యు.పి. దారిలో ఎ.పి. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యు.పి. దారిలో ఎ.పి.

యు.పి. దారిలో ఎ.పి.

Written By news on Sunday, April 22, 2012 | 4/22/2012


ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పరచాలని కాంగ్రెసు రాకుమారుడు రాహుల్ పాపం చాలా ఉత్సాహపడ్డాడు. దుర్మార్గపు ఓటర్లు పడనివ్వలేదు. యు.పి.ని ఎ.పి.గా మార్చే చాన్సు చిక్కనప్పుడు యువరాజు కోరిక తీరాలంటే ఎ.పి.ని యు.పి.గా మార్చటమే సెకండ్ బెస్టు.
ఏలినవారి పార్టీ ప్రస్తుతం ఆ పనిలోనే యమా బిజీగా ఉంది.
మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు వంటి అనేక ఇతర రాష్ట్రాలలాగే ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెసుకు కంచుకోట. అక్కడ చివరిసారిగా 23 ఏళ్ల కింద జారిపోయిన అధికారం మళ్లీ ఆ పార్టీ చేతికందితే ఒట్టు! కాంగ్రెసు నేతల నిర్వాహకం, అధిష్ఠానపు అద్భుత వ్యూహచాతుర్యం ఇప్పటిలాగే సాగితే మునుముందు ఆంధ్రప్రదేశ్ పరిస్థితీ అంతే!
2009లో అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరవాత అసెంబ్లీకి జరిగిన 21 ఉప ఎన్నికల్లో రూలింగు పార్టీ, ప్రధాన ప్రతిపక్షం రెండూ ఘోరాతిఘోరంగా పరాభవం పాలయ్యాయి. అనేకచోట్ల ధరావతు మొత్తాలను కూడా వీరోచితంగా కోల్పోయాయి. మూడో పార్టీ దేన్నీ పైకి రానియ్యకుండా తొక్కెయ్యటానికి ఇరుపక్షాలూ లోపాయికారీ లాలూచీలు, చీకటిమాటు మాచ్‌ఫిక్సింగులు ఎన్ని చేసుకున్నా, ఎన్నికల వైతరణిని దాటటం ఏ పార్టీ వల్లా కావటం లేదు. ఎన్నికల్లో పోటీపడ్డా అధికారం దక్కించుకోవటం ఎలాగూ తమవల్ల అయ్యేట్టు లేదు కనుక, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం మళ్లీ తమకు దక్కకుండా చేసుకోవటంలో కాంగ్రెసు, దేశం శాయశక్తులా పోటీపడుతున్నాయి.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ విషయంలో మాత్రం కాంగ్రెసువారే చాలా ఫాస్టు!
రాష్ట్రంలో కాంగ్రెసు రథానికి ముఖ్యమంత్రి ఒక చక్రమైతే, పి.సి.సి. బాసు రెండో చక్రం. సరైన సమర్థులను ఆ స్థానాల్లో కూచోబెట్టి ఇద్దరికీ శ్రుతి కలిసేలా చూస్తే తప్ప బండి తిన్నగా నడవదు. ఏ బాధ్యతకు ఎవరు తగరో వారిని మాత్రమే కష్టపడి వెతికి ఏరికోరి ఎంపిక చెయ్యటం కాంగ్రెసు ప్రభువుల ప్రత్యేకత. మూడేళ్లలో మూడో కృష్ణుడిగా రంగస్థలమెక్కిన పెద్ద మనిషికి పరిపాలన బొత్తిగా కొత్త. తన కేబినెటులోని చాలామంది సీనియర్లు మొదటిసారి ఎమ్మెల్యేనో, మినిస్టరో అయిన సమయాన ఇతగాడు కాలేజీలో క్రికెటు ఆడుతూండవచ్చు. తన కొలువులో ఎంతమంది అనుభవజ్ఞులు ఉన్నా ఏదీ ఎవరితో చర్చించడు. ఎవరు చెప్పినా వినడు. ఎవరినీ నమ్మడు. కాబట్టి అతడినీ ఎవరూ నమ్మరు. 294 స్థానాలున్న అసెంబ్లీలో ముఖ్యమంత్రికి గ్యారంటీగా పడుతుందని చెప్పగలిగింది ఒకే ఒక్క ఓటు. అది ఆయనదే.
ఎంత పవరు చేతిలో ఉన్నా ఇంత ఒంటరి ఎందుకయ్యాను, ఇన్ని సమస్యలు ఎందుకు చుట్టుముట్టాయి అని ఆలోచించగా చించగా కి.కు.రెడ్డికి స్ఫురించిన అసలు కారణం ఒకే ఒకటి: తన టైము బాగాలేదు! తన ప్రమాణ స్వీకారానికి పంతులుగారు పెట్టిన ముహూర్తం సరిగా లేదు, అనగా - ఈయన అట్టర్‌ఫ్లాప్ అయిన నేరానికి ఉరి తీయాల్సింది ముహూర్తం పెట్టిన పంతులుని!
సరే! జరిగిపోయిన ముహూర్తాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. మరి ఇప్పుడు చేయవలసిందేమిటి? మహారాజశ్రీ ముఖ్యమంత్రిగారు తన అద్భుత మేధనంతా రంగరించి చాలా సీరియస్‌గా యోచిస్తే అత్యద్భుతమైన తరణోపాయం తట్టింది. వెంఠనే దాన్ని అమల్లో పెట్టేశారు. ఏమిటది? జనాన్ని ఆకట్టుకునే కొత్త పథకమా? ప్రభుత్వ ప్రతిష్ఠను అమాంతం పెంచేసే అద్భుత వ్యూహమా? కాదు. తాను కూచునే కుర్చీని వాస్తు ప్రకారం వేరేచోటికి జరిపించారు. కుర్చీ దిశమారితే పార్టీ దశమారుతుందని కి.కు.రెడ్డి గారికి గట్టి నమ్మకం.
ఇక ముఠా నాయకుడికీ, పార్టీ లీడరుకూ తేడా తెలియని లిక్కర్ డాన్ పి.సి.సి. పెద్దబాబు సరేసరి! ముఖ్యమంత్రి కాళ్లకింద మంట పెట్టేలా మీడియాకు లీకులిస్తూ, గిట్టని మీడియావాళ్లను తిట్టిపోస్తూ, తక్కువకాలంలో ఎక్కువ మందిని శత్రువులను చేసుకునే విద్యలో ముఖ్యమంత్రితో పోటీపడుతూ, పార్టీకి మిగిలిన కాస్త పరువునూ గల్లంతు చెయ్యటంతో సత్తిబాబుకు సత్తిబాబే సాటి!
రాష్ట్రంలో ఉండే రెండు పెద్దతలకాయలు ఒకరిమీద ఒకరు పితూరీలు చేస్తూ కీచులాటల్లో మునిగి తేలుతూంటే వారిపైన ఉండే ఢిల్లీ పెద్దలు ఏమి చేస్తున్నారు? ఒకరిమీద ఒకరికి ఉన్న అపనమ్మకాన్ని తొలగించి ఇకనైనా కలిసి ముందుకు నడిచేట్టు చేశారా? అది అయ్యేపని కాదనుకుంటే ఒకరినో, ఇద్దరినో మార్చి, ఉండనిచ్చే వాళ్లలో భద్రతాభావం పెంచి పార్టీకీ, ప్రభుత్వానికీ కాస్త స్థిరత్వం కలిగించారా? లేదు. ఇద్దరిమీదా రహస్య విచారణకు ఒకరి తరవాత ఒకరుగా పరిశీలకులను వదులుతున్నారు. మొన్న తెలంగాణలోలాగే రేపు సీమాంధ్ర ఉప ఎన్నికల్లోనూ పార్టీకి శృంగభంగం తప్పేట్టు లేదు. ఇప్పటికిప్పుడు పందెం గుర్రాలను మార్చినా లాభం ఉండదు. ఎలాగూ తప్పని పరాభవానికి కొత్త నాయకులను కొరతవేయనూ లేరు. కొనసాగించనూ లేరు. కాబట్టి ప్రస్తుతానికి పాతవాళ్లతోనే లాగించి ఉప ఎన్నికల తరవాత ఒకేసారి తీసెయ్యవచ్చునని ప్లాను బాగానే వేశారు. ఎన్నికలు జరిగే 18 అసెంబ్లీ స్థానాల్లో కనీసం మూడైనా గెలవకపోతే మీ పని ఖాళీ అని ఇద్దరు ముఖ్యులకూ ఇన్‌డైరెక్టుగా చెప్పేశారు.
బాగుంది. కాని ఆఖరి అవకాశం ఇచాక, దాన్ని వాడుకుని కుర్చీ కాపాడుకునేందుకు వారికి కనీస స్వేచ్ఛను మిగిల్చారా? అదీ లేదు. ఉప ఎన్నికల కాంపెయిను మొత్తాన్నీ ఢిల్లీ పెద్దలే నేరుగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. మూడు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున ఆ ప్రాంతంలో ముక్కూమొగం ఎరుగని బయటి రాష్ట్రాల పరిశీలకులను సూపర్ బాసులుగా దిగుమతి చేయనున్నారు. ఇక్కడి సంగతి సందర్భాలు ఏమీ తెలియని పెత్తందార్లకే ముఖ్యమంత్రి, పి.సి.సి. బాసు జీ హుజూర్ అని, వారి ఆదేశాల ప్రకారమే పని చేయవలసి ఉంటుంది.
ఎన్నికలు గెలవటంలో తమ నేర్పరితనాన్ని మొన్ననే ఉత్తరప్రదేశ్‌లో అద్భుతంగా లోకానికి చాటిన అధినాయకత్వం రేపు ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికల్లోనూ తమ పనివాడి తనాన్ని నేరుగా చూపించదలిస్తే మంచిదే. యు.పి.లాగే కర్మంచాలక ఇక్కడా మట్టికరిస్తేనో? బయటినుంచి వచ్చిన పరిశీలక గుత్తేదార్లు, వారిని నడిపించిన హైకమాండు పెత్తందార్లు బాధ్యత వహిస్తారా?
లేదు. తాము డమీలుగా చేసిన ముఖ్యమంత్రిని, పి.సి.సి. పెద్దను బలిపీఠం ఎక్కిస్తారు! బొమ్మపడితే అధిష్ఠానం గెలుస్తుంది. బొరుసుపడితే ఇక్కడి ఇద్దరికీ మూడుతుంది. నాలుగో కృష్ణుడికి తెరలేస్తుంది.
భలే!
Share this article :

0 comments: