ఏప్రిల్ తొలి వారంలోనే అనర్హులైనట్లు ..... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏప్రిల్ తొలి వారంలోనే అనర్హులైనట్లు .....

ఏప్రిల్ తొలి వారంలోనే అనర్హులైనట్లు .....

Written By news on Thursday, June 13, 2013 | 6/13/2013

- రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ స్ఫూర్తితో ఏప్రిల్ తొలి వారంలోనే అనర్హులైనట్లు భావించాలి
- అదే ప్రతిని రాష్ట్ర అదనపు సీఈఓకు ఇచ్చిన అనర్హత ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

అనర్హతతో ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్థానాలకు వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు లేఖ రాశారు. అనర్హులైన ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్, ఎం.రాజేశ్, వనిత, గొట్టిపాటి రవి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సుజయకృష్ణరంగారావు, సాయిరాజు, బాలనాగిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాసు, శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, సుచరిత, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అమరనాథరెడ్డి, గురునాథ రెడ్డి, కె. శ్రీనివాసులు, బాలరాజు ఆ లేఖ ప్రతిని బుధవారం సచివాలయంలో రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వి. వెంకటేశ్వరరావుకు అందజేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మార్చి 15వ తేదీన ఓటు వేసిన 15 మంది ఎమ్మెల్యేలను ఈ నెల 8వ తేదీన స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

విజయమ్మ లేఖలోని ముఖ్యాంశాలివీ... కాంగ్రెస్, టీడీపీలు జారీ చేసిన విప్‌లను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన తరువాత 15 రోజుల్లో అనర్హులుగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఉప ఎన్నికలు ఇష్టంలేని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని విచారణ పేరుతో కాలయాపన చేయించాయి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్-151 (ఎ) ప్రకారం ఏడాదిలోగా సాధారణ ఎన్నికలుంటే ఉప ఎన్నికలు రావని ఉండటంతో జూన్ తొలి వారం వరకు అనర్హులుగా ప్రకటించకుండా కాలయాపన చేశారు. 

ఇదే విషయం పత్రికలు కూడా ప్రచురించాయి. ఉప ఎన్నికలు ఎదుర్కొనే శక్తి లేక ఓడిపోతామనే భయంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను కూడా దుర్వినియోగం చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ స్ఫూర్తితో 15 మంది ఎమ్మెల్యేలు ఏప్రిల్ తొలి వారంలోనే అనర్హులైనట్లుగా భావించాలి. పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్‌కు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ కర్ణాటక స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2011 మే 13న సుప్రీం కోర్టు తప్పుపడుతూ రద్దు చేసింది. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావులు 2012 మే నెలలోనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలను ఫార్మాట్‌లోనే సమర్పించినప్పటికీ ఆమోదించకుండా, స్పీకర్ ఏడాది తరువాత ఇప్పుడు అనర్హులుగా ప్రకటించారని ఆ లేఖలో వివరించారు.

ఉప ఎన్నికలపై కిరణ్, బొత్స, బాబుకు సవాల్: దమ్ముంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుకు అనర్హులైన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని సవాల్ విసిరారు. విజయమ్మ ఈసీకి రాసిన లేఖను అదనపు సీఈఓకు అందజేసిన వారు విలేకరులతో మాట్లాడారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసినప్పుడు వివరణకు 15 రోజులు సరిపోతుందని, అందుకు విరుద్ధంగా జరిగినందున ఈసీ జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు రామచంద్రారెడ్డి చెప్పారు. 

ఈ విషయంలో బాబు, కిరణ్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా విప్ ధిక్కరించినప్పటికీ, వారు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించినందువల్ల అనర్హులుగా ప్రకటించలేదని ఆక్షేపించారు. అనర్హత స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తే 15 అసెంబ్లీ స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. వెంటనే అనర్హత ఓటు వేసి ఉప ఎన్నికలకు మార్గం సుగమం చేయమని విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలు కోరినప్పటికీ స్పీకర్ మూడు నెలలు పాటు కాలయాపన చేశారని కొడాలి నాని ఆక్షేపించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకుండా వ్యవహరిస్తున్న ఆ రెండు పార్టీలకు 2014 ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెపుతారన్నారు.
Share this article :

0 comments: