ఉచిత విద్యుత్ ఎత్తివేస్తే ఊరుకోం: వైఎస్సార్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉచిత విద్యుత్ ఎత్తివేస్తే ఊరుకోం: వైఎస్సార్‌సీపీ

ఉచిత విద్యుత్ ఎత్తివేస్తే ఊరుకోం: వైఎస్సార్‌సీపీ

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013


రైతాంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు తూట్లు పొడిచే ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం హెచ్చరించింది. ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేస్తే రైతుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. రైతుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. వైఎస్సార్‌సీపీ నాయకులు మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, భూమా శోభానాగిరెడ్డి సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి సరికొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి లక్షలాది కనెక్షన్లు రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తోందని అందులో పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కనెక్షన్లు రద్దు చేయడమే కాకుండా రైతాంగం నుంచి పాతబకాయిల పేరిట వసూళ్లకూ పూనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పేద రైతాంగానికి ఇప్పటికే నోటీసులు జారీ కావడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని, దీనివల్ల ఒక్కొక్క రైతుపై రూ. 15 వేల భారం పడుతుందని పేర్కొన్నారు. పాత బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేయడమే కాకుండా 2004 సంవత్సరం నుంచి సర్వీస్ చార్జీలు రాబట్టాలని చూస్తోందన్నారు. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని, కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడాన్ని తప్పుపట్టారు. రైతులకు గొడ్డలిపెట్టుగా మారిన బకాయిల వసూళ్లను నిలిపివేయాలని, ఉచిత విద్యుత్ కనెక్షన్ల తొలగింపు ఆలోచనను విరమించుకోవాలని, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రైతాంగానికి 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. 
Share this article :

0 comments: