జగన్ నిర్దోషి అని నా ఓటుతో తీర్పు చెబుతా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నిర్దోషి అని నా ఓటుతో తీర్పు చెబుతా...

జగన్ నిర్దోషి అని నా ఓటుతో తీర్పు చెబుతా...

Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013

కాంగ్రెస్, టీడీపీ పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది: షర్మిల
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 186, కిలోమీటర్లు: 2,472

మరో ప్రజా ప్రస్థానం నుంచి ‘సాక్షి’ప్రతినిధి: ‘ఏడాది కాలం నుంచి చూస్తున్నా. వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డికి బెయిల్ రేపొస్తది.. మాపొస్తది అని చెప్తున్నారు. ఎంత అన్యాయం అమ్మా.. వైఎస్ పేదోళ్ల కోసం పని చేసినందుకు జగనన్నను జైల్లో పెట్టారా? లేకుంటే ఆయన 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినందుకు ఆయన కొడుకును జైల్లో పెట్టారా? కోర్టులో జడ్జి తీర్పును నేను ఏమీ అనడం లేదమ్మా. కానీ నేను కూడా తీర్పు చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని నా ఓటుతో తీర్పు చెప్తా. కోర్టులో జడ్జీలు చెప్పే తీర్పుకు తిరుగుంటుందేమో గానీ, జనం తీర్పుకు తిరుగు లేదమ్మా’ - మరో ప్రజా ప్రస్థానంలో శుక్రవారం షర్మిలతో బంగారయ్యపేట గ్రామానికి చెందిన 75 ఏళ్ల విశ్రాంత రైతు కన్నారావు ఉద్వేగంతో అన్న మాటలివి! వైఎస్ హయాంలో ఆదర్శ రైతు పతకాన్ని అందుకున్న ఆయన, ఆ సందర్భంగా మహా నేత ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని షర్మిలకు చూపించారు. షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగింది.

దారి పొడవునా రైతులు, వృద్ధులు, మహిళలు, చేతివృత్తుల వారు షర్మిలను కలిశారు. వారి సమస్యలేమిటని షర్మిల అడిగితే.. ‘జగనన్న ఎప్పుడు బయటికి వస్తాడమ్మా?’ అంటూ వాళ్లే ఆమెను అడుగుతున్నారు! మీరు చూపుతున్న అభిమానమే జగనన్నకు అండ అని వారికి షర్మిల బదులిచ్చారు. ‘‘జగనన్న జైల్లో ఉన్నా ధైర్యంగానే ఉన్నారు. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోతే అనాథలయింది మా ఒక్క కుటుంబం మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలంతా అనాథలైపోయారని జగనన్న అర్థం చేసుకున్నారు. కాబట్టే జగమంత కుటుంబాన్ని నాన్న తనకు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబమే అనుకున్నారు. వైఎస్సార్ ఈ రాష్ట్ర ప్రజలను ప్రేమించారు. తన జీవితాన్ని పూర్తిగా వారికోసమే అంకితం చేశారు. కానీ తనది జగమంత కుటుంబం అనుకున్న జగనన్నను ఈ రోజు ఆ జనం నుంచే వేరు చేశారు.

కాంగ్రెస్, టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం అమాయకుని జీవితాన్ని బలిపెట్టారు. వీళ్ల పాపాలను దేవుడు లెక్కపెడుతున్నాడు. రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ పాపాత్ములను ఎప్పుడెప్పుడు శిక్షిద్దామా అని వారు ఎదురు చూస్తున్నారు. వీళ్ల పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది. తమకు రాజన్న రాజ్యం కావాలని తీర్పు చెప్పడానికి కోట్ల గొంతులు వేచి ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కి వేసే ప్రతి ఓటూ... జగనన్న నిర్దోషి అని వారు నమ్ముతున్నారని చాటి చెప్పనుంది. దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో, ఆయన మంచివాళ్ల పక్షాన నిలబడతాడనేదీ అంతే నిజం. ఒక రోజు తప్పక వస్తుంది. ఆ రోజున జగనన్న బయటికి వస్తారు. మనందరినీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారు’’ అని షర్మిల అన్నారు. అవకాశం వచ్చినప్పుడు జగనన్నను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

శుక్రవారం 15.5 కిలోమీటర్లు పాదయాత్ర

షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం 186వ రోజు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శాంతి ఆశ్రమం ఆర్చ్ నుంచి మొదలైంది. శంఖవరం, బంగారయ్యపేట, రైతులపూడి గ్రామాల మీదుగా సాగింది. ఆమె 15.5 కిలోమీటర్లు నడిచి రాత్రి 7.30కు రైతులపూడి శివారులోని బసకు చేరుకున్నారు. యాత్ర ఇప్పటి వరకు 2,472 కి.మీ. సాగింది. నేతలు వరపుల సుబ్బారావు, చెలమలశెట్టి సునీల్, కొల్లి నిర్మల కుమారి, విప్పర్తి వేణుగోపాల్, అనంతబాబు, చింతా కృష్ణమూర్తి, బొంతు రాజేశ్వరరావు, జ్యోతుల నవీన్ తదితరులు షర్మిలతో పాటు నడిచారు. జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చిర్ల జగ్గిరెడ్డి, ముదునూరి ప్రసాదరాజు తదితరులు షర్మిలను కలిశారు.
Share this article :

0 comments: