వచ్చే నెల సబ్సిడీ బియ్య కష్టమే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వచ్చే నెల సబ్సిడీ బియ్య కష్టమే!

వచ్చే నెల సబ్సిడీ బియ్య కష్టమే!

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

ఈ నెల పామాయిల్ సరఫరాపై ప్రభావం
రూ.750 కోట్ల కోసం ఆర్థిక శాఖ చుట్టూ
తిరుగుతున్న పౌరసరఫరాల శాఖ
ఇలాగైతే రేషన్ సరుకులు ఇవ్వలేమని గగ్గోలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సబ్సిడీ బియ్యానికి, పామాయిల్‌కు పైసల్లేవు. ఈ నెలలో పామాయిల్ ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెలలో సబ్సిడీ బియ్యం కూడా సరఫరా చేయలేమని పౌరసరఫరాల సంస్థ అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు (తొలి త్రైమాసిక బడ్జెట్) విడుదల చేయకపోవడంతో వచ్చే నెలకు సరుకులు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. బడ్జెట్ ఆమోదం పొంది పక్షం రోజులు దాటినా సబ్సిడీ బియ్యానికి నిధులు విడుదల చేయటంలో జాప్యం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక నిధుల్లోనే రూ.220 కోట్ల మేర కోత విధించారని, ఇప్పుడు కొత్త బడ్జెట్ నుంచి తొలి త్రైమాసిక నిధులు ఇవ్వకపోవడంతో నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పౌరసరఫరాల సంస్థ అధికారులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెలలో పామాయిల్ ఇవ్వలేమని, ఇప్పటికే నెలలో సగం రోజులు పూర్తికాగా ఇంకా జాప్యం జరిగితే ప్రజల నుంచి నిరసన ఎదుర్కొనక తప్పదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ బియ్యానికి రూ.3,000 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల నుంచి తొలి త్రైమాసికానికి రూ.750 కోట్లు విడుదల చేయాల్సిందిగా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆర్థిక శాఖను కోరారు. పక్షం రోజులైనా రూ. 750 కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)ను ఆర్థిక శాఖ ఇవ్వకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్వో కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ప్రజాపథం కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో రేషన్ సరుకులు ఇవ్వకపోతే మంత్రులు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీసినా తాము చేయగలిగిందేమీ లేదంటూ పౌరసరఫరాల సంస్థ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే బియ్యం సబ్సిడీ కింద నిధులు ఇవ్వకపోవడం ఇదే తొలిసారని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. ఆర్థిక శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందనడానికి సబ్సిడీ బియ్యం నిధులు విడుదల చేయకపోవడమే నిదర్శనమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొత్త బడ్జెట్ ఆమోదం పొంది పక్షం రోజులైనా ఇప్పటికీ అనేక శాఖలకు ఆర్థిక శాఖ బీఆర్వోలను ఇవ్వలేదు. ఆన్‌లైన్‌లో బీఆర్వోలు ఇస్తామని ఘనంగా ప్రకటించిన ఆర్థిక శాఖ అసలుకే నిధులివ్వకుండా జాప్యం చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Share this article :

0 comments: