కాంగ్రెస్.. సెక్యులరా? మతతత్వ పార్టీనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్.. సెక్యులరా? మతతత్వ పార్టీనా?

కాంగ్రెస్.. సెక్యులరా? మతతత్వ పార్టీనా?

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడతారా?
వైఎస్ రెండు సార్లు సీఎంగా పనిచేసినప్పుడు 
ఆయన కులం, మతం గుర్తురాలేదా?

హైదరాబాద్, న్యూస్‌లైన్:కాంగ్రెస్ పార్టీ సెక్యులర్(లౌకిక) పార్టీనా లేదా కుల , మతతత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీనా అనేది ఆ పార్టీ నేతలు స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావుతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 18 శాసనసభ, ఒక పార్లమెంటు స్థానాల్లో ఓడితే కాంగ్రెస్ పరువుపోయే పరిస్థితి తలెత్తడంతో ఆ పార్టీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ నేతలు కులాలు, మతాలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. వైఎస్ రెడ్డి కాదంటున్నారు. 

ఆయన కుమారుడు జగన్ దళితుడు, క్రైస్తవుడు, బైబిల్ చదువుతాడని, ఆయన వెంట రెడ్లు వెళ్లకూడదని కాంగ్రెస్ నేతలు వీరశివారెడ్డి, తులసిరెడ్డి చెబుతున్నారు. వైఎస్ రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా, రెండుసార్లు సీఎంగా పనిచేసినప్పుడు ఆయన కులం, మతం ఈ నేతలకు గుర్తురాలేదా?’’ అని జూపూడి ప్రశ్నించారు. ‘గతంలో సోనియా విషయంలో బీజేపీ లేవనెత్తిన అంశాలను రాష్ట్రంలో కాంగ్రెస్ పునారావృతం చేస్తోంది. రాజకీయాల్లో కాంగ్రెస్ ఎజెండా ఏంటి? అసలు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీనా లేక కులతత్వ పార్టీనా అనేది స్పష్టం చేయాలి’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దళితులను, దళిత క్రిస్టియన్ల మనసులను బాధ పెట్టేలా ఉన్నాయని జూపూడి పేర్కొన్నారు.

వైఎస్ పాలనలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారినీ ఆదరించారని జూపూడి గుర్తు చేశారు. కమ్యూనిస్టులు, మతవాదులే కాదు ఎవరికి అవసరం వచ్చినా ప్రతి ఒక్కరికీ సాయం చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయన కుమారుడు జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతల కళ్లు మండుతున్నాయన్నారు. అందుకే జగన్‌పై అనవసరంగా బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. ‘‘కడప, పులివెందుల ఉప ఎన్నికల సమయంలో కూడా జగన్ బీజేపీతో కలుస్తున్నారని ప్రచారం చేశారు. త్వరలో రానున్న ఉప ఎన్నికల దృష్ట్యా మళ్లీ అలాంటి వాటిని పునరావృతం చేస్తున్నారు. మరోవైపు జగన్ టీఆర్‌ఎస్‌తో దోస్తి చేస్తున్నారని కొత్త వాదానికి తె రదీశారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పకపోతే రాష్ట్రంలో 12 శాతం జనాభా కలిగిన దళితులు, క్రిస్టియన్లు తిరగబడటం ఖాయం’’ అని జూపూడి హెచ్చరించారు. మంత్రి కొండ్రు మురళి వైఎస్‌పై చేస్తున్న వ్యాఖ్యలను జూపూడి ఖండించారు. కొండ్రు విశ్వాసఘాతకుడని మండిపడ్డారు. దళితులకు వైఎస్ చేసినంత మేలు మరే నాయకుడు చేయలేదన్నారు.

21న వైఎస్సార్ సీపీ దళిత కన్వీనర్ల సమావేశం: నల్లా

ఈ నెల 21నవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల దళిత కన్వీనర్లు, ముఖ్యనేతల సమావేశం జరగనుందని నల్లా సూర్యప్రకాష్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులను సమన్వయ పరచటానికి ఇన్‌చార్జులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు.
Share this article :

0 comments: