’ అని కోరారు.

సోమవారం 74వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తక్కెళ్లపాడు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మాచర్ల నియోజకవర్గంలోని కాచవరం, ఇనపరాజుపల్లి, గాదెవారిపల్లె గ్రామాల మీదుగా సాగింది. షర్మిల 11.8 కిలోమీటర్ల మేర నడిచి.. రాత్రి 7.15 గంటలకు చిన కొదమగండ్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,046.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, ఆతుకూరి ఆంజనేయులు, పి. గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్ తదితరులు ఉన్నారు.

ఒక్క చెయ్యీ లేవలేదు..

ఆ ఊరి పేరు గాదెవారిపల్లె. 800 గడపలుంటాయి. షర్మిల వచ్చి ఊరి మధ్య రచ్చబండ మీద కూర్చున్నారు. మహిళలు చెప్తున్న సమస్యలు వింటున్నారు. వెంకటేశ్వర్లు అనే రైతు ముందుకొచ్చాడు. ‘అమ్మా నేను మాట్లాడతా’ అంటూ మైకందుకున్నాడు. ‘ఊరు ఊరంతా వచ్చి ఇక్కడే ఉంది.. గ్రామస్తులకు దండం పెడుతున్నా.. మన ఊరిలో హిందులువులున్నారు.. ముస్లింలు.. క్రిస్టియన్లూ ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, అన్నీ పార్టీలూ ఉన్నాయి. ఇంత మందిలో ఏ ఒక్కరైనా వైఎస్సార్ సంక్షేమ పథకాల నుంచి లబ్ధిపొందని వాళ్లు ఉంటే చేతులు లేపండి’ అని కోరాడు. షర్మిలతో పాటు అక్కడున్న నాయకులు దాదాపు 5 నిమిషాల పాటు వేచి చూశారు. ఒక్క చెయ్యంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేవలేదు. ‘‘అదమ్మా వైఎస్సార్ మాకు చేసిన సాయం, వైఎస్సార్ మా గుండెళ్లో ఉన్నాడమ్మా’’ అని అన్నాడు. ఈ ఒక్క ఊరిలో రూ.1.70 కోట్ల రుణమాఫీ అయినట్లు వెంకటేశ్వర్లు చెప్పాడు.
Share this article :

0 comments: