తెలిసీ ఆపలేదేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలిసీ ఆపలేదేం?

తెలిసీ ఆపలేదేం?

Written By news on Sunday, February 24, 2013 | 2/24/2013

నిఘా వర్గాలు సమాచారమిచ్చినా మన సర్కారు ఎందుకు స్పందించ లేదు?
బాంబు పేలుళ్లను నిరోధించడంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైంది
పక్కా సమాచారం ఉన్నా కేంద్రం రాష్ట్రానికి చెప్పి చేతులు దులుపుకొంది
ఈ ఘాతుకానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్రమా? రాష్ట్రమా?
అన్నింట్లో విఫలమైనా ఈ ప్రభుత్వంపై చంద్రబాబు మాత్రం అవిశ్వాసం పెట్టరు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 72, కిలోమీటర్లు: 1,021

రాజధాని హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పొంచి ఉన్నారని, ఏ సమయంలోనైనా దాడులు జరగొచ్చని దేశంలోని నిఘా వర్గాలు హెచ్చరించినా బాంబు పేలుళ్లను ఎందుకు నివారించలేకపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రాష్ట్ర సర్కారును నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మూడు రోజుల విరామం తరువాత శనివారం నల్లగొండ జిల్లా వాడపల్లి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిచి షర్మిల వాడపల్లి బ్రిడ్జి మీదుగా గుంటూరు జిల్లా పొందుగల గ్రామంలో అడుగుపెట్టారు. తనకు స్వాగతం చెప్పేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన గుంటూరు జిల్లా ప్రజలను ఉద్దేశించి షర్మిల పొందుగల గ్రామంలో ప్రసంగించారు. తన ప్రసంగానికంటే ముందు రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన బాంబు పేలుళ్ల మృతులకు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు. షర్మిల ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఎందుకు ఆపలేకపోయారు?

హైదరాబాద్‌లో బాంబులు పేలి 16 మంది చనిపోయారు. 130 మంది గాయపడ్డారు. ప్రమాదం జరగడానికి కంటే మూడు రోజుల ముందే కేంద్ర మంత్రి హెచ్చరికలు చేశారట. మూడు నెలల కిందట ఢిల్లీ పోలీసులు ఒక ఉగ్రవాదిని విచారిస్తుంటే దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో రెక్కీ చేశామని చెప్పాడట. మహారాష్ర్టలో మరో ఉగ్రవాదిని పట్టుకొని విచారిస్తే అతడు కూడా హైదరాబాద్ టార్గెట్ అని చెప్పాడట. అమెరికా వాళ్లు కూడా ప్రమాదం జరుగబోతోందని హెచ్చరించినా బాంబు పేలుళ్లను నిరోధించడంలో మన ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వమేమో మేం ముందే సమాచారం ఇచ్చామని చెప్పి ఏమీ చేయకుండా చేతులు దులిపేసుకుంది. 

ఇక్కడ మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేమో.. చాలా రొటీన్‌గా వచ్చే సమాచారమని, ప్రజలు పెద్దగా భయపడాల్సిన పని లేదని చెప్పి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఆక్టోపస్‌ను గాని, యాంటీ టైస్ట్ స్క్వాడ్‌నుగాని దింపి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నమే చేయలేదు. ఇవాళ ప్రతి పౌరుడూ కూడా ప్రశ్నిస్తున్నాడు.. మీకు సమాచారం ఉండి కూడా ఎందుకు ఆపలేకపోయారని? ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్రమా? రాష్ట్రమా? అని అడిగితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇదీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. వీళ్ల చొక్కా పట్టుకొని నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. కానీ ఆయన నిలదీయడు. ఆయనకు ప్రజలు ఏమైపోయినా బాధలేదు. ఆయన అవినీతి ఆరోపణల మీద ఏ విచారణా రాకుంటే చాలు అనుకుంటున్నాడు.

అది‘మీ కోసం’ కాదు...‘తన కోసం’

చంద్రబాబు ‘మీ కోసం’ అని చెప్పుకుంటూ పాదయాత్ర డ్రామాలాడుతున్నారు. కానీ అది ప్రజల కోసం కానేకాదు. ప్రజల కోసమైతే.. వాళ్లు పడుతున్న కష్టాలను చూసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఏనాడో అవిశ్వాసం పెట్టేవారు. తన కోసమే గనుక ఎన్నికలు వచ్చినప్పుడు తన పేరు జ్ఞాపకం పెట్టుకోండని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన పాదయాత్రలో అన్నీ అబద్ధాలే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. తనకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చెబుతున్నారాయన. ఆ మాట విన్నప్పుడల్లా నాకు ఒక సామెత గుర్తొస్తోంది.. పేనుకు పెత్తనం ఇస్తే అంతా గొరిగేసిందట. 

గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజులు, హైదరాబాద్ పేలుళ్లలో మృతులకు సంతాప సూచకంగా ఒక రోజు తన పాదయాత్రకు విరామం ప్రకటించిన షర్మిల.. శనివారం యాత్ర పునఃప్రారంభించారు. నల్లగొండ జిల్లా విష్ణుపురం నుంచి మొదలైన 72వ రోజు పాదయాత్ర వాడపల్లి, వాడపల్లి బ్రిడ్జి మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. తెలంగాణ ప్రజలు పంచిన ప్రేమాభిమానాలను గుండెల నిండా నింపుకొని షర్మిల.. పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో అడుగుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగా కృష్ణమూర్తి పల్నాడు వీరత్వానికి ప్రతీకగా కత్తి, డాలు, కిరీటాలను షర్మిలకు బహూకరించి సాదరంగా ఆహ్వానించారు. కృష్ణమ్మ ఒడ్డున పొదిగినట్లున్న పొందుగల గ్రామంలో షర్మిల గుంటూరు జిల్లాలో తొలిప్రసంగం చేశారు. అక్కడి నుంచి దాదాపు 4.5 కిలోమీటర్లు సాగి శ్రీనగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. శనివారం మొత్తం 9 కిలోమీటర్ల దూరం ఆమె నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,021 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిలకు స్వాగతం పలికి వెంట నడిచిన నేతల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేక తోటి సుచరిత, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, రావి వెంకటరమణ, కోన రఘుపతి, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గౌతంరెడ్డి, డాక్టర్ హరికృష్ణ, తాడి శకుంతల ఉన్నారు. వీడ్కోలు పలికిన నల్లగొండ జిల్లా నేతల్లో బీరవోలు సోమిరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.ఎల్.ఎన్.ప్రసాద్, స్థానిక నాయకులు ఇంజం నర్సిరెడ్డి, శ్రీకళారెడ్డి, బోయపల్లి అనంతకుమార్, అల్కా శ్రావణ్‌రెడ్డి, కుంబం శ్రీనివాసరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: