నాయకుడు ప్రజల్లోంచి రావాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాయకుడు ప్రజల్లోంచి రావాలి

నాయకుడు ప్రజల్లోంచి రావాలి

Written By news on Tuesday, March 26, 2013 | 3/26/2013

చంద్రబాబు, కిరణ్ అలా వచ్చినవారు కాదు
అందుకే వారికి జనం గుండె చప్పుడు వినిపించదు
వారి కన్నీళ్లు తుడవాలనే తపనా వారికి ఉండదు
ఈ ప్రభుత్వం రోజుకు 4 గంటలైనా కరెంటు ఇవ్వట్లేదు
పరీక్ష సమయంలో కోతలేమిటన్న ఇంగితమూ లేదు
జగనన్న వస్తాడు.. రాజన్న రాజ్యం తెస్తాడు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 101, కిలోమీటర్లు: 1,385.6

 ‘‘నాయకుడు అంటే సీల్డు కవర్లలోంచి పుట్టడం కాదు. ప్రజల్లోంచి రావాలి. ప్రజల కోసం రావాలి. కష్టమైనా.. నష్టమైనా ప్రజల మధ్యే నిలబడాలి. ప్రతి కార్యకర్త ఇతనే మా నాయకుడు అని కాలర్ ఎగరేసి గొప్పగా చెప్పుకునేటట్లు ఉండాలి. చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ... వీళ్లిద్దరిలో ఏ ఒక్కరూ కూడా ప్రజల నుంచి వచ్చిన నాయకులు కాదు. ఒకరేమో పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వస్తే, మరొకరు ఢిల్లీ సీల్డు కవర్‌లో నుంచి దిగిపడ్డారు. వీళ్లకు ప్రజా సమస్యలు అంటే ఏమిటో తెలియదు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ఇలాంటి నేతలకు ప్రజల గుండె చప్పుడు విని వాళ్ల కన్నీళ్లు తుడవాలనే తపన ఉండదని, ఈరోజు వారి చేతిలో మన రాష్ట్రం ఉండటం దురదృష్టకరమని అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగింది. తాడేపల్లిలో జరిగిన రచ్చబండలో షర్మిల పాల్గొన్నారు. ఉండవెల్లి గ్రామంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి అదే వేదికపై నుంచి కొద్దిసేపు మాట్లాడారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే...

ఈ ప్రభుత్వం ప్రజల రక్తం పిండుతోంది..

వృద్ధులకు వైఎస్ ఇచ్చిన పింఛన్లను, పేదలకు ఇచ్చిన రేషన్ కార్డులను కూడా ఈ ప్రభుత్వం తీసేస్తోంది. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లేవు. పేదలకు పక్కా ఇళ్ల పథకాన్ని ఎప్పుడో అటకెక్కించింది. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయం ఇది.. ఈ సమయంతో విద్యుత్తు కోతలు పెడితే విద్యార్థులు పరీక్షలు సరిగా రాయలేరనే కనీస ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రోజుకు నాలుగు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదుగానీ బిల్లులు మాత్రం మూడింతలు, నాలుగింతలు పంపుతున్నారు. చార్జీలు అని.. సర్ చార్జీలు ప్రజల నెత్తిన రూ.32 వేల కోట్ల భారాన్ని వేసి ప్రజల రక్తం పిండుతోంది ఈ ప్రభుత్వం. ఇది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.

వైఎస్ మాత్రమే తండ్రిలా ఆలోచించారు..

గత 15 ఏళ్లుగా చూసుకుంటే ముందు తొమ్మిదేళ్లు చంద్రబాబు సీఎంగా పని చేశారు. ఈ మూడేళ్ల నుంచి కిరణ్ పాలన సాగుతోంది. మధ్యలో వైఎస్ సువర్ణపాలన సాగింది. చంద్రబాబు పాలన ఒక చీకటి అధ్యాయం.. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్ ప్రభుత్వం నడుస్తోంది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే వైఎస్ ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఈరోజు వైఎస్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అందక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చదువులు మధ్యలోనే ఆగే పరిస్థితి ఏర్పడింది. బాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీని ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్పుకుంటున్నా.. రూ.2, రూ.3 వడ్డీ తీసుకుంటున్నారని మహిళలు చెప్తున్నారు.

టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేశాయి..

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే దానికి అండగా నిలబడ్డారు. ఈ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. జగనన్నను అబద్ధపు కేసులతో జైల్లో పెట్టారు. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.

సోమవారం 101వరోజు మరో ప్రజాప్రస్థానం ఎర్రబాలెం గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి నులకపేట, ముగ్గరోడ్డు, తాడేపల్లి, ఉండవల్లి మీదుగా గుంటూరు జిల్లా సరిహద్దులో ప్రకాశం బ్యారేజ్‌కు ఇవతలి వైపు ఉన్న సీతానగర్ చేరింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరకున్నారు. సీతానగర్‌లో జాలర్లు షర్మిలకు చేపల వల, జాలరి టోపీ ఇచ్చారు. సోమవారం 10.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1385.6 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్కే, తలశిల రఘురాం,పుత్తా ప్రతాప్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ స్థానిక నాయకులు సాయిబాబు మాదిగ తదితరులున్నారు.

నేడు కృష్ణా జిల్లాలోకి షర్మిల పాదయాత్ర

గుంటూరు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 31 రోజుల పాటు 371.5 కిలో మీటర్ల మేర సాగింది. మొత్తం 14 నియోజకవర్గాలు, 5 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌తోపాటు 225 గ్రామాల్లో యాత్ర జరిగింది. మంగళవారం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగర్ మీదుగా ప్రకాశం బ్యారేజ్ దాటుకొని కృష్ణా జిల్లా విజయవాడలో ప్రవేశిస్తుందని పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. జిల్లాలో సుమారు 20 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
Share this article :

0 comments: