9న రాష్ట్ర బంద్ -వైఎస్సార్ సీపీ పిలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 9న రాష్ట్ర బంద్ -వైఎస్సార్ సీపీ పిలుపు

9న రాష్ట్ర బంద్ -వైఎస్సార్ సీపీ పిలుపు

Written By news on Friday, March 29, 2013 | 3/29/2013

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసన
3న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు
5 నుంచి 14 వరకు ప్రజా బ్యాలెట్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్ణయం
ఉద్యమాల్లో విజయమ్మ పాల్గొంటారని పార్టీ నేత కొణతాల వెల్లడి
బాబు పాలన నాటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే నెల 9వ తేదీన రాష్ట్ర బంద్ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రం అనేక సమస్యలతో అతలాకుతలమవుతున్న తరుణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టి వచ్చేనెల 9కి పదేళ్లు పూర్తవుతుందని, ఇప్పుడు రాష్ట్రంలో అవే పరిస్థితులు తిరిగి నెలకొన్నాయని, అందువల్ల అదే రోజున బంద్ చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వంపై నిరంతర పోరాటం సాగించాలని పార్టీ తీర్మానించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను సమావేశం ఖరారు చేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా బంద్‌కు పిలుపునిచ్చింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రజా పోరాటాన్ని ఉధృతంగా చేపట్టాలని కూడా నిర్ణయించింది.

సమావేశం వివరాలను కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. విద్యుత్ సమస్యపై వామపక్షాలు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ సంఘీభావం ప్రకటించిందని తెలిపారు. ‘‘పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో అతలాకుతలమయ్యారు. అనేక బాధలు పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చారిత్రాత్మకమైన రీతిలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. ఆ యాత్ర చేపట్టి వచ్చే నెల 9వ తేదీకి పదేళ్లు అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు మళ్లీ నెలకొన్నాయి.

అందుకే 9న బంద్ చేపట్టాలని నిర్ణయించాం. ఆనాటి వైఎస్ ప్రజాప్రస్థానం నుంచి ఈనాటి షర్మిల మరో ప్రజాప్రస్థానం వరకూ జరిగిన పరిణామాలను ప్రజలకు వివరిస్తాం. అదే రోజున పార్టీ శ్రేణులు వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించి ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవుతారు. అదే రోజున విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దానికి మేము మద్దతు ప్రకటించాం’’ అని చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరడంతోపాటు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 3వ తేదీన శాసన సభా నియోజకవర్గ కేంద్రాలన్నింటిలోనూ ధర్నాలు జరుగుతాయని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి రోజైన ఏప్రిల్ 5వ తేదీ నుంచి అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీ వరకు విద్యుత్ పరిస్థితిపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యుత్ చార్జీలు పెంచడం సరైనదేనా, కాదా?, కరెంటు సరఫరా బాగుందా, లేదా? అనే అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. మండల, మున్సిపాలిటీ, మేజర్ గ్రామపంచాయతీలతో సహా అన్ని చోట్లా బ్యాలెట్ నిర్వహిస్తామన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వీలునుబట్టి ఈ ఉద్యమాలన్నింటిలోనూ పాల్గొంటారని వెల్లడించారు.

బషీర్‌బాగ్ కాల్పులనూ బాబు బ్లాక్ పేపర్‌లో చేర్చాల్సింది: కొణతాల

విద్యుత్ సమస్యపై బ్లాక్ పేపర్ అంటూ టీడీపీ విడుదల చేసిన పత్రంలోని అంశాలపై కొణతాల తీవ్రంగా దుయ్యబట్టారు. తొమ్మిదేళ్ల పాలనలో దాదాపు ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన ఘనత చంద్రబాబుదని, అలాంటి వ్యక్తి వైఎస్‌పై నిందలేయడమేమిటని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ బషీర్‌బాగ్ వద్ద ఆందోళన చేస్తే మరో జలియన్‌వాలాబాగ్ తరహాలో ఉద్యమకారులను కాల్చి చంపిన విషయం బాబు మరిచారా అని ప్రశ్నించారు.

ఈ కాల్పుల ఘటనను కూడా బ్లాక్‌పేపర్‌లో పొందుపర్చాల్సిందని అన్నారు. ఆ ఉదంతాన్ని బాబు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. బాబు ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులతో చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రజలకు ఎలా అన్యాయం చేశారో ఆ పేపర్‌లో వివరించి ఉంటే బాగుండేదని అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం వల్ల బడ్జెట్‌పై భారం పడుతోందని చెప్పి ఒకేసారి రూ.3,500 కోట్ల మేరకు అన్ని రకాల పన్నులను చంద్రబాబు విధించారని, ఆ తరువాత ఆ రెండు పథకాలను ఎత్తివేశారని తెలిపారు. అప్పటి చంద్రబాబు పాలనకు, ఇప్పటి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనకు ఏమాత్రం తేడా లేదని అన్నారు. అప్పటి విధానాలే ఇప్పుడు పునరావృతమవుతున్నాయని చెప్పారు. రైతులు, సామాన్య ప్రజల కోసం వైఎస్ చేపట్టిన పథకాలన్నింటికీ ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు. అందుకే తమ పార్టీ ప్రభుత్వ విధానాలపై నిరంతర పోరాటం కొనసాగిస్తుందని కొణతాల తెలిపారు.
Share this article :

0 comments: