హోంమంత్రి ప్రభావితం చేయరా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోంమంత్రి ప్రభావితం చేయరా ?

హోంమంత్రి ప్రభావితం చేయరా ?

Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013

* సాక్షులను ప్రభావితం చేస్తారంటూ జగన్‌ను పది నెలలుగా జైల్లో పెట్టారు
* సీబీఐ చార్జిషీట్లో హోం మంత్రి సబిత, మరో మంత్రి ధర్మాన పేర్లూ చేర్చారు
* సాక్షులను ప్రభావితం చేసే అవకాశం హోంమంత్రికి ఉంటుందా.. ఎంపీకి ఉంటుందా?
* మంత్రులను బయట వదిలి.. ఎంపీని ఎందుకు జైల్లో పెట్టారు?
* మంత్రులు కాంగ్రెస్‌లో ఉన్నారని.. ఆ పార్టీని జగన్ వ్యతిరేకిస్తున్నారనేనా?
* ఈ ప్రభుత్వం యువతను మద్యం మత్తులో ముంచుతోంది.. తెనాలి ఘటన దీనికి పరాకాష్ట
* చంద్రబాబు మద్దతు వల్లే ఈ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది 

 ‘‘జగనన్న బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ పది నెలలుగా జైల్లో పెట్టారు. ఇప్పుడు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు, అంతకుముందు మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు చేర్చారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం హోంమంత్రికి, మరో మంత్రికి ఉంటుందా? ఒక సాధారణ ఎంపీకి ఉంటుందా? సీబీఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేయగలిగే మంత్రులను బయట వదిలి.. ఒక సాధారణ ఎంపీ అయిన జగన్‌ను ఎందుకు జైలులో పెట్టారు? మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు... జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు గనుకేనా?’’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సీబీఐపై నిప్పులు చెరిగారు. 

‘‘జగనన్న విషయంలో సీబీఐ చెబుతున్న చందమామ కథలు ప్రజలు నమ్మేస్థితిలో లేరు. రాజకీయంగా పతనం చేయడానికే జగన్‌ను అరెస్టు చేశారు. ఈ పాపం ఊరికే పోదు. ఈ కుట్రలు పన్నిన వారు ఇంతకు ఇంత అనుభవిస్తారు’’ అని షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కయిన టీడీపీ అధినేతచంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాగిం ది. హనుమాన్ జంక్షన్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. 

కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మ..
‘‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని వాడుకుని జగనన్నను జైలు పాలు చేసింది. సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని స్వయంగా సీబీఐ మాజీ డెరైక్టర్ జోగీందర్ సింగ్ చెప్పారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ తాము గత్యంతరం లేక కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని, ఆ పార్టీని వ్యతిరేకిస్తే వేయి పడగలతో కాటేస్తుందని, సీబీఐని ఉసిగొల్పుతుందని చెప్పారు. సీబీఐ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరమా? జగనన్నపై ఇన్ని ఆరోపణలు చేసిన సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపలేదు.

తెనాలి సంఘటన బాధాకరం..
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఉగాది పండుగకు బట్టలు కూడా కొనుక్కునే పరిస్థితిలో లేమని, ఫలహారం చేసుకునే పరిస్థితి కూడా లేదని మహిళలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కుంటుపడింది. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది. ప్రభుత్వం పక్కా ఇళ్లకు పాడికట్టింది. అయితే ఒక్క మద్యం మాత్రం పుష్కలంగా ఏరులై పారుతోంది. తెనాలిలో నలుగురు యువకులు తాగిన మైకంలో ఒక అమ్మాయిని వేధిస్తుండగా.. ఆ అమ్మాయి తల్లి అడ్డుపడితే లారీ కిందకు తోసేసినట్లు పత్రికల్లో చదివాను. మద్యం మత్తులో యువత ఎంత చెడిపోతుందో, కుటుంబాలు ఎంత చితికిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

గ్రామాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. బెల్టుషాపులు తీసేసి పుణ్యం కట్టుకో అక్కా అని ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు మొరపెట్టుకుంటున్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే.. ఈ ఏడాది జనంతో 15 శాతం అదనంగా తాగించడానికి మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను నాశనం చేసేవారిని పాలకులు అంటారా? రాక్షసులు అంటారా? చంద్రబాబు అధికారంలోకి వస్తే మద్యం సరసమైన ధరలకు అమ్మిస్తారట. ఇలాంటి పెద్దమనుషులు మన నాయకులు. మహాత్మా గాంధీ తమ సొంతమని, తమకు ఆదర్శమని, ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్ ఒక మద్యం మాఫియా డాన్‌ను ఈ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ విలువలు ఎంత దిగజారిపోయాయో అర్థమవుతోంది.

ఇక్కడి నుంచే ఉచిత విద్యుత్ వాగ్దానం చేశారు
వైఎస్ రాజశేఖరరెడ్డి 1999లో ఇక్కడి(హనుమాన్ జంక్షన్) నుంచే ఉచిత విద్యుత్ వాగ్దానం చేశారు. మద్దతు ధర కోసం ఇక్కడ నుంచే ఉద్యమం చేశారు. ఆయన బతికి ఉంటే రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. ఆయన రెక్కల కష్టంతో అధికారం చేపట్టిన ఈ కాంగ్రెస్ నాయకులు.. ఆయన వాగ్దానం చేసిన తొమ్మిది గంటలు కాదు కదా మూడు గంటల విద్యుత్ కూడా రైతులకు ఉచితంగా ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నారు. అది కూడా తేళ్లు, పాములు తిరిగే రాత్రి సమయాల్లో ఇస్తున్నారు. గ్రామాల్లో నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. 

లేని కరెంట్‌కు మూడింతల బిల్లులు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కరెంట్ నిల్ - బిల్ ఫుల్ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉంది. విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై ఏకంగా 32 వేల కోట్ల రూపాయల భారం వేసింది. వ్యాట్ పేరుతో మరో పది వేల కోట్ల రూపాయల భారం వేసింది. ఇంత ధైర్యంగా ప్రజలను ఈ ప్రభుత్వం వేధిస్తోందీ అంటే దీనికి కారణం చంద్రబాబు అండగా ఉండడమే. ఎమ్మార్, ఐఎంజీ కేసులు బయటకు రాకుండా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికి ఉంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయేది. అదే జరిగితే ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడేది కాదు.’’

13.4 కిలోమీటర్లు సాగిన యాత్ర..
పాదయాత్ర 116వ రోజు బుధవారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను నుంచి ప్రారంభమైంది. ఇక్కడ రచ్చబండ నిర్వహించి స్థానికుల సమస్యలు తెలుసుకున్న అనంతరం షర్మిల నడుచుకుంటూ కానుమోలు, పెరికిడి మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బుధవారం మొత్తం 13.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ మొత్తం 1,573.2 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. అంతకుముందు ఆరుగొలనులో వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి నేతృత్వంలో పలువురు డాక్టర్లు, వైద్య విద్యార్థులు, 104, 108 ఉద్యోగులు షర్మిలను కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. 

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని, టి. బాలరాజు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప అప్పారావు, ముసునూరి రత్నబోస్, జేష్ట రమేష్‌బాబు, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి, కుక్కల నాగేశ్వరరావు, ఉప్పులేటి కల్పన, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వసంత నాగేశ్వరరావు, స్థానిక నాయకులు దుట్టా రామచంద్రరావు తదితరులున్నారు.

ఉగాది శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు షర్మిల ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సరాదిని అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
Share this article :

0 comments: