జగన్ అన్యాయం చేశాడని ఓ పెట్టుబడిదారుడితో చెప్పించగలరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అన్యాయం చేశాడని ఓ పెట్టుబడిదారుడితో చెప్పించగలరా?

జగన్ అన్యాయం చేశాడని ఓ పెట్టుబడిదారుడితో చెప్పించగలరా?

Written By news on Wednesday, June 19, 2013 | 6/19/2013


* కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ ఓ వర్గం మీడియా కుట్రతోనే జగన్ జైలుకు
* జగన్ బయట ఉంటే కాంగ్రెస్, టీడీపీలకు బతుకు ఉండదనే కుట్రకు వ్యూహం..
* జగన్ అన్యాయం చేశాడని ఓ పెట్టుబడిదారుడితో చెప్పించగలరా?
* పులిబిడ్డ లేక అభివృద్ధి నీరసించిపోతోంది
* సెప్టెంబర్‌లో బెయిల్ రాకపోతే ప్రజా ఉద్యమం ఉద్ధృతం చేస్తాం
* ‘సాక్షి చైతన్య పథం’లో తమ బిడ్డను తలచుకొని కన్నీరుమున్నీరైన పులివెందుల వాసులు

‘‘సొంతబిడ్డపై మమకారం...అన్నా! అని చేయి చాపిన వాడికి నేనున్నా! అని ఆదరించిన జ్ఞాపకం...తమ కళ్లెదుటపుట్టి, పెరిగిన బిడ్డను చేయని నేరానికి జైలు పాలుచేశారనే బాధ.. ఈ తంతుకు సూత్రధారులైన కాంగ్రెస్, టీడీపీలపై పట్టరాని ఆక్రోశం...5 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిపించుకున్న తమ ప్రజాప్రతినిధి ఎప్పుడు తమ మధ్యకు వస్తాడా? అనే ఆశ...ఎప్పుడు 2014 వస్తుందా? కాంగ్రెస్, టీడీపీలను చావుదె బ్బ తీసి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలా అనే కసి’’...పులివెందుల వాసుల కళ్లలో ప్రస్ఫుటించాయి. జగన్ ఎప్పుడు బయటకు వస్తాడా అని పులివెందులలోని ప్రతీ గుండె కోటి కళ్లతో ఎదురు చూస్తూ... ముక్కోటి దేవుళ్లకు మొక్కుతూ ఎదురుచూస్తోంది.

కడప/పులివెందుల, సాక్షి: జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదికిపైగా జైళ్లో నిర్బంధించిన నేపథ్యంలో ‘సాక్షి చైతన్య పథం’ చర్చావేదికను మంగళవారం పులివెందులలోని వీజే కల్యాణమంటపంలో నిర్వహించారు. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ చర్చావేదికలో బార్‌అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎన్‌జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజకుళాయప్ప, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఓఎస్‌డీ చంద్రశేఖరరెడ్డి, అధ్యాపకురాలు అరుణ, వికలాంగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరెడ్డి, డాక్టర్ రణధీర్‌రెడ్డి, స్వర్ణకారుల సంఘం గౌరవాధ్యక్షుడు నూరుల్లా, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు శేషారెడ్డి పాల్గొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సొంతగడ్డ...సొంత జనం మధ్య సాగిన ఈ చర్చలో వైఎస్ కుటుంబం ప్రజల గుండెల్లో ఎలాంటి ముద్రవేసుకుందో మరోసారి సుస్పష్టమైంది.

చర్చ మొదలవుతూనే...తమ బిడ్డ ఏ తప్పూ చేయలేదని అన్యాయంగా జైళ్లో పెట్టారని వక్తలతో పాటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సోనియా కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని మహానేత వైఎస్ కాంక్షించారు. అయితే వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రం జైళ్లో పెట్టారు. ఏ తప్పు చేశాడని ఆయన్ను జైళ్లో నిర్బంధించారు?’ అని సుభాషిణి అనే మహిళ ప్రశ్నించారు. దీనికి రాజ కుళాయప్ప స్పందిస్తూ..‘చిన్న వయస్సులో పార్టీని స్థాపించడమే నేరమట.

రెండుపార్టీలకు దీటుగా ఎదగడమే తప్పట. అందుకే అరెస్టు చేశారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఈ విధంగా దిగజారుతున్నాయి.’ అన్నారు. ఇంతలో నరసింహారెడ్డి మైకందుకున్నారు. సెప్టెంబరులో బెయిల్ వస్తే న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోగవుతుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావు.’ అన్నారు. వెంటనే జనంలో నుంచి మహ్మద్‌అలీ అనే పెద్దాయన మైకు తీసుకుని బోరున ఏడ్చారు.‘ఏమయ్యా! స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయింది. రైతులకు కరెంటు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదు. కృష్ణా-గోదావరిని కలపాలని యోచించలేదు. ప్రజల బాధ తెలుస్తే ఈ ఆలోచనలు వస్తాయి. ఆలోచనలను నిజం చేసిన వాడు వైఎస్. ఈయన బిడ్డపై కేసులు పెడతారా? పైగా ఏ తప్పు చేయకుండా? తప్పు నిర్ధారణ కాకుంటే జైళ్లో గడిపిన జీవితాన్ని వెనక్కు ఇస్తారా? రాష్ట్రపతి, కోర్టులు ఏం చేస్తున్నాయి.’ అని ఆగ్రహించారు.

పెద్దాయన ఏడుపు చూసి పక్కనే ఉన్న అనసూయ కళ్లు చెమర్చాయి. ‘మేడమ్! నా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే చదివాడు. మేం బతుకుతున్నామంటే వైఎస్ పుణ్యమే. మంచి చేయడం కాంగ్రెసోళ్లకు చేతకాదు. చేసేవాళ్లను కూడా జైళ్లో ఉంచడం ఏంటి?’ అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న లక్ష్మిదేవి అనే మరో మహిళ మైకు తీసుకున్నారు.‘ మా బిడ్డ జగన్‌కు మేలు చేయడమే తెలుసు...మోసం చేయడం ఎరుగడు. ఈ పూట ముద్ద తింటున్నాం అంటే ఆయన మేలే. వారి ఇంట్లో మనుషుల కంటే ప్రజలను ఎక్కువగా ప్రేమించాడు. సోనియా కుట్రతోనే జైలుకు వెళ్లాడు.’ అని నినదించారు. ‘ఇంతలో చర్చలో రఘునాథరెడ్డి జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే జగన్‌ను సీఎంను చేస్తామని కేంద్ర మంత్రి ఆజాద్ చెప్పారు. కాదని పార్టీని వీడినందుకు ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రవేశారు. ఎంత కాలం జైళ్లో పెడతారో చూద్దాం.’ అన్నారు. దీనికి నూరుల్లా స్పందిస్తూ...‘జగన్‌కు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే ప్రజల్లో అంత చైతన్యం పెరుగుతుంది.’ అన్నారు. ‘దర్యాప్తు పేరుతో ఇంతకాలం ఏ ఒక్క ఆధారమైనా సీబీఐ సేకరించిందా? ఏదీ దొరకనపుడు ఎందుకు జగనన్నను జైళ్లో నిర్బంధించారు’ అని అరుణ అన్నారు. వైఎస్ మృతి, జగన్ అరెస్టు పులివెందులను కుంగదీశాయని, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపాయని భాను ప్రకాశ్ అన్నారు. ఐజీ కార్ల్‌తో పాటు కనీసం సాగునీరు కూడా అందడం లేదని ఆవేదన చెందారు. ఇంతలో నరసింహారెడ్డి కలుగజేసుకుని ప్రస్తుతం వైఎస్ లేరు, అధికారం లేదు. ఈ పరిస్థితుల్లో జగన్‌కు అండగా నిలివాలని సూచించారు.

అధికారప్రతిపక్ష పార్టీలకు తోడు ఓ వర్గం మీడియా కుమ్మక్కై జగన్‌ను ఇరుకునపెడుతున్నారని రఘునాథరెడ్డి అన్నారు. ఇంతలో రామచంద్రయ్య స్పందిస్తూ ప్రజా బలం, గుండెధైర్యం, వైఎస్ ఆశీస్సులు, దేవుడి దయ ఉన్న జగన్‌ను ఎవ్వరు ఏమీ చేయలేరన్నారు. ఈ విధంగా దాదాపు రెండు గంటలకు పైగా సాగిన చర్చలో ప్రజలు భావోద్వేగాలకు లోనయ్యారు. చర్చ ముగింపు సందర్భంగా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ సెప్టెంబరులో బెయిల్ రాకపోతే జైలుగోడల వద్ద నిరాహారదీక్షలు చేస్తామని, ప్రజా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రితో బెడ్‌పై ఉన్న కాంగ్రెస్‌కు టీడీపీ ఆక్సిజన్ అందిస్తోందని, వెంటిలేటర్‌పై ఉన్న ప్రాణం ఎంతో కాలం నిలవదని చంద్రశేఖరెడ్డి అన్నారు. వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు..ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదంటారు...కానీ జగన్‌ను అన్యాయంగా ఏడాదిపైగా జైళ్లో పెట్టారని... త్వరగా బయటికి రావాలని వక్తలు ఆకాంక్షించారు.
Share this article :

0 comments: