మద్యం ఏరులై పారక ఇక ఏమవుతుంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మద్యం ఏరులై పారక ఇక ఏమవుతుంది?

మద్యం ఏరులై పారక ఇక ఏమవుతుంది?

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

మద్యంపై క్లాసులు: షర్మిల
ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం తెస్తే..బాబు దాన్ని ఎత్తేశారు
మొన్నేమో టీడీపీ అధికారంలోకొస్తే సరసమైన ధరలకే 
మద్యాన్ని అందిస్తానన్నారు
ఇప్పుడు ఆయనే తనకు అధికారమిస్తే.. ‘బెల్టు’ నిషేధిస్తానంటున్నారు
ఇటు సీఎం కిరణ్.. మద్యం అమ్మకాలకు టార్గెట్లు పెడుతున్నారు
గాంధీజీ ఆదర్శమని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర 
అధ్యక్షుడిగా మద్యం మాఫియా డాన్
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 175, కిలోమీటర్లు: 2,319.5

అధికారంలో ఉన్నన్ని రోజులూ ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడేమో అది చేస్తా..ఇది చేస్తా అంటున్నారు. ఒక సామెత ఉంది. దున్నపోతా దున్నపోతా ఎందుకు దున్నలేదంటే... పగలు ఎండ, రాత్రి చీకటి అందట. దున్నపోతు పగలైనా పనిచేయదు, రాత్రైనా పనిచేయదట. చంద్రబాబు అధికారంలో ఉన్నా పనిచేయరు.. అధికారం ఇచ్చినా చేయరు.
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తన రెండో సంతకం.. బెల్టుషాపుల నిషేధం ఫైలుపైనే చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని చేరుస్తారట. అసలు బెల్టుషాపు అంటేనే చట్టవ్యతిరేకంగా నడుపుతున్న మద్యం దుకాణం అని అర్థం. అటువంటి వాటిని తొలగించడానికి చంద్రబాబు మళ్లీ ఇంకో చట్టం తెస్తారట. 

ఇది ఎలా ఉందంటే దొంగతనం చేయడం నేరమని చట్టం చెబుతుంది. అయినా దొంగతనం నిషేధానికి మళ్లీ చట్టం తెస్తానని చెప్తున్నట్టు ఉంది చంద్రబాబు వైఖరి. ఈయనకు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఆయన మన ఖర్మకొద్దీ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. నిజానికి ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తివేసింది ఈ చంద్రబాబు కాదా? బెల్టు షాపు పుట్టింది ఈ చంద్రబాబు హయాంలో కాదా? నారా వారి పాలన సారా వారి పాలనగా సాగిన మాట వాస్తవం కాదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. పైగా చంద్రబాబు గాంధీలా పోజులు పెడుతూ.. మద్యంపై క్లాసులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట, అనపర్తి, రామచంద్రపురం నియోజకవర్గాల్లో సాగింది. రామచంద్రపురం రామకృష్ణా సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రజలంతా మద్యంలో మునిగి తేలాలనేది బాబు ఉద్దేశం

‘‘చంద్రబాబు ఇటీవల ఓ మాట అన్నారు. అదేంటంటే.. మన రాష్ట్రంలో మద్యం ధరలు చాలా ఎక్కువైపోయాయట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. సరసమైన ధరలకే మద్యాన్ని అందిస్తారట. మన రాష్ట్ర ప్రజలంతా మద్యంలో మునిగి తేలాలని ఆయన ఉద్దేశం. మన ఖర్మకొద్దీ ఈయన మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. పైగా ఈయన మహాత్మా గాంధీలా పోజులిచ్చి మద్యంపై క్లాసులిస్తున్నారు. ఈయనకుతోడు అంతే పనికిరాని పాలకపక్షం కూడా ఉంది. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడానికి టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు చేయిస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి నెలా 15 శాతం ఎక్కువ మద్యం అమ్మాలని ఆదేశాలిచ్చింది. నాలుగు సంవత్సరాల్లోనే మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంది ఈ ప్రభుత్వం. ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేసైనా సరే ఖజానాను నింపుకోవాలనుకుంటోంది. మహాత్మా గాంధీని ఆదర్శంగా చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ఒక మద్యం మాఫియా డాన్‌ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టుకుంది అంటే మన రాష్ట్రంలో మద్యం ఏరులై పారక ఇక ఏమవుతుంది?

నియోజకవర్గానికి ఒకే మద్యంషాపు: మద్యం నేరాలను ఎలా ప్రోత్సహిస్తోందో రెండేళ్ల క్రితమే జగనన్న ఆలోచించారు గనుకనే మద్యం గురించి కొన్ని స్పష్టమైన హామీలిచ్చారు. నియోజకవర్గానికి ఒకే ఒక మద్యంషాపు ఉంటుందని, బెల్టుషాపులను నిషేధిస్తానని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో వెయ్యి మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ 10 మంది మహిళా పోలీసులను పెట్టి మహిళలకు భరోసాను కల్పిస్తానని కూడా చెప్పారు. ఈ హామీలన్నీ కేవలం ఒక ఏడాది లోపలే తప్పకుండా నెరవేరతాయి. మద్యం నుంచి వచ్చే ఆదాయం కంటే జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యం.

కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం 

రామచంద్రపురం నియోజకవర్గానికి నేను రావడం ఇది రెండోసారి. తొలిసారి ఉప ఎన్నికల సందర్భంగా అమ్మ విజయమ్మతో కలిసి వచ్చాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఆశీర్వదించాలని కోరాం. రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతో, జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉన్న అభిమానంతో మీరు బోస్‌ను ఆశీర్వదించారు. అందుకనే 2009లో ఆయనకు 53 వేల ఓట్లు వస్తే, ఉప ఎన్నికల్లో 63 వేల ఓట్లు వచ్చాయి. అయినా వైఎస్సార్ సీపీ విజయం సాధించలేకపోయింది. దానికి కారణం కాంగ్రెస్, టీడీపీలు చేసిన కుమ్మక్కు రాజకీయమే. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి వెఎస్సార్ సీపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. అందుకే ఇక్కడ టీడీపీకి కేవలం ఆరు వేల ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 77 వేల ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు అన్నీ కాంగ్రెస్‌కు పడ్డాయని స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీకి అన్ని తక్కువ ఓట్లు రావడానికి కారణాలు రెండే అయి ఉండాలి. ఒకటి చంద్రబాబుకు విశ్వసనీయత తగ్గిపోయి ఉండాలి. లేదంటే చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏది నిజమో చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి.’’

14.4 కిలోమీటర్లమేర నడక

పాదయాత్ర 175వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట శివారు కేవీ రోడ్డు నుంచి ప్రారంభమైంది. మారేడుబాక, పులుగుర్త, మాచవరం, పలసపూడి-రామచంద్రపురం బైపాస్ జంక్షన్, రామచంద్రపురం పట్టణ వీధుల మీదుగా నడచుకుంటూ షర్మిల రామకృష్ణ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్థానిక సూర్య కాంప్లెక్స్ వ ద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. సోమవారం 14.4 కిలోమీటర్లు నడిచారు. యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ చిట్టబ్బాయి, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, గంపల వెంకటరమణ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, ప్రసాదరాజు, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి, మాజీ ఎంపీ మహేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణ, పార్టీ మహిళావిభాగం రాష్ర్ట కన్వీనర్ నిర్మల కుమారి, స్థానిక నాయకులు చలమలశెట్టి సునీల్, పాలచర్ల శ్రీనివాస్, రెడ్డి ప్రసాద్, సత్తి సూర్యనారాయణ రెడ్డి, రెడ్డి రాధాకృష్ణ, గుత్తుల సాయి, విప్పర్తి వేణు గోపాల్, దాడిశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: