పెద్దాయనకు ప్రతిరూపం జగనన్న! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెద్దాయనకు ప్రతిరూపం జగనన్న!

పెద్దాయనకు ప్రతిరూపం జగనన్న!

Written By news on Sunday, June 23, 2013 | 6/23/2013

జగన్ కేసులో సహజ న్యాయ సూత్రాలకనుగుణంగా దర్యాప్తు చేయాలని, క్విడ్‌ప్రోకో మీద విచారణ జరపాలని కోర్టులు చెబితే... సంబంధిత జీవోల చట్టబద్ధత మీద దర్యాప్తు చేయకుండా పెట్టుబడులు ఎవరు పెట్టారు? నిధులు ఎలా సమకూర్చారు? అని సీబీఐ వక్రమార్గంలో దర్యాప్తు చేయటం ఏవిధమైన సహజ న్యాయ సూత్రమో ప్రజలకు అర్థం కావటం లేదు.


జగన్ కేసులో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, సీబీఐ తీరుతెన్నులు చూశాక, మనది ప్రజాస్వామ్య దేశమేనా అని అనుమానం కలుగుతోంది. రాజకీయ కురువృద్ధులు కరుణానిధి, ములాయం, మాయావతి, వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్‌లు.. కాంగ్రెస్ అధికార దాహంతో రాజకీయ ప్రత్యర్ధుల మీద వేయి చేతులతో సీబీఐని ప్రయోగించి, వెంటాడి వేధించి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్రంగా ఆరోపించటాన్ని బట్టి, మనది ప్రజాస్వామ్య దేశమా లేక కాంగ్రెస్ నియంతృత్వ పాలనలో ఉన్న దేశమా అని సందేహం కలగడం సహజమే. 

దేశంలో ఎక్కడా లేని విధంగా తమ మీద ఆరోపణలకు సమాధానం చెప్పలేని దివంగతులను ఎఫ్‌ఐఆర్‌లో పెట్టటం, ఒకే ఎఫ్‌ఐఆర్ మీద పుంఖానుపుంఖాలుగా ఛార్జిషీట్లు దాఖలు చేయటం ఏ రకమైన సహజ న్యాయ సూత్రమో సీబీఐ చెప్పాలి. కింది కోర్టులో ఒక రకంగా, హైకోర్టులో ఒక రకంగా మోసపూరితంగా వ్యవహరించి సీబీఐ జగన్ బెయిల్‌ను అడ్డుకుంటోంది. అదేమంటే జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని వితండవాదం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అజమాయిషీలోని సీబీఐ వైఖరిని నిశితంగా గమనిస్తే, సాక్షులను ప్రభావితం చేస్తోంది ఎవరో ప్రజలకు అర్థమవుతూనే ఉంది. బొబ్బిలిపులి, ఖైదీ లాంటి సినిమాలు గుర్తుకొస్తున్నాయి. వాటిల్లో చట్టం ఎలా చిన్నబోయిందీ అందరికీ బాగా అర్థమయ్యేలా చిత్రీకరించారు. 

పార్టీ నుండి బయటకు వచ్చి, సిసలైన ప్రజానాయకుడిలా ప్రజాదరణ పొందుతూ, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల పక్షాన నిలిచి రైతుదీక్ష, ఫీజుదీక్ష, జలదీక్ష అంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల మీద పోరాటం చేయటమే నేరం అన్నట్లు జగన్ మీద కాంగ్రెస్ కక్ష పెంచుకుంది. ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక, తమకు అలవాటైన సీబీఐని ప్రయోగించి లొంగదీసుకోవాలని ఢిల్లీ పెద్దలు కుట్రలు పన్నారు. జగన్ మీద విచారణ కోరింది సోనియా ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకుడు శంకర్రావుగారు. విచారణ జరుపుతున్నది సోనియాగాంధీగారు అధ్యక్షత వహిస్తున్న యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ. 

అంటే రాజకీయ కక్షతో విచారణ కోరింది, విచారణ పేరుతో కుట్రలకు పాల్పడుతోంది ఒక్కరే! దానికి రుజువుగా ఈ కేసులో జగన్‌కు ఎంత అన్యాయం జరుగుతోందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. సీబీఐ విచారణ తీరు... తమకు నచ్చినవారిని వదిలేయటం, ప్రశ్నించకపోవటం, అరెస్టు చేయకపోవటం, జగన్‌కు వ్యతిరేకంగా చెప్పమని సాక్షులను ఒత్తిడి చేయటం, ఛార్జిషీట్‌ల మీద ఛార్జిషీట్లు దాఖలు చేయటం, కేసు విచారణ మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా, బెయిల్‌ను అడ్డుకోవటానికి దర్యాప్తు ముగించకుండా సాగదీయటం, కోర్టుల్లో చెప్పిన మాటలకు కట్టుబడి ఉండకపోవటం, బెయిల్ పిటీషన్లు విచారణకు వచ్చే ప్రతిసారీ ఎల్లో మీడియాకు దర్యాప్తు అంశాలు లీకులిచ్చి కథనాలు ప్రచురించేట్టు చేసి, న్యాయవ్యవస్థను ప్రభావితం చేయాలని చూడటం... ఇన్ని నీతిమాలిన పనులకు సీబీఐ దిగజారిపోయింది. 

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న రీతిలో వెళుతోంది. సీబీఐ చేస్తున్నది నిష్పక్ష పాత దర్యాప్తు అని రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మటం లేదు. రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పెద్దలు సీబీఐ ద్వారా ఆడుతున్న ఈ నాటకానికి విస్తుపోతున్నారు. అధికారం ఉంది కదా అని కేవలం రాజకీయ కక్షతో ఒక ప్రజానాయకుడిని ఇంతలా వేధించటం ఏ విధంగా సమర్ధనీయమో కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. తమకు నచ్చని నాయకులను సీబీఐ ద్వారా వేధించటం ఏ విధమైన ప్రజాస్వామ్యమో ప్రజలకు చెప్పి తీరాలి. సీబీఐ మీద వివిధ పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలు జగన్ కేసులో కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి.

కాంగ్రెస్ నాయకులు కనీస కృతజ్ఞత మరచి బరితెగించి చనిపోయిన వై.ఎస్.ను తిట్టి పోసినా, నియంతృత్వ పోకడలతో సీబీఐని ప్రయోగించి, జగన్‌ను మోసపూరితంగా అరెస్టు చేసినా ప్రజలు మాత్రం తమకు మంచి పరిపాలన అందించిన వై.ఎస్. మీద కృతజ్ఞతతో ఆయన తనయుడు జగన్‌కి మద్దతుగా ఉన్నారని ఉప ఎన్నికల్లో రుజువైంది. మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు పట్టం కట్టబోతున్నారన్నది నిజం. 

ఇక జగన్‌గారి క్విడ్ ప్రోకో కేసులో మమ్మల్నందరినీ నిందితులుగా చేర్చాలని సీబీఐవారిని కోరుతున్నాను. మొదట మేము ఓట్లు వేశాం, వై.ఎస్. తన మంచి పాలనతో మాకు ఆర్థికంగా మేలుచేశారు. ప్రతిగా మేం మళ్లీ ఆయన్ను రెండోసారి గెలిపించాం. ఆయన కుమారుడైన జగన్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించాం. ఇదంతా మీ వక్ర భాషలో చెప్పాలంటే క్విడ్ ప్రోకోనే కాబట్టి, మమ్మల్ని అందరినీ జగన్ కేసులో నిందితులుగా చేర్చి, కోటానుకోట్ల ఛార్జిషీట్లు కోర్టుకు సమర్పించమని సవినయంగా సీబీఐని వేడుకుంటున్నాం. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్‌లో సీబీఐ నడుస్తుంది కాబట్టి, ఆ పెద్దలను జగన్‌తో ఉన్న కోటాను కోట్ల మందిపై కూడా సీబీఐని పురిగొల్పి కేసులు పెట్టి వేధించుకోమని ప్రార్థిస్తున్నాం. 

- గూడూరు చంద్రశేఖర్, షాపూర్‌నగర్, హైదరాబాద్

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: