రూ.6,000 కోట్ల కరెంటు షాక్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.6,000 కోట్ల కరెంటు షాక్!

రూ.6,000 కోట్ల కరెంటు షాక్!

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

చార్జీల పెంపునకు నేడే సర్కారు పచ్చజెండా 
ఉదయం ఈఆర్‌సీకి అధికారికంగా ప్రభుత్వ లేఖ
సాయంత్రమే ఆదేశాలు జారీ చేయనున్న ఈఆర్‌సీ
ఏప్రిల్ 1 నుంచే కొత్త చార్జీల అమలు
ఆర్-ఎల్‌ఎన్‌జీకి తలూపేలా ఈఆర్‌సీపై సర్కారు ఒత్తిడి
దాంతో రూ.4,000 కోట్ల నుంచి 6,200 కోట్లకు చేరిన భారం
మే నుంచి రూ.1,058 కోట్ల మేరకు మళ్లీ సర్దుబాటు వడ్డన!

సాక్షి, హైదరాబాద్: రోజుకో రకం బాదుడుతో ఇప్పటికే హడలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్ గట్టిగా కొట్టనుంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్‌పై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి శనివారం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఫలితంగా జనంపై ఏకంగా రూ.6,000 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది. కొత్త కరెంటు చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మే నెల బిల్లు నుంచి వినియోగదారులపై ఆ ప్రభావం పడుతుందన్నమాట. నిజానికి 2013-14లో ఏకంగా 12,753 కోట్ల దాకా కరెంటు చార్జీల పెంపునకు ఈఆర్‌సీని డిస్కంలు అనుమతి కోరాయి. ఈ ప్రతిపాదనలపై ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయం సేకరించగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. 

పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించాలంటూ విచారణను కూడా జనం అడ్డుకున్నారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన ఈఆర్‌సీ భారాన్ని సుమారు రూ.4,000 కోట్లకు పరిమితం చేయాలని నిర్ణయించింది. యూనిట్‌కు ఏకంగా రూ.12 వెచ్చించి మరీ ఖరీదైన రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జీ)తో విద్యుదుత్పత్తి చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఈఆర్‌సీ నిర్ణయంపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం.. ఆర్-ఎల్‌ఎన్‌జీతో విద్యుత్ ఉత్పత్తిని అంగీకరించేలా దానిపై అనధికారికంగా ఒత్తిడి తెచ్చింది. దాంతో 2013 ఏప్రిల్, మే మాసాలతో పాటు 2014 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆర్-ఎల్‌ఎన్‌జీ ద్వారా విద్యుదుత్పత్తి చేసేందుకు ఈఆర్‌సీ అంగీకరించింది. ఫలితంగా ఆర్-ఎల్‌ఎన్‌జీతో కలుపుకుని జనం నెత్తిన మొత్తం చార్జీల భారం 5,800 కోట్ల నుంచి 6,200 కోట్ల మేరకు పడనుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇలా కరెంటు చార్జీలను ఈఆర్‌సీ ప్రతిపాదనల కంటే ఎక్కువగా పెంచుతున్న సర్కారు, మరోవైపు డిస్కంలకు సబ్సిడీని మాత్రం తగ్గించింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రూ.5,800 కోట్లు వస్తాయని డిస్కంలు అంచనా వేశాయి. ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో 5,700 కేటాయించింది. కానీ రూ.5,500 కోట్లు మాత్రమే ఇస్తామని తాజాగా ఈఆర్‌సీకి తేల్చి చెప్పింది. అలా రూ.300 కోట్లకు కోత పెట్టిందన్నమాట!

‘అధికారిక’ అస్పష్టత!

రోజుకో నిర్ణయంతో ఈఆర్‌సీతో ఆడుకుంటున్న ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా తన నిర్ణయం మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. డిస్కంల ప్రతిపాదనలపై కసరత్తు చేసిన ఈఆర్‌సీ, తుది నిర్ణయం తెలపాలని గత వారంలోనే ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు పంపింది. దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పైగా అనధికారికంగా రోజుకో నిర్ణయంతో ఈఆర్‌సీనే నియంత్రిస్తోంది. కొత్త టారిఫ్‌పై మార్చి 27 లేదా 28న ఆదేశాలు రావాల్సి ఉన్నా ఈ కారణంగానే వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం ఈఆర్‌సీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖ అందవచ్చని, అనంతరం చార్జీలపై ఈఆర్‌సీ అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మే నుంచి రూ.1,058 కోట్ల 
సర్దు‘పోటు’!

మరోవైపు 2012-13 మూడో త్రైమాసికం రూపంలో వచ్చే మే నెల నుంచి మరో సర్దుబాటు పోటు కూడా వినియోగదారుల నడ్డి విరవనుంది. ఈ ప్రతిపాదనలపై మార్చి 18న ఈఆర్‌సీ ఇప్పటికే బహిరంగ విచారణ నిర్వహించింది. వీటిపై ఏప్రిల్ మూడో వారంలో తుది ఆదేశాలు జారీచేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అంటే మే నుంచి మూడో త్రైమాసికపు సర్దుబాటు చార్జీల వడ్డన కూడా మొదలవనుందన్నమాట. యూనిట్‌కు 95 పైసల చొప్పున రూ.1,058 కోట్ల మేరకు సర్దుబాటు భారం ప్రజలపై పడనుంది. 2012-13 రెండో త్రైమాసికపు సర్దుబాటు చార్జీల వడ్డన మార్చి నుంచి మొదలవడం తెలిసిందే. యూనిట్‌కు 62 పైసల చొప్పున మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వినియోగదారుల నుంచి రూ.750 కోట్లకు పైగా వసూలు చేసుకోవాల్సిందిగా డిస్కంలను ఈఆర్‌సీ ఆదేశించింది.
Share this article :

0 comments: