మరమగ్గాలు, దోబీఘాట్లు, హెయిర్ సెలూన్లు కావేవీ విద్యుత్ చార్జీల పెంపునకనర్హం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరమగ్గాలు, దోబీఘాట్లు, హెయిర్ సెలూన్లు కావేవీ విద్యుత్ చార్జీల పెంపునకనర్హం

మరమగ్గాలు, దోబీఘాట్లు, హెయిర్ సెలూన్లు కావేవీ విద్యుత్ చార్జీల పెంపునకనర్హం

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

తాజా పెంపుతో రెట్టింపు కానున్న విద్యుత్తు బిల్లులు
రూ. 50 యూనిట్లులోపు వాడినా రూ. 400 బిల్లు తప్పదు
అంతకన్నా ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినా రూ.45 అదనం
డొమెస్టిక్ కేటగిరీకి మార్చాలన్న వైఎస్ ప్రతిపాదన బుట్టదాఖలు
డొమెస్టిక్‌కు మారిస్తే 50 యూనిట్లకు రూ. వందలోపే బిల్లు

సాక్షి, హైదరాబాద్: సబ్బు బిళ్ల, కుక్కపిల్ల కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు.. మరమగ్గాలు, దోబీఘాట్లు, హెయిర్ సెలూన్లు కావేవీ విద్యుత్ చార్జీల పెంపునకనర్హం అని సర్కారు అంటోంది. అడ్డగోలుగా ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలు కులవృత్తుల మనుగడకే ముప్పుగా పరిణమించాయి. రాష్ట్రంలో లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న క్షౌరవృత్తికి ప్రభుత్వం ఇచ్చిన తాజా ‘షాక్’ గుదిబండగా మారబోతోంది. ఒక యూనిట్ విద్యుదుత్పత్తికి మన రాష్ట్రంలో సగటున రూ.5.45 ఖర్చవుతుండగా, ప్రభుత్వం మాత్రం యూనిట్‌కు కనీసం రూ.6.63 వసూలు చేయనుంది. ఈ నేపథ్యంలో మే నెలలో వచ్చే విద్యుత్ బిల్లులు దాదాపు రెట్టింపు కానున్నాయి. కులవృత్తులను ఆదుకునేందుకు విద్యుత్ సబ్సిడీ భరించాల్సిన సర్కారు.. విద్యుదుత్పత్తికి అయ్యే ఖర్చు కన్నా ఎక్కువ భారం మోపడం పట్ల నాయీబ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. క్షౌరశాలలకు కరెంటు చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే క్షౌరకృత్యాలు బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

రూ.3.85 నుంచి రూ.6.63కి...

తాజాగా అమల్లోకి వచ్చిన విద్యుత్ టారిఫ్ హెయిర్ సెలూన్‌లపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో హెయిర్ సెలూన్లు కమర్షియల్ కేటగిరీలో 50 యూనిట్లలోపు వాడితే యూనిట్‌కు రూ.3.85 వసూలు చేయగా, ఇప్పుడు దానిని ఏకంగా యూనిట్‌కు రూ.6.63కు పెంచారు. మూడు కుర్చీలుండే షాపులో నెలకు 50 యూనిట్లకు పైగానే ఖర్చవుతోంది. అంటే కనీసం 50 యూనిట్లు కాల్చినా సర్వీసు చార్జీలు, ఇతర చార్జీలు మినహాయిస్తే రూ.331.50 బిల్లు వస్తుంది. అన్ని చార్జీలతో కలిపి ఈ మొత్తం రూ.400 కానుంది. ఇక 50 యూనిట్లకు అదనంగా ఒక్క యూనిట్ కాల్చినా మొత్తం యూనిట్లకు రూ.7.38 చొప్పున వసూలు చేస్తారు. అంటే అది సర్వీసు చార్జీలు కాకుండా రూ.376 అవుతోంది. అంటే 50 కన్నా ఒక్క యూనిట్ ఎక్కువ కాలిస్తే రూ.45 అదనంగా చెల్లించాల్సిందే. ఆపై ప్రతి యూనిట్‌కు రూ.7.38 కట్టాల్సి వస్తుంది. అదే విధంగా 100 యూనిట్లు దాటితే ప్రతి యూనిట్‌కు రూ.8.13 చొప్పున కనీసం ఆ బిల్లు రూ.810 (సర్వీసు చార్జీలు కాకుండా) రానుంది. ఇలా ఎడాపెడా బిల్లులు పెరగడంపట్ల హెయిర్ సెలూన్ల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే క్షౌరవృత్తి చేసేవారు క్రమంగా తగ్గిపోతున్నారని, ఇలా ఇష్టారీతిన విద్యుత్ చార్జీల భారం మోపితే భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ బ్యూటీపార్లర్ల బాట పట్టాల్సిందేనని అంటున్నారు.

డొమెస్టిక్‌కు మార్చేందుకు వైఎస్ ప్రయత్నం...

రాష్ట్రంలోని నాయీబ్రాహ్మణుల పరిస్థితి గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. హెయిర్ సెలూన్లను కమర్షియల్ కేటగిరీ నుంచి డొమెస్టిక్‌కు మార్చేందుకు ప్రయత్నించారు. నాయీబ్రాహ్మణ సంఘాల వినతి మేరకు దీనికి సంబంధించిన ఫైలు కూడా కదిలించారు. ఈ మేరకు 2008లో ఇంధన శాఖ నుంచి ట్రాన్స్‌కో, డిస్కంల సీఎండీలకు లేఖలు కూడా రాశారు. అయితే, ఆయన మరణం తర్వాత ఫైలు నిలిచిపోయిందని, హెయిర్ సెలూన్లను డొమెస్టిక్ కేటగిరీకి మార్చే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హెయిర్‌సెలూన్లను డొమెస్టిక్ కేటగిరీకి మారిస్తే యూనిట్‌కు రూ.1.45 చొప్పున 50 యూనిట్లకు రూ.72.50 అవుతుంది. దీనికి సర్వీసు, ఇతరత్రా చార్జీలు కలిపినా రూ.100 లోపే బిల్లు వస్తుంది. కమర్షియల్ కేటగిరీ టారిఫ్‌తో పోలిస్తే రూ.300 ఆదా అవుతుంది.


ఈ ప్రభుత్వం పేదలను నిర్మూలిస్తోంది
‘‘పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నించాల్సిన ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలను నిర్మూలించే విధానాలను అవలంబిస్తోంది. పేదలంటే తెలియని ముఖ్యమంత్రికి అందరూ ధనవంతులుగానే కనిపిస్తున్నారు. క్షౌరవృత్తిదారుల పరిస్థితిని అర్థం చేసుకుని పెంచిన చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు క్షౌరకృత్యాలు బంద్ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం’’ 
- ఇనుకొండ సుబ్రహ్మణ్యం, 
ఏపీ నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు
Share this article :

0 comments: