సుప్రీంకోర్టు చెప్పినా తుది చార్జిషీటు వేయడం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టు చెప్పినా తుది చార్జిషీటు వేయడం లేదు

సుప్రీంకోర్టు చెప్పినా తుది చార్జిషీటు వేయడం లేదు

Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013

* సుప్రీంకోర్టు చెప్పినా తుది చార్జిషీటు వేయడం లేదు
* ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతున్నట్లుగా ఒకటి, రెండు అంటూ చార్జిషీట్లు వేస్తున్నారు
* సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగానే సాగుతుంటే.. మంత్రులను ఎందుకు అరెస్టు చేయరు?
* చిరంజీవి బంధువుల ఇంట్లో దొరికిన డబ్బు సంగతేంటి?
* బాబుపై ఆరోపణలున్నా సీబీఐ ఎందుకు విచారణ చేయదు? 

‘‘ఈ ప్రభుత్వంలో పొలాలకు నీళ్లు బంద్, ఇళ్లకు కరెంట్ బంద్, విద్యార్థులకు చదువులు బంద్, పరిశ్రమలకు పవర్ బంద్, కార్మికులకు ఉపాధి బంద్, రాష్ట్రానికి అభివృద్ధి బంద్, ప్రజలకు మనశ్శాంతి బంద్.. ఆడవారిపై అత్యాచారాలు మాత్రం యథేచ్చగా జరుగుతున్నాయి.’’
- షర్మిల 

‘‘సీబీఐ సుప్రీంకోర్టును ధిక్కరించింది. ఆరు నెలలైనా తుది చార్జిషీటు వేయడం లేదు. ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతున్నట్లు ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు అంటూ చార్జిషీట్లు పెడుతున్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగానే సాగుతుంటే.. ఈ కేసుతో సంబంధం ఉన్న మంత్రులను ఎందుకు అరెస్టు చేయడం లేదో సీబీఐ సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రి చిరంజీవి దగ్గరి బంధువుల ఇంట్లో రూ.70 కోట్లు దొరికితే సీబీఐకి కనపడదు. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అన్న ప్రశ్నలకు సమాధానమూ ఉండదు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రంలోనే అతి పెద్ద మాఫియా డాన్ అని సొంత పార్టీవారే చెప్పినా సీబీఐ పట్టించుకోదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా?’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. 

‘‘పెద్ద మనుషులు అని చెప్పుకునే నాయకులు.. జగన్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక సీబీఐ వెనుక ఉండి దాడి చేస్తున్నారు. ఆయన బయట ఉంటే ప్రజా సమస్యలపై పోరాడుతూ వైఎస్‌కు నిజమైన వారసుడిగా నిలిచిపోతారని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మనుగడ ఉండదని తెలిసి అబద్ధపు కుట్రలతో జగనన్నను జైలులో పెట్టారు’’ అని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు వైఖరికీనిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో సాగింది. ఆమె పాదయాత్రకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
‘‘రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబుకు దేశంలో ఎక్కడ చూసినా హెరిటేజ్ దుకాణాలు ఉన్నాయి. దుబాయ్, సింగపూర్, మలేసియాలలో ఆస్తులు ఉన్నాయి. అంతెందుకు కమ్యూనిస్టులు చంద్రబాబు అవినీతిపై ‘బాబు జమానా - అవినీతి ఖజానా’ అంటూ పుస్తకాలు వేశారు. అప్పట్లో ఎకరా నాలుగు కోట్లు విలువ ఉన్న భూములను కేవలం రూ.లక్షలకే ఎమ్మార్‌కు కట్టబెట్టారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ ఆస్తిని ఆయన అమ్మేశారు. ఐఎంజీ అనే బోగస్ సంస్థకు 850 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. పదేళ్ల క్రితమే ఆ ఆస్తుల విలువ రూ.2,500 కోట్లు ఉండగా, నేడు పది వేల కోట్లకు చేరింది. ఈ భూములను కేవలం రూ. వందల కోట్లకు బినామీ సంస్థకు అప్పగించారు. దీనిపై విచారణ చేయమని సీబీఐకి చెబితే మా వద్ద సిబ్బంది లేరని చెప్పింది. 

ఇన్ని ఆరోపణలున్నా చంద్రబాబును సీబీఐ ఎందుకు ప్రశ్నించడంలేదు? సీబీఐకి చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో అర్థం చేసుకోలేని అమాయకులు కాదు ప్రజలు. ‘ఈనాడు’ పత్రిక రూ.100 విలువ చేసే షేరును రూ.5 లక్షలకు అమ్మితే తప్పులేదట. ‘సాక్షి’ దినపత్రిక ఒక్కో షేరును రూ.250కు విక్రయిస్తే అది క్విడ్ ప్రో కో అట. జగనన్నపై ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క ఆధారం కూడా సీబీఐ ఇప్పటి వరకూ చూపలేకపోయింది. సీబీఐ తీరు చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తుంది. ప్రాథమిక హక్కులను కాలరాసే అధికారం సీబీఐకి ఎవరిచ్చారు? 

నిందితులకు పాలకుల అండ..: తెనాలిలో ఒక అమ్మాయిపై నలుగురు యువకులు వేధింపులకు పాల్పడితే అడ్డుకున్న ఆమె తల్లిని లారీ కిందకు తోసి చంపేశారు. ఆ నలుగురిలో ఒకరు కాంగ్రెస్ నాయకుడి కుమారుడు. ఆ అమ్మాయి చేత పోలీసులు తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారట. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులను ప్రభుత్వం ఉపయోగించుకుంటూ బాధితుల పక్షాన కాకుండా బాధించేవారి పక్షాన వ్యవహరిస్తోంది. ఇది రాక్షస పాలన కాదా? నిన్న హైదరాబాద్‌లో ఒక యువతిపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగుల పెట్టారు. ఈ రోజున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో పెళ్లికి ఒప్పుకోలేదని మరో యువతిని హత్య చేశారు. చంద్రబాబు హయాంలోనూ ఇదే సాగింది. అప్పట్లో అనురాధ అనే యువతిపై యాసిడ్ దాడి జరిగితే వైద్య ఖర్చులకి కూడా సాయం చేయలేదాయన.

బాబు ఆదర్శంగా కిరణ్ పాలన..: కిరణ్‌కుమార్‌రెడ్డికి చంద్రబాబు ఎందుకు నచ్చారో తెలియదు. ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు. చంద్రబాబు హయాంలానే ఇప్పుడు కూడా కరువు వచ్చి ప్రజలు అప్పుల పాలయ్యారని, బతుకు భారమైందని అందరూ చెబుతున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు కళ్లముందే కుదేలైపోయాయి. సీఎం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు మూడు గంటల కరెంటే ఇస్తున్నారు. పరీక్షల సమయంలో కరెంట్ తీసేస్తున్నారంటే.. విద్యార్థుల పట్ల వీరికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. 

నిన్న ఒక గుడిసెకు వెళ్లాం. ఒకే ఒక బల్బు ఉంటే.. 400 రూపాయల బిల్లు వచ్చిందని ఆమె నాకు చూపించింది. రోజు కూలీ చేసుకుంటే వంద రూపాయలు వస్తాయమ్మా.. ఇంత బిల్లులు వస్తుంటే ఎలా అ ని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మన ముఖ్యమంత్రిగారు మాత్రం ప్రతిపక్షాలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికి ఉంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయేది. అదే జరిగి ఉంటే ప్రజలపై ఈ కరెంటు చార్జీల భారం పడేది కాదు. కానీ బాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రజలను వేధిస్తున్నారు.’’

11 కిలోమీటర్లు సాగిన యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 118వ రోజు శుక్రవారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం పొనసానపల్లి క్రాస్‌రోడ్స్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. మోర్సపూడి, తుక్కులూరు మీదుగా నూజివీడు వరకు 11 కిలోమీటర్లు నడిచారు. నూజివీడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 1,597.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేశ్, మద్దాల రాజేశ్ కుమార్, నాయకులు వసంత నాగేశ్వరరావు, సామినేని ఉదయభాను, మేకా ప్రతాప అప్పారావు, జలీల్‌ఖాన్, మొవ్వా అనంద శ్రీనివాస్ తదితరులున్నారు.
Share this article :

0 comments: