ఈ తిండి తిని మా పిల్లలు పెద్దోళ్ల పిల్లలతో పోటీపడి చదవగలరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ తిండి తిని మా పిల్లలు పెద్దోళ్ల పిల్లలతో పోటీపడి చదవగలరా?

ఈ తిండి తిని మా పిల్లలు పెద్దోళ్ల పిల్లలతో పోటీపడి చదవగలరా?

Written By news on Friday, June 28, 2013 | 6/28/2013

- నాసిరకం సరుకులను చూపిస్తూ, ఎలా తినేదంటూ ఆవేదన
- ‘రూ.185కు 9 సరుకుల’పై విమర్శల వెల్లువ 
- ఉద్వేగానికి లోనైన షర్మిల.. సర్కారు తీరుపై మండిపాటు 
- వాటిని కిరణ్ తిని చూస్తే తెలుస్తుందంటూ ధ్వజం
- ఎన్నికల పథకాలతో మోసపుచ్చుతారా అంటూ నిలదీత

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘రూ.185కే తొమ్మిది సరుకులు’ అంటూ పంచ రంగుల కరపత్రాలతో ఊదరగొట్టి పేదలను ఊహా లోకంలో తిప్పిన ‘అమ్మహస్తం’ పథకం అసలు రంగు బయట పడింది. సర్కారు ఇచ్చిన సంచిలో పుచ్చు పట్టిన సరుకులే తప్ప తినటానికి పనికొచ్చేవి లేనేలేవని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ సరుకులు వద్దంటే రేషన్ కార్డు ఇచ్చి వెళ్లండని అధికారులు బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మేం పేదోళ్లమే. కూటికి లేనోళ్లమే. అంతమాత్రాన మాతో మట్టి తినిపిస్తారా అమ్మా?’ అని కృష్ణాపురం గ్రామానికి చెందిన ఉత్తరాల నూకరత్నం అన్న మాటలకు, ‘ఈ సరుకులతో వండి పెడితే పిల్లలు బతుకుతారా? ఈ తిండి తిని మా పిల్లలు పెద్దోళ్ల పిల్లలతో పోటీపడి చ దవగలరా అక్కా?’ అని భోగాపురం గ్రామంలో శారద అన్న మాటలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. నూకరత్నంను దగ్గర తీసుకొని ఓదార్చారు. ‘అమ్మ హస్తం కింద రూ.185కే 9 సరుకులంటూ రంగులు పూసిన సంచిని పేపర్లలో, టీవీల్లో చూపిస్తే కడుపు నిండా తినొచ్చని సంబరం పడ్డాం. కానీ మూట విప్పి చూస్తే దాని రంగు బయట పడింది. 

మీరు కూడా చూడండమ్మా’ అంటూ స్వామి మహిళా గ్రూపు సభ్యులు రవణమ్మ, లక్ష్మి కారాన్ని తీసి నీళ్లలో కలిపితే తెల్లగా నీళ్లపై తేలింది. పసుపు తీసి నీళ్లలో పోస్తే మునిగిపోయింది. చింతపండు మీద లేత గులాబీ రంగులో బియ్యపు పురుగు వంటి పురుగులు పాకుతూ కన్పించాయి. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పలు గ్రామాల్లో గురువారం ఇదే పరిస్థితి ఆవిష్కృతమైంది. ప్రజలంతా అమ్మహస్తం పథకం కింద తమకు ప్రభుత్వం ఇస్తున్న 9 సరుకుల లోగుట్టును చూపించారు. మిరప కాడలను మరపట్టి, దానికి రంగులేసి ప్యాక్ చేసి కారం పొడి అంటూ ఇస్తున్నారు. ఇలాంటి కారంలో కార్సినోజనిక్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, దాన్ని తింటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువని వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇలాంటి కారాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. అలాంటి కారాన్ని ఇప్పుడు అమ్మహస్తం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పంపిణీ చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇక పసుపులో పిండి కలిపారు. అది ఏం పిండో కూడా గుర్తు పట్టడానికి కష్టంగా ఉంది. ఇక చింతపండైతే ఏళ్ల తరబడి నిల్వ ఉండి, పడేయటానికి సిద్ధంగా ఉన్న బాపతుది! దాన్నే చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. విప్పి చూస్తే అన్నీ పురుగులే! దాన్ని నీళ్లలో కలిపి పిసికితే పులుసు కంటే పురుగుల కషాయమే వస్తోందనవచ్చు. అమ్మహస్తం పథకం డొల్లతనాన్ని ఇలా ప్రత్యక్షంగా చూసిన షర్మిల, ప్రభుత్వ వైఫల్యంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలతో పాటు, కొత్తకోట సభలో మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇవి ఎన్నికల పథకాలు..
‘‘అమ్మా! ఇవి ప్రజల సంక్షేమం కోసం పెట్టిన పథకాలు కానే కావు. ఎన్నికలు వస్తున్న వేళ పెట్టిన ఎన్నికల పథకాలు. పథకాలు ప్రజలకు అందకపోయినా పర్లేదు గానీ ప్రచారానికి పనికొస్తే చాలనుకుంటున్నారు. అందుకే ఇమేజ్‌ను పెంచుకోవడానికి చేస్తున్న ఈ ప్రచారానికి ఏకంగా రూ.100 కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. రేషన్ దుకాణం ద్వారా ఇప్పటిదాకా ఇస్తున్న సరుకులకు కత్తెర వేసి, అమ్మహస్తం అంటూ ఒక పొట్లంలో కొన్ని సరుకులు వేసి, దాని మీద సీఎం తన బొమ్మ వేసుకుని, ‘మీకు నేను రూ.100 మిగిలిస్తున్నాను’ అంటున్నారు. ఆయన ఇస్తున్న ఈ సంచిలో ఎన్ని సరుకులు పనికొస్తున్నాయో వాటిని కిరణ్‌కుమార్‌రెడ్డి గారు వండుకుని తింటే తెలుస్తుంది.

కావాల్సింది చిత్తశుద్ధి
పెట్టిన పథకాలు అమలు కావాలంటే చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల మీద వీసమంతైనా ప్రేమ ఉండాలి. పేదల మీద గుప్పెడంతైనా కనికరం ఉండాలి. పథకాలు అమలు చేసేవారిలో నిజాయితీ ఉండాలి. అప్పుడే అవి కోట్ల మంది ప్రజలకు అందుతాయి. వైఎస్సార్ తన పథకాలను అలా అమలు చేసి చూపించారు కాబట్టే ఆయన వంటి నాయకుడే తమకు మళ్లీ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలు మరో ఏడాది ఉన్నాయనగా కిరణ్ ఇలా కొత్త పథకాలను, కొత్త పేర్లను పెట్టి ప్రచారం చేసుకుంటే అవి ఎన్నికల పథకాలవుతాయే తప్ప సంక్షేమ పథకాలనిపించుకోవు. పాదయాత్రలో నేను గమనించింది ఒక్కటే. కిరణ్‌కుమార్‌రెడ్డి గారు కొత్త పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. కేవలం వైఎస్సార్ పెట్టిన పథకాలను అమలు చేస్తే చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

దొంగ టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓట్లతో బుద్ధి చెప్పండి
కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. తరవాత మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఓటు ఆయుధంతో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మీరు గెలిపించిన రోజున జగన్‌మోహన్‌రెడ్డి గారిని మీరు ఆశీర్వదించినట్టు అయితుంది. మీరు వేసే ప్రతి ఓటూ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని మీరు నమ్ముతున్నట్టు అవుతుంది’’

16.1 కిలోమీటర్ల నడక..
షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం 192వ రోజు విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం చెట్టుపల్లి నుంచి ప్రారంభమైంది. వెలంకాయపాలెం, రోలుగుంట, భోగాపురం మీదుగా షర్మిల కొత్తకోటకు చేరుకున్నారు. అక్కడ భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ్నుంచి దొండపూడి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30కు చేరుకున్నారు. గురువారం షర్మిల మొత్తం 16.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటిదాకా 2,548.4 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. 

మధ్యాహ్నం వేళ బస కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ షర్మిలను కలిశారు. నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్‌గణేశ్, బలిరెడ్డి సత్యారావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, కుంబం రవిబాబు, చెంగల వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు కిడారి సర్వేశ్వర్‌రావు, వనజంగి కాంతమ్మ, బొడ్డేటి ప్రసాద్, కోల గురువులు, బూడి ముత్యాల నాయుడు, పాడేరు సత్యవాణి, జీవీ రవి రాజు, స్థానిక నాయకులు దాడి రత్నాకర్, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: