జగన్ ప్రైవేటు వ్యక్తి కాదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ప్రైవేటు వ్యక్తి కాదా?

జగన్ ప్రైవేటు వ్యక్తి కాదా?

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

మరో ప్రజా ప్రస్థానంలో షర్మిల ధ్వజం
అద్దంలో ముఖం నచ్చక అద్దాన్ని పగులగొట్టినట్లుంది బాబు వైఖరి
అవిశ్వాసం పెట్టినా ప్రభుత్వం పడిపోకూడదన్నదే ఆయన ఎత్తుగడ
వైఎస్‌పై ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ ఎన్నో వ్యతిరేక కథనాలు రాసినా.. 
ఆయన వాటికి కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 178, కిలోమీటర్లు: 2,360.8

విజయం మనదే

‘‘స్థానిక ఎన్నికలు వస్తున్నాయి..మనకు క్యాడర్ లేదని కాంగ్రెస్, టీడీపీలు ప్రచారం చేస్తున్నాయి. దేవుని దయ.. జనబలం ఉంది. విజయం మనదే. అవి స్థానిక ఎన్నికలైనా కావచ్చు.. మరే ఎన్నికలైనా కావచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషి అని చాటిచెబుతుంది. జగనన్న బయటకురావడానికి బాటలు వేస్తుంది.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి:‘‘సాక్షి మీడియా అన్నదినిజానికి ప్రతిరూపంగా నిలిచింది. చంద్రబాబు నిజాలను రాస్తుంది కనుక ‘సాక్షి’ అంటే ఆయనకు అసహ్యం. నిజానికి నిజాలంటేనే గిట్టవు చంద్రబాబుకి. అద్దంలో తన ముఖం నచ్చక అద్దాన్ని పగలగొట్టిన రీతిలో ఉంది చంద్రబాబు వైఖరి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘సాక్షి’ని బహిష్కరించాలన్న టీడీపీ వైఖరి.. ఎంతమాత్రమూ సమంజసంగా లేదని అన్నారు. ‘‘చంద్రబాబు క్షమించరాని ద్రోహాలు చేశారు. 

చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. పులిని చూసి నక్క వాతలుపెట్టుకున్నట్టు వైఎస్ అమలుచేసిన పథకాలన్నీ ఇప్పుడు తాను చేస్తానంటున్నారు. నీవు సీఎంగా ఉండగా తొమ్మిదేళ్లూ ఏం చేశావు చంద్రబాబూ? వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. మీ పాపం పండే రోజు దగ్గర పడింది. పాపాలపుట్ట పగిలి బయటకు వచ్చే విషసర్పాలు వేటాడి, తరిమి, తరిమి కొట్టే రోజు దగ్గర్లోనే ఉంది’’ అంటూ హెచ్చరించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు కుతంత్రానికీ నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో సాగింది. కాకినాడ జగన్నాథపురంలో అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ..: చంద్రబాబు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా.. ఎప్పుడూ జరగని విధంగా మీడియాను బహిష్కరిస్తున్నారు. ‘సాక్షి’ మీడియా, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా తమ కార్యక్రమాలను కవర్ చేయకూడదంటున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉండి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ, సహనం. కాని చంద్రబాబుకు ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం కొత్తేమీ కాదు. రాజశేఖరరెడ్డి మీద ‘ఈటీవీ’, ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ వంటివి ఎన్నో వ్యతిరేక కథనాలు రాశాయి. అయినా రాజశేఖరరెడ్డి వాటికి కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ పత్రికల విలేకరులను ఆయన ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. కానీ చంద్రబాబు మాత్రం నిజాలను తట్టుకోలేకపోతున్నారు. అలాగే జైల్లో అక్రమ నిర్బంధంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఒకే ఒక ఎజెండా. జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఎవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అని లెక్కలు వేయడమే చంద్రబాబు పని.

అవిశ్వాసం బాబుకు ఓ డ్రామా..

చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌తో కలవక ముందు అవిశ్వాసం పెట్టకుండా, ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు అన్నప్పుడు అవిశ్వాస డ్రామా ఆడారు చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ ఈ పదిహేను మంది ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేశాక.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు కనుక ఇప్పుడు మళ్లీ అవిశ్వాస డ్రామా ఆడినా ఆడతారాయన. చంద్రబాబు ఉద్దేశం ఎమ్మెల్యేలు డిస్‌క్వాలిఫై కావాలి.. కానీ ఉప ఎన్నికలు రాకూడదు. అవిశ్వాసం పెట్టాలి.. కానీ ప్రభుత్వం కూలిపోకూడదు. ఇదీ ఎత్తుగడ.

జగన్ ప్రైవేటు వ్యక్తి కాదా?

రాజీవ్‌గాంధీ పేరు బోఫోర్స్ కేసులో ఉంది. కానీ ఆయన చనిపోయిన తర్వాత సీబీఐ ఆయన పేరును కేసు నుంచి తొలగించింది. కానీ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మీద అవినీతి అరోపణలు ఉంటే.. నిన్న ప్రధానమంత్రి కార్యాలయం ఆయన గురించి వివరాలు చెప్పడం అసాధ్యం, దేశానికి సంబంధించిన రహస్యం అని చెప్పింది. ఇదే రాబర్ట్ వాద్రా మీద అవినీతి ఆరోపణలు ఉంటే సీబీఐ ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి కనుక కేసులోంచి తీసేశాం అంది. మరి జగన్‌మోహన్‌రెడ్డి.. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాజకీయాల్లోనూ లేడు. అప్పుడు ఆయన ప్రైవేటు వ్యక్తి కాదా? అప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఒక్క మంత్రికి గాని, అధికారికిగాని ఫోన్‌చేసి ‘నాకు ఈ పని చేయండీ’ అని అడిగింది లేదు. మరి అలాంటప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు జైలులో ఉంచిందో సీబీఐ సమాధానం చెప్పాలి.

మత్స్యకారుల సంక్షేమానికి వైఎస్ కృషి..

మత్స్యకారులకు చంద్రబాబు 50 వేల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని రూ.లక్ష చేశారు. మత్స్యకారుల బోట్ల కోసం 25 వేల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చేవారు. ఆ మత్స్యకారుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని మాటిస్తున్నా. వేటకు వెళ్లే మత్స్యకారులు గల్లంతయితే ఇచ్చే పరిహారం వైఎస్సార్ సీపీ రూ.లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచుతుంది. అది కూడా ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేకుండా నెలరోజుల్లోనే అందిస్తుంది.’’
11.3 కిలోమీటర్ల మేర నడక: ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 178వ రోజు గురువారం ఉదయం 9.15 గంటలకు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల పరిధిలోని అచ్యుతాపురత్రయం నుంచి ప్రారంభమైంది. రామేశ్వరం, కొవ్వాడ, గంగనాపల్లి, ఇంద్రపాలెం వంతెన, కాకినాడ అంబేద్కర్ సెంటర్, పాత బస్టాండ్, మెయిన్‌రోడ్డు, జగన్నాథపురం వంతెనల మీదుగా భావన్నారాయణసెంటర్ వరకు సాగింది. అక్కడ పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. అనంతరం కాకినాడ వన్‌టౌన్ స్టేషన్ మీదుగా వెంకటేశ్వర ఫంక్షన్ హాలు వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.10 గంటలకు చేరుకున్నారు. షర్మిల రాకతో కాకినాడ నగరం జన సునామీ ముంచెత్తిందా అన్నట్టు కిక్కిరిసిపోయింది. పాదయాత్రలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, గంపల వెంకటరమణ, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, ఆళ్ల నాని, చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, పార్టీ మహిళా కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు, నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: