ఎస్సీ,ఎస్టీలకు తగ్గినా ఫర్వాలేదు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎస్సీ,ఎస్టీలకు తగ్గినా ఫర్వాలేదు!

ఎస్సీ,ఎస్టీలకు తగ్గినా ఫర్వాలేదు!

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

2001 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలకు సీఎం ఆదేశం! 
హైకోర్టులో అఫిడవిట్‌కూ యత్నాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల్లో ఎస్సీ/ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించేందుకు 2011 జనాభా లెక్కలతో ఎన్నికలకు వెళ్తామన్న సర్కారు ఇప్పుడు మాటమారుస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం.. ఎస్సీ/ఎస్టీలకు రిజర్వేషన్లు పెరగకపోయినా ఫర్వాలేదన్నట్టుగా, 2001 జనాభా లెక్కల ప్రకారం తక్షణమే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. 2001లో 27 శాతం ఉన్న పట్టణ జనాభా 2011 నాటికి 33 శాతానికి పెరిగింది. ఆ మేరకు ఎస్సీ/ఎస్టీల జనాభా పెరగడం కూడా ఖాయం. ఆ మేరకు ఆ వర్గాలకు రిజర్వేషన్ సీట్లు పెరగడం తప్పనిసరి. 2011 జనాభా లెక్కల సేకరణ పూర్తై లక్ష జనాభా దాటిన పట్టణాల జాబితాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా జనాభా లెక్కలతోనే ఎన్నికలకు వెళ్తామని హైకోర్టుకు ప్రభుత్వం ఆఫిడవిట్ కూడా సమర్పించింది. అయితే ముఖ్యమంత్రి ఇవేమీ పట్టించుకోలేదని, ఉప ఎన్నికలకు ముందే మునిసిపల్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే వెంటనే సర్దుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.

పాత లెక్కలతో ఎన్నికలకు వెళ్తే ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పరంగా అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కొందరు మంత్రులు ప్రస్తావించినా.. ముఖ్యమంత్రి ఉప ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికల నిర్వహణ ముఖ్యమనే విధంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. తాజా జనాభా లెక్కలు ఎప్పుడు ప్రచురిస్తారో తెలియజేయాలని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్, పురపాలక శాఖ కార్యదర్శిలు జనాభా లెక్కల డెరైక్టర్ జనరల్‌కు 25 రోజుల కిందటే లేఖ రాశారు. దానిపై ఎలాంటి స్పందన వెలువడలేదు. దీనితో ఢిల్లీలో ఉన్న పురపాలక శాఖ కార్యదర్శి విజయకుమార్ జనాభా లెక్కల డెరైక్టర్ జనరల్‌ను ఫోన్‌లో సంప్రదించగా..జాబితా చాలా ఆలస్యం అవుతుందని ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని లేఖ రూపంలో తెలపాలని కోరినట్లు విజయకుమార్ న్యూస్‌లైన్‌కు చెప్పారు. డెరైక్టర్ జనరల్ నుంచి వచ్చే లేఖ ఆధారంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. జనాభా లెక్కలు రావడానికి కనీసం మరో ఆరునెలలు పడుతుందని, ఆ తరువాత నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటే చాలా ఆలస్యం అవుతుందన్న వాదనను ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ఆలస్యం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోతున్నామని, అందువల్ల 2001 జనాభా లెక్కలతోనే ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని హైకోర్టును అభ్యర్థించనున్నారు, 

అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదు

రాష్ట్రంలో మొత్తం 168 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే..159 స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేవు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినా, ఇందుకు హైకోర్టు అంగీకరించినా.. గతంలో ఎన్నికలు నిర్వహించిన (2001 జనాభా లెక్కల ప్రకారం) 91 మునిసిపాలిటీలు 15 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మిగతావి కొత్త మునిసిపాలిటీలు. కాగా పాతవాటికి నిర్వహించాలనుకున్నా.. జనాభా లెక్కల విభాగం నుంచి సమాధానం తెచ్చుకోవడం, కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి కోర్టు అనుమతి తీసుకోవడం, తదనుగుణంగా వార్డుల రిజర్వేషన్లు, మేయర్/చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడానికి, ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలలైనా గడువు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత లేదన్నా మునిసిపల్ ఎన్నికలు జూలై కంటే ముందు జరగడానికి అవకాశం లేదని అంటున్నారు. ఇక మిగతా మునిసిపాలిటీలకు రెండో దశలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఏజీతో సీఎం సమీక్ష: మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకున్న న్యాయపరమైన చిక్కులపై ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డితో సమీక్ష జరిపారు.

మిగతా మునిసిపాలిటీల్లో తక్షణమే బీసీల గణన

పురపాలక శాఖ ఆదేశాలు మే 30 కల్లా తుది జాబితాలు

బీసీ ఓటర్ల గణన జరగని మునిసిపాలిటీల్లో తక్షణమే బీసీ ఓటర్ల లెక్కింపు చేపట్టాలని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 30వ తేదీ నాటికి బీసీ ఓటర్ల తుది జాబితాలు ప్రకటించాలని, తద్వారా మేయర్/చైర్‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ కార్డు సర్వే (ఎంపీహెచ్‌ఎస్)ను వార్డుల వారీగా విభజించాలని, అందులో బీసీ ఓటర్లను గుర్తించాలని, ఈనెల 28 నుంచి వచ్చేనెల 12 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించాలని, మే 15న ముసాయిదా జాబితాలు సిద్ధం చేయాలని సూచించారు. మే 28న మునిసిపాలిటీ స్థాయిలో తుది జాబితా ప్రకటించాలని తెలిపారు. 30లోగా తుది జాబితాలను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్‌కు పంపించాలని కమిషనర్లను, రీజినల్ జాయింట్ డెరైక్టర్లను ఆదేశించారు.
Share this article :

0 comments: