జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐవి అన్నీ ఊహలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐవి అన్నీ ఊహలే

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐవి అన్నీ ఊహలే

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012

వాస్తవాలతో నిమిత్తం లేకుండా చార్జిషీట్ దాఖలు చేసింది
కంపెనీలు పెట్టుబడులు పెడితే సాయిరెడ్డి పొందిన లబ్ధి ఏముంది..?
పెట్టుబడుల ద్వారా సాయిరెడ్డి లబ్ధి పొందారని ఎక్కడా చెప్పలేదు
ఆయనకు బెయిల్ రాకూడదనే 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేసింది
వేటిని ఆధారాలు చూపుతున్నారో... ఆ డాక్యుమెంట్లను మాకివ్వడం లేదు
వాటిలో లొసుగులు ఎక్కడ బయటపడతాయోనని సీబీఐ భయపడుతోంది
చార్జిషీట్ తర్వాత కూడా దర్యాప్తా..? మరి ఇప్పటివరకు చేసిందేమిటి..?
భూ కేటాయింపులపై మాత్రమే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది
భూ కేటాయింపుల్లో సాయిరెడ్డి పాత్రే లేదు
మరి అలాంటప్పుడు ఆయన జైలులో ఎందుకుండాలి..?
హైకోర్టులో వాదించిన సాయిరెడ్డి తరఫు న్యాయవాది
నేడు తీర్పు వెలువరించనున్న న్యాయమూర్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో విజయసాయిరెడ్డి కీలకవ్యక్తని చెబుతున్న సీబీఐ, అందుకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలు చూపలేకపోయిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ఊహల ఆధారంగా ఆరోపణలు చేస్తూ, వాస్తవాలతో నిమిత్తం లేకుండా చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ... అసలు దర్యాప్తు పూర్తయిందో.. లేదో చెప్పే పరిస్థితిలో కూడా లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జగతి పబ్లికేషన్స్‌లో వివిధ కంపెనీలు వ్యాపార కోణంలో పెట్టుబడులు పెడితే, అందులో విజయసాయిరెడ్డి పొందిన లబ్ధి ఏముందని ఆయన ప్రశ్నించారు. ఆయన లబ్ధి పొందారని సీబీఐ ఎక్కడా చెప్పలేదని కూడా గుర్తు చేశారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు అందుకు ప్రతిఫలంగా భూములు కేటాయించారని ఆరోపిస్తున్న సీబీఐ... అరబిందో, హెటిరో తదితర కంపెనీలకు భూముల కేటాయింపునకు సంబంధించి మాత్రమే చార్జిషీట్‌లో ప్రస్తావించిందని ఆయన తెలిపారు. భూముల కేటాయింపులో సాయిరెడ్డి పాత్ర లేనప్పుడు ఆయన జైల్లో ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్ట ప్రకారం చార్జిషీట్ దాఖలు చేశారంటే దర్యాప్తు పూర్తయినట్లేనని, అయితే సీబీఐ మాత్రం ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని చెబుతోందని, దీనిని బట్టి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ అసంపూర్తిదని భావించాలని కోర్టును కోరారు. 

చార్జిషీట్ దాఖలు చేశారు కాబట్టి బెయిల్ పొందేందుకు విజయసాయిరెడ్డి అర్హులని, ఆ మేర కేసు వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిందని వివరించారు. పలు దేశాలకు లెటర్ ఆఫ్ రొగేటరీ పంపామని సీబీఐ చెబుతోందని... పాకిస్థాన్, దుబాయ్ వంటి దేశాలు అసలు ఈ లెటర్‌ను పట్టించుకోవని, కొన్నేళ్ల తరువాత కూడా కొన్ని దేశాలు ఈ లెటర్‌కు సమాధానం ఇవ్వవని ఆయన చెప్పారు. 2005లో జరిగిన వాటి ఆధారంగా ఏడేళ్ల తర్వాత చేస్తున్న దర్యాప్తులో ఎంత పస ఉంటుందని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను గురువారం విచారించారు. మొదట సీబీఐ తరఫున పి.కేశవరావు వాదనలను వినిపించగా, తరువాత విజయసాయిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి, తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు.

అన్ని డాక్యుమెంట్లను మాకివ్వమనండి...

విజయసాయిరెడ్డిపై పలు ఆరోపణలు చేస్తున్న సీబీఐ, వేటి ఆధారంగా అవి చేస్తున్నారో, ఆ డాక్యుమెంట్లను తమకివ్వడం లేదని సుశీల్‌కుమార్ న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం కింది కోర్టును కూడా కోరామని, అయితే చార్జిషీట్‌ను ఇంకా విచారణార్హంగా పరిగణించలేదు కాబట్టి, ఆ డాక్యుమెంట్లు ఇవ్వడానికి వీల్లేదని సీబీఐ అభ్యంతరం చెప్పిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘‘ఇప్పుడు హైకోర్టులో కూడా విజయసాయిరెడ్డిపై ఏవేవో ఆరోపణలు చేస్తూ, ఫలానా డాక్యుమెంట్ ఆధారంగా ఈ వివరాలు చెబుతున్నామంటూ కోర్టుకు డాక్యుమెంట్లు ఇస్తున్నారే తప్ప, వాటిని మాకివ్వడం లేదు. మాకు డాక్యుమెంట్లు ఇస్తే అందులో లొసుగులను ఎక్కడ ఎత్తిచూపుతామోనని, తద్వారా వాస్తవాలు ఎక్కడా బయపడతాయోనని సీబీఐ భయపడుతోంది. అందుకే కుంటి సాకులు చెబుతోంది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు పూర్తిగా వ్యాపార కోణంలో పెట్టాయి. ఇక ప్రీమియంపై సీబీఐ అభ్యంతరాలు చెబుతోంది. ఎంత ప్రీమియంకు వాటాలను కొనాలన్నది సీబీఐ నిర్ణయిస్తుందా? నేను ఓ కారును అమ్ముదామనుకున్నా... దాని ధర రూ.5 లక్షలని చెప్పా. ఆ కారును ఆ రేటుకు కొనలా..? వద్దా..? అన్నది కొనే వ్యక్తి ఇష్టం. ఐదు లక్షలకు కొన్నారు కాబట్టి, అది అన్యాయమంటే ఎలా..? దేనికైనా ఓ పద్ధతి ఉండాలి. ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే సరిపోదు. సాయిరెడ్డి డెరైక్టర్‌గా ఉన్నప్పుడు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు వచ్చాయని సీబీఐ చెబుతోంది. ఇదేనా సీబీఐ చేసిన దర్యాప్తు? రికార్డులను చూసి నేను చెబుతున్నా... సాయిరెడ్డి డెరైక్టర్ పదవి నుంచి తప్పుకున్న తరువాతే పెట్టుబడులు వచ్చాయి’’ అంటూ సీబీఐని సుశీల్‌కుమార్ కడిగిపారేశారు.

మీరు దర్యాప్తు పూర్తి చేయకుంటే.. శిక్ష మేం అనుభవించాలా..?

ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశామా..? లేదా..? అన్న విషయంలో సీబీఐకే స్పష్టత లేదని సుశీల్‌కుమార్ తెలిపారు. కొన్ని సార్లు దర్యాప్తు పూర్తయిందని, మరికొన్నిసార్లు దర్యాప్తు కొనసాగుతోందని చెబుతోందని తప్పుబట్టారు.‘‘ఏ భూములకు సంబంధించి అయితే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందో, అందుకు సంబంధించిన జీవోలు జారీ చేసిన అధికారులు, మంత్రుల జోలికి మాత్రం వెళ్లలేదు. వారి గురించి చార్జిషీట్‌లో ఎటువంటి ప్రస్తావన లేదు. భూ కేటాయింపులతో సంబంధం లేని సాయిరెడ్డి గురించి పదే పదే ప్రస్తావించింది. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 72 మంది నిందితులు ఉన్నారు. మరి ఇప్పుడు చార్జిషీట్‌లో కేవలం 13 మందిని మాత్రమే నిందితులుగా చూపారు. మిగిలిన వాళ్లు ఎక్కడికెళ్లారు..? అదేమంటే దర్యాప్తు పూర్తి కాలేదని చెబుతున్నారు. ఎంతకాలం దర్యాప్తు చేస్తారు..? వీళ్లు దర్యాప్తు చేస్తున్నంతకాలం నిందితులు జైలులోనే ఉండాలా..? మీరు దర్యాప్తు చేయకుంటే... మేం శిక్ష అనుభవించాలా..? ఇదెక్కడి న్యాయం? ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకోవాలి. సాయిరెడ్డికి బెయిలిచ్చిన కింది కోర్టు స్పష్టమైన షరతులు విధించింది. సాయిరెడ్డి తన పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేశారు. మరి ఆయన ఎక్కడికి పారిపోతారు? ఎవరిని ప్రభావితం చేస్తారు? సాక్ష్యాలను ఎలా తారుమారు చేస్తారు? అంత అవసరం సాయిరెడ్డికి ఏముంది..? సాయిరెడ్డి ఇప్పటికే 104 రోజులు జైలులో ఉన్నారు. మరింతకాలం ఆయన జైలులోనే ఉండాలని సీబీఐ భావిస్తున్నట్లుంది. అంటే వీరు చేసే తప్పులకు మేం జైలులో ఉండాలన్న మాట’’ అని సుశీల్‌కుమార్ కోర్టుకు నివేదించారు.

పెట్టుబడిపెట్టిన వారిని అరెస్ట్ చేయబోం: సీబీఐ

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారిని అరెస్ట్ చేయబోమని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ఈ మొత్తం కేసులో వారి పాత్రను, ప్రమేయాన్ని విచారణ సమయంలో కింది కోర్టు తేలుస్తుందని వివరించింది. అదే విధంగా చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న ఏపీఐఐసీ రిటైర్డ్ అధికారి వైవీఎల్ ప్రసాద్, అరబిందో కంపెనీ సెక్రటరీ చంద్రమౌళిలను కూడా అరెస్ట్ చేయబోమని తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేసేంత శక్తి సామర్థ్యాలు వారికి లేవని, అందువల్లే వారిని అరెస్ట్ చేయబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితునిగా ఉన్న బీపీ ఆచార్య మరో కేసుకు సంబంధించి జైలులో ఉన్నందున ఆయనను అరెస్ట్ చేయలేదని వివరించింది. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కీలక ఆధారాలు ఉన్నాయని, ఆయనను బెయిల్‌పై తిరగనిస్తే, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీబీఐ న్యాయవాది కేశవరావు తెలిపారు. జగతి పబ్లికేషన్స్‌లో నిధుల ప్రవాహం ఇలా జరిగిందంటూ ఓ పెద్ద చార్ట్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. దీనిపై సుశీల్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఆ డాక్యుమెంట్ తమకు ఇవ్వకుండా, దాని ఆధారంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ... వారు కోరిన డాక్యుమెంట్లు ఇవ్వడానికి మీకున్న అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. దర్యాప్తు సాగుతున్నందున వాటిని ఇవ్వడం సాధ్యం కాదని, కింది కోర్టులో దరఖాస్తు చేసి తీసుకోవచ్చునని కేశవరావు తెలిపారు. దీనికి సుశీల్ స్పందిస్తూ... సుప్రీంకోర్టులో ఏ డాక్యుమెంట్‌నైనా ముందే అందచేస్తారని, కానీ ఇక్కడ సీబీఐ విచిత్రంగా ప్రవర్తిస్తోందని వివరించారు. డాక్యుమెంట్లు ఇవ్వకుంటే... ఎవరిపైనైతే ఆరోపణలు చేస్తున్నారో వారిని చార్జిషీట్‌నుంచి తొలగించాలని కోరారు. తరువాత కేశవరావు వాదనలు కొనసాగిస్తూ... తదుపరి దర్యాప్తు ఆధారంగా మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తామని, మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ సమయంలో ఆయన కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. దీనిపై సుశీల్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చార్జిషీట్ దాఖలు చేశాక కూడా సీబీఐ కేసు డైరీపై ఆధారపడుతోందంటే వారి వద్ద ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. 
Share this article :

0 comments: