నెల్లూరులో వైఎస్ సంతాప సభలో వెక్కివెక్కి ఏడ్చావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల్లూరులో వైఎస్ సంతాప సభలో వెక్కివెక్కి ఏడ్చావు

నెల్లూరులో వైఎస్ సంతాప సభలో వెక్కివెక్కి ఏడ్చావు

Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013

- జగన్‌ను సీఎం చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని అన్నావు
- నెల్లూరులో వైఎస్ సంతాప సభలో వెక్కివెక్కి ఏడ్చావు
- ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం దివంగత నేత వైఎస్‌ను తూలనాడతావా?
- సంవత్సరం తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవర్ని వెలివేస్తారో తేలుతుంది 
- వైఎస్ కుటుంబంపై మంత్రి ఆనం ఆరోపణలను ఖండించిన వైఎస్సార్ సీపీ ఎంపీ 

 కాంగ్రెస్ పెద్దలు, ‘ఢిల్లీ’ మెప్పు పొందేందుకే మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో 2007లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు 60 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలో హంగామా చేసిన ఆనం సోదరులు.. ప్రస్తుతం రాజకీయ లబ్ధికోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ఎంపీ మేకపాటి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆనం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

‘‘మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పిన వ్యక్తి ఆనం రాంనారాయణరెడ్డి. ఈ విధంగా రాష్ట్రంలో ఎవరూ కూడా చెప్పలేదు. నెల్లూరులోని వీఆర్ కాలేజ్ ఆవరణలో జరిగిన వైఎస్ సంతాప సభలో మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్చారు. అటువంటి వ్యక్తులు రాజకీయలబ్ధి కోసం ఈ విధంగా తూలనాడటం సిగ్గుచేటు’’ అని దుయ్యబట్టారు. వైఎస్ పెట్టిన రాజకీయ భిక్షతో ఇంతటి స్థాయికి ఎదిగి స్వలాభం కోసం కఠినంగా మాట్లాడటం హేయమన్నారు. ఆనం మాటలు చూస్తుంటే జగన్‌ను పర్మినెంట్‌గా జైల్లోనే ఉంచాలనే ఆలోచన ఉన్నట్లుందని సందేహం వ్యక్తం చేశారు. 

విజయమ్మ, షర్మిల గురించి మాట్లాడిన మాటలు వారి సంస్కృతికి అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘బయ్యారం గనుల గురించి బ్రదర్ అనిల్‌పై అభియోగాలు మోపిన మంత్రి ఆనం దిగజారుడు వ్యాఖ్యలు చేసేకంటే.. అధికారం వారి చేతి లోనే ఉంది నిరూపించవచ్చు కదా?’’ అని మేకపాటి ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో జగన్ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) వేసిన సందర్భంగా వారు (ఆనం) ఇంత నీచంగా మాట్లాడడాన్ని చూస్తే.. వైఎస్ కుటుంబంపై ఎంత కక్షగట్టారో అర్థమవుతోందని పేర్కొన్నారు. జగన్ బయటకొస్తే ఈ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అక్కసుతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం పై ఇంత అన్యాయంగా మాట్లాడుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో కచ్చితంగా బుద్ధిచెప్తారని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబానికి భవిష్యత్తులో ఏ చిన్న హాని జరిగినా మీరే (కాంగ్రెస్ నేతలే) బాధ్యత వహించాలని హెచ్చరించారు.

వారిని వెలివేస్తారనే భయం పట్టుకుంది... 
రాష్ట్రం నుంచి వైఎస్ కుటుంబాన్ని వెలివేయాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంవత్సరం తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవర్ని వెలివేస్తారో తేలుతుందని స్పష్టం చేశారు. ‘‘నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి మతిభ్రమించినట్లుంది. 2009లో పోటీచేసిన నాకు కేవలం 55 వేల మెజారిటీ మాత్రమే ఇచ్చింది. కానీ 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీచేసి 2.97 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందాను. గతంతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ మెజారిటీతో గెలిచాను. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు ఇలాగే తూలనాడితే పది రెట్ల ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం’’ అని పేర్కొన్నారు. 

మీ తమ్ముడే మా పార్టీలో చేరాలనుకుంటున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్న మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సొంత తమ్ముడు జయకుమార్‌రెడ్డి తమ పార్టీలో చేరటానికి ఉవ్విళ్లూరుతున్నారని మేకపాటి తెలిపారు. జగన్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని, రాగానే పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ కుటుంబంపై ఆనం చేసిన వ్యాఖ్యలను టీడీపీ సమర్థించిన విషయాన్ని ప్రస్తావించగా.. రెండు పార్టీలు ఒక్కటే ఎజెండాగా పనిచేస్తున్నాయి కాబట్టే ఒకరినొకరు సమర్థించుకుంటారని మేకపాటి బదులిచ్చారు. సీఎం కుర్చీ కోసమో హోంమంత్రి పదవి కోసమో ఆనం ఈ రకంగా వ్యాఖ్యలు చేసినట్లున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: