గల్ఫ్ కార్మికులను ఆదుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గల్ఫ్ కార్మికులను ఆదుకోండి

గల్ఫ్ కార్మికులను ఆదుకోండి

Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013


 సౌదీ అరేబియా, కువైట్ దేశాల్లో అమలు చేస్తున్న ‘నితాఖత్’ విధానం వల్ల ఉపాధి కోల్పోయి వెనుదిరిగి వచ్చే రాష్ట్రానికి చెందిన కార్మికులను ఆదుకోవాలని, ఇందుకోసం తక్షణం ఒక విధానాన్ని రూపొందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆమె శుక్రవారం ఒక లేఖ రాశారు.

సౌదీ అరేబియా, కువైట్ దేశాలు అమలు చేయనున్న కఠినమైన కార్మిక చట్టాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. వీటి కారణంగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్న 6 లక్షల మంది, కువైట్‌లోని 1.5 లక్షల మంది రాష్ట్రానికి చెందిన కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని విజయమ్మ ఆందోళన వ్యక్తంచేశారు. సీఎంకు విజయమ్మ రాసిన లేఖ సారాంశమిలా ఉంది..

సౌదీ ప్రభుత్వం అమలు చేయబోయే ‘నితాఖత్’ విధానం వల్ల ఆ దేశస్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతర దేశాల నుంచి అక్కడకు వలస వెళ్లిన కార్మికులు ఉద్యోగావకాశాలు కోల్పోతారు. మరో గల్ఫ్ దేశమైన కువైట్ కూడా అక్రమంగా ఆ దేశంలో నివసిస్తూ ఉపాధి పొందుతున్న వారిని గుర్తించి వారిని స్వదేశాలకు తిప్పి పంపే ప్రక్రియను ప్రారంభించింది.

వచ్చే నెల 3వ తేదీ లోపు సౌదీ అరేబియాలో పనిచేసే వలస కార్మికులు నివాస, ఉపాధి ధృవీకరణ పత్రాలను సరిచేసుకోవాలని అక్కడి ప్రభుత్వం గడువు విధించింది. అలాగే భారత జాతీయులను నియంత్రించడానికి కువైట్ ప్రభుత్వం కూడా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగా ఒక్క మన రాష్ట్రానికి చెందిన వారే 1,50,000 మంది ఉపాధి కోల్పోయి తిరిగి రానున్నారు.

దీనివల్ల భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోవడంతో పాటు, ఉపాధి కోల్పోయిన కార్మికులు స్వదేశానికి వెల్లువలాగా వ స్తారు. వారి సమస్యలను సత్వరం పరిష్కరించకపోతే అలివిగాని రీతిలో సామాజిక సమస్యలు తలెత్తవచ్చు. అందుకే వీరి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఏడాది మే 17వ తేదీన మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు నేనొక లేఖ రాశాను. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖలు కలిసి ఆ రెండు దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి, అక్కడ నివసిస్తున్న ప్రవాసులకు మరికొంత కాలం వీసా గడువును పొడిగించేలా చూడాలని కోరాను.

తద్వారా అక్కడ పనిచేస్తున్న మన దేశ కార్మికులు దశల వారీగా, గౌరవపూర్వకంగా స్వదేశానికి రావడానికి అవకాశం కల్పించాలని కోరాను. అయితే, ఈ బాధ్యతను కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదలివేసిందని పత్రికల ద్వారా తెలుసుకున్నాను. సౌదీ అరేబియాలోని 6 లక్షల మంది, కువైట్‌లోని 1.5 లక్షల మంది మన కార్మికుల స్థితిపై ఆందోళన చెందుతున్నాను.

కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ (పాత బస్తీ), వైఎస్సార్ కడప, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఈ కార్మికుల్లో కొందరు వృత్తి నైపుణ్యం గలిగిన వాళ్లు, పాక్షిక నైపుణ్యం గల వారు ఉన్నారు. వీరిలో ఒకటిన్నర లక్షల మంది రానున్న రెండు నెలల్లో వెల్లువలాగా స్వదేశానికి వచ్చేస్తే, మన రాష్ట్రం సమస్యల్లో పడుతుంది. వలస కార్మికులను పంపేయాలనే అంటువ్యాధి వంటి ఆలోచన ఇతర గల్ఫ్ దేశాలకు కూడా పాకితే ఇది పెను సమస్యగా మారుతుంది. ఆ పెను సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మీ ప్రభుత్వ యంత్రాంగం మరింతగా సన్నద్ధం కావాలి.

ఇలా తిరిగి వచ్చిన కార్మికులు తీవ్ర నిరాశా నిసృ్పహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో జరిగాయి. ఇలా కార్మికులు నిరాశా నిస్పృహలకు లోనయ్యే ప్రమాదాన్ని ప్రభుత్వ చర్యల ద్వారా నివారించవచ్చు. ఇప్పుడ గల్ఫ్ నుంచి తిరిగి వచ్చే కార్మికుల, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులుగా మనం వెను వెంటనే ఒక స్పష్టమైన రాష్ట్ర విధానంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కింది చర్యలు తక్షణం తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరుతోంది.

1. భారత కార్మికులు తెలియక చేసే పొరపాట్లకు వారిపై కేసులు పెట్టకుండా మన విదేశీ మంత్రిత్వ, ప్రవాస వ్యవహారాల శాఖలు నిరంతరం అక్కడి ప్రభుత్వాలతో మంతనాలు నెరపుతూ ఉండాలి.

2. అక్కడి మన వారు సజావుగా, దశలవారీగా వెనక్కి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేయాలి.

3. ఉపాధి కోల్పోయి, దుఃఖంలో ఉన్న వారు తిరిగి రావడానికి ఉచితంగా ప్రయాణపు ఏర్పాట్లను చేయాలి.

4. ఉపాధి కోల్పోయి వెనుదిరిగి వచ్చే గల్ఫ్ బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు వారికి తగిన కౌన్సెలింగ్, శిక్షణను ఇచ్చి ఇక్కడ ఉపాధి లభించేలా చేయడానికి ప్రత్యేకంగా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలి.

5. తిరిగి వచ్చే వారి కార్మికుల నైపుణ్యానికి తగినట్లుగా, వారు చేయగలిగే ఉద్యోగాలను రాష్ట్రంలో పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి.

6. వలస కార్మికులకు ఉపాధి కల్పించే సంస్థలు, వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిర్దేశించాలి. తద్వారా యోగ్యత లేని సంస్థలు, దళారీలు లేకుండా చేయడానికి వీలు కలుగుతుంది.
Share this article :

0 comments: