పెట్రోలుపై రూ.9.60 వాత! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెట్రోలుపై రూ.9.60 వాత!

పెట్రోలుపై రూ.9.60 వాత!

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

పెట్రోలు ధర ఈసారి కళ్లు బైర్లు కమ్మేలా పెరిగే అవకాశముంది. అమ్మకాలపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, లేదా నష్టపరిహారం ఇవ్వాలని.. లేకపోతే లీటరుపై రూ. 9.60 పెంచుతామని ప్రభుత్వరంగ చమురు కంపెనీలు మంగళవారం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ‘ఇంధన ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతున్నా డిసెంబర్ నుంచి ధరలు పెంచకుండా ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నాం. మా అప్పులకు, ఇంధన ఉత్పత్తికి ఒక పరిమితి ఉంటుంది. 

పెట్రో అమ్మకాలపై ఒక్కో కంపెనీకి రూ.49 కోట్ల నష్టం వస్తోంది. దీన్ని ప్రభుత్వం చెల్లించాలి’ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ ఆర్‌ఎస్ బుటోలా ఢిల్లీలో చెప్పారు. ప్రభుత్వం తమ సూచనలను అంగీకరించకపోతే వెంటనే లీటరుకు రూ.8.04 పెంచడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. బుటోలా పేర్కొన్న రూ.8.04 పెంపునకు 20 శాతం వ్యాట్ కలిపితే ఢిల్లీలో లీటరు ధర రూ.9.60 పెరుగుతుంది. బుటోలా చెప్పిన వివరాలు, చేసిన హెచ్చరికతో ఐఓసీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘పక్షం రోజుల్లో రూ. 745 కోట్ల నష్టం’

ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోలు అమ్మకాలపై రూ.745 కోట్ల నష్టం చవిచూశాయని బుటోలా చెప్పారు. ‘పెట్రో ధరలను తాత్కాలికంగా ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి, అమ్మకం, ఉత్పత్తి ధరల మధ్య తేడాలను పూడ్చడానికి సబ్సిడీ ఇవ్వాలి. లేదా లీటరు ధరపై ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ.14.78 ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు. లీటరు పెట్రోలుపై రాష్ట్రాలు 15 నుంచి 33 శాతం వ్యాట్‌ను (రూ.10.30 నుంచి రూ.18.74 వరకు) వసూలు చేస్తున్నాయని, ధరలు పెరగకూడదనుకుంటే వ్యాట్‌నుకూడా తగ్గించాలని ఆయన సూచించారు. 

చమురు కంపెనీలు ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురును 121.29 డాలర్లకు (రూ.6,243) దిగుమతి చేసుకుని 109.30 డాలర్లకు(రూ.5,626) అమ్ముతూ నష్టపోతున్నాయని వివరించారు. పెట్రోలు ధరపై తాత్కాలికంగా నియంత్రణ తేవాలని, లేదా నష్టాలు రాని స్థాయికి పన్నులు తగ్గించాలని ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరామన్నారు. పెట్రో అమ్మకాలపై ఐఓసీ, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీలు రోజూ రూ.49 కోట్లు నష్టపోతున్నాయని, డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్‌లను ఉత్పత్తి వ్యయంకంటే తక్కువకు అమ్మడంతో రోజూ మరో రూ.573 కోట్ల నష్టమొస్తోందని బుటోలా తెలిపారు.
Share this article :

0 comments: