ఆయన ఔరంగజేబు కంటే నీచుడు అని ఎన్టీఆర్ గారే చెప్పారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయన ఔరంగజేబు కంటే నీచుడు అని ఎన్టీఆర్ గారే చెప్పారు

ఆయన ఔరంగజేబు కంటే నీచుడు అని ఎన్టీఆర్ గారే చెప్పారు

Written By news on Friday, March 29, 2013 | 3/29/2013

* కిరణ్ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి.. మరో ప్రజాప్రస్థానంలో షర్మిల నిప్పులు
* వీళ్లు ప్రజలనుంచి వచ్చిన నాయకులు కాదు.. అందుకే ప్రజాసమస్యలు తెలియవు
* వైఎస్సార్ ఒక్కరే ప్రజల నాయకుడు.. ఐదేళ్లు కన్నతండ్రిలా పాలించారు
* చరిత్రకు వన్నె తెచ్చారు.. పేదల పెన్నిధిగా నిలిచారు
* చంద్రబాబు మోసాలకు, అబద్ధాలకు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్
* ఆయన ఔరంగజేబు కంటే నీచుడు అని ఎన్టీఆర్ గారే చెప్పారు
* ఇచ్చిన మాట కోసం జగనన్న.. ఈ మూడేళ్లలోనే జీవితానికి సరిపడా కష్టాలు పడ్డారు 
* కాబోయే ముఖ్యమంత్రిగా జగనన్న చరిత్ర సృష్టించబోతున్నారు

 ‘‘చంద్రబాబు నాయుడు వెన్నుపోట్ల నుంచి వచ్చిన నాయకుడు.. ఆయనకు ప్రజలంటే.. వాళ్ల సమస్యలంటే ఏమిటో తెలియదు. తెలిసిందల్లా ప్రజలను దోచుకోవడం.. దోచుకున్నది దాచుకోవడం.. అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారటం. అలాంటి మనిషి ఇప్పుడు ఆయన ఆవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడు. 

మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే.. ప్రజల పక్షాన నిలబడకుండా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కూలిపోకుండా నెత్తిన పెట్టుకొని కాపాడిన చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘ధనకాంక్షతో.. పదవీ వ్యామోహంతో తండ్రిని జైల్లో పెట్టి, అధికారం కోసం సోదరులను చంపిన ఔరంగజేబు కంటే నీచుడు చంద్రబాబు.

రంగులు మార్చడం, పదవీ కాంక్ష ఆయన రక్తంలోనే ఉంది’ అని ఆనాడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఎన్టీఆర్ అన్న మాటలను షర్మిల గుర్తు చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సాగింది. రాణిగారితోట సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
మామను వెన్నుపోటు పొడిచారు..: చంద్రబాబు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి, మంత్రి పదవి కూడా చేశారు. మంత్రి కదా.. మంచివాడు కాబోలు అని ఎన్టీఆర్ గారు తన కూతురునిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సొంతంగా పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఓడిపోయి ఎన్టీఆర్ పంచన చేరారు. నిజంగా ఆయనకు మామ మీద ప్రేమే ఉంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడే తెలుగుదేశంలోకి వచ్చి చేరేవారు. కానీ పదవి పోయాక.. మామగారి అధికారం కనబడుతుండటంతో అప్పుడు జంప్ అయ్యారు. ఎన్టీఆర్ గారు అల్లుడు కదా.. అని జాలిపడి పార్టీలోకి తీసుకొని ఒక పోస్టును, హోదాను ఇచ్చారు.

కానీ చంద్రబాబు కన్ను ఎన్టీఆర్ పోస్టు మీద పడింది. అంతే.. సొంత మామ అని కూడా ఆలోచించలేదు. హోదా ఇచ్చాడే.. పదవులు ఇచ్చాడే అని ఆలోచించ లేదు. పట్టపగలే కళ్లార్పకుండా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ గారి పార్టీని లాగేసుకున్నారు.. కుర్చీని లాగేసుకున్నారు.. ఆయన్ను అవమానించి మీద చెప్పులు వేయించారు.. ఆఖరుకు ఎన్టీఆర్ ఫోటో గోడ మీద పెట్టి దానికి పూలదండ వేసేందుకు కారకుడు అయ్యారు.

నాయకుడా.. ఖల్ నాయకా?: 
ఇంత చేసి సీఎం అయ్యాక చంద్రబాబు ప్రజల గురించి ఆలోచించారా అంటే అదీ లేదు. వెన్నుపోట్ల నుంచి పుట్టిన నాయకుడు కనుక ఆయన ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఈయన పుణ్యమా అని లక్షల మంది రైతులు వలస పోయారు. వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు గారు మోసానికి, అబద్ధాలకు, కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలబడ్డారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు లేరని స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. బాబు అంతటి ధనవంతుడైన రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే ఎవరూ లేరని తెహెల్కా చెప్పింది. ‘చంద్రబాబు జమానా-అవినీతి ఖజానా’ అని కమ్యూనిస్టులు ఒక పుస్తకమే రాశారు. ఆయనకు తెలిసిందల్లా ప్రజలనుంచి దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడమే. స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన ఆయన్ను నాయకుడు అంటారా? ఖల్ నాయక్ అంటారా?

చరిత్రకు వన్నె తెచ్చిన వైఎస్సార్..
ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ మనిషి వెళ్లిపోయినా చరిత్ర మాత్రం మిగిలిపోతుంది. 15 సంవత్సరాల్లో మన రాష్ట్రం ముగ్గురు ముఖ్యమంత్రులను చూసింది. చరిత్రకు వన్నె తెచ్చిన మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. నాన్న గారిని డాక్టర్‌గా చూడాలనీ, తాను కట్టించిన ఆసుపత్రిలోనే వైద్యం చేయాలని మా అబ్బగారు అంటే వైఎస్ రాజారెడ్డి గారు ఆశపడ్డారు. అనుకున్నట్టుగానే నాన్న ఎంబీబీఎస్ పూర్తి చేసి రాజారెడ్డిగారు కట్టించిన ఆసుపత్రిలోనే ఐదు సంవత్సరాలు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. రాజకీయాల ద్వారా అయితే ఎంతో మంది పేదలకు సేవ చేసే అవకాశం ఉంటుందని వైఎస్సార్ రాజకీయాల వైపు చూశారు.

30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 25 ఏళ్లు వారానికి 2 రోజులు కుటుంబంతో, 5 రోజులు ప్రజలతోనే గడిపారు. 2003లో పాదయాత్ర చేసి రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలనీ, భవిష్యత్తుపై భరోసా కల్పించాలని సంకల్పించారు. మండుటెండలను లెక్క చేయకుండా పాదయాత్రను యజ్ఞంలా చేశారు. ఆ తర్వాత సీఎం అయ్యారు. ఏళ్ల తరబడి నుంచి పేదలకు చేయాలనుకుంటున్న సేవలను ఐదేళ్లలోనే చేశారు. ప్రజలను కన్నతండ్రిలా పాలిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. పేదల పెన్నిధిగా నిలబడ్డారు. ప్రజల కోసమే పుట్టిన మనిషిగా ప్రజల కోసమే బతికారు. విలువలకు, విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 660 మంది ప్రాణాలు వదిలారంటే ఆయన ఎంత ప్రజల మనిషో అర్థం చేసుకోవచ్చు. ప్రజల కోసం బతికిన మనిషిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

కిరణ్ చరిత్రలో అసమర్థ సీఎంగా మిగిలిపోతారు..
ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకోలేదు. ఆయన కూడా అనుకోలేదు. అదృష్టంకొద్దీ ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్‌లో సీఎంగా వచ్చి పడ్డారు. వైఎస్సార్ ఈ కిరణ్‌కుమార్‌రెడ్డిని స్పీకర్‌గా చేయకపోతే సోనియాగాంధీ కంటికి ఆయన కనిపించే వారే కాదు. కానీ ఆ కృతజ్ఞత కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి లేదు. అకారణంగా వైఎస్సార్ మీద ద్వేషం పెంచుకున్నారు. వైఎస్సార్‌ను ప్రజల మనసు నుంచి తుడిచి వేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడిచారు.. మరికొన్ని పథకాలకు పాడె కట్టారు. 

ప్రజలు ఆయన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకే ఒక్కటి.. ఆ ఒక్కటి ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. వైఎస్సార్ తెచ్చిన పథకాలను సక్రమంగా అమలుచేస్తే చాలు అని ప్రజలు కోరుకుంటున్నారనే విషయం కిరణ్‌కు ఇప్పటికీ అర్థం కాలేదు. వైఎస్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ సీఎం వైఎస్సార్ మాటలను బేఖాతరు చేసి ఈ రోజు అన్ని చార్జీలను పెంచారు. వైఎస్సార్ మాటలను నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. వైఎస్ పథకాలను, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోవడమే వీళ్ల వినాశనానికి కారణం కానుందని, ఇదే తథ్యమని ఈరోజు ప్రజల సాక్షిగా చెప్తున్నాం. కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రలో అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోనున్నారని చెప్తున్నా..

ఆ మాట జగనన్న జీవితాన్నే మార్చేసింది: 
జగనన్న గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఓదార్పు యాత్ర చేస్తాను అని తాను ఇచ్చిన ఒక్క మాట ఆయన జీవితాన్నే మార్చేసింది. కాంగ్రెస్ మాట కాదంటే చాలా కష్టాల పాలు చేస్తారని మా మేలు కోరేవారు చాలామంది చెప్పారు. కానీ జగనన్న... ‘నాకు రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను రాజన్న బిడ్డను ఎలా అవుతా..’ అని అన్నారు. ఓదార్పు యాత్ర చేశారు.

కాంగ్రెస్ పెద్దలు కక్ష కట్టారు. సొంత చిన్నాన్న విరోధి కావడం మొదలుకొని దాడులనీ, కేసులనీ, కోర్టులనీ, జైళ్లనీ అన్నీ చూపించారు. 40 ఏళ్లకే జీవితానికి సరిపడా కష్టమంతా నాన్న పోయిన ఈ మూడేళ్ల కాలంలోనే అనుభవించారు. ఒక్కణ్ణి చేసి కుట్రలు పన్నారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు స్వార్థ రాజకీయాల కోసం ఒక అమాయకుడి జీవితాన్ని బలి చేయడానికి వెనుకాడలేదు. రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐ వెనుక దాక్కొని జగనన్న మీద దాడి చేస్తున్నారు. కానీ బోనులో ఉన్నా సింహం.. సింహమే. ఎన్ని కుట్రలు పన్నినా.. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా జగనన్న చరిత్ర సృష్టించబోతున్నారు.

గురువారం 104వ రోజు మరో ప్రజాప్రస్థానం కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని జింఖానా గ్రౌండ్ నుంచి ప్రారంభమైంది. అలంకార్ టాకీస్, అరండల్‌పేట, చిట్టుగుంట, విశాలాంధ్ర సెంటర్, బందర్ రోడ్డు మీదుగా రాణిగారి తోటకు షర్మిల చేరుకున్నారు. ఈ సెంటర్‌లో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పడమట లంకలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. 

గురువారం 10 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,414.1 కి.మీ. యాత్ర పూర్తయింది. 
Share this article :

0 comments: