కిరణ్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి

కిరణ్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

* పేదల ఆర్తనాదాలు ఆయన చెవికెక్కడంలేదు
* చంద్రబాబుది మనసా? రాతిబండా?
* తెరచాటున టీడీపీని కాంగ్రెస్‌కు అమ్మేశారు
* {పజల కష్టాలను బాబు కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప అవిశ్వాసం పెట్టనంటున్నారు
* కిరణ్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి
* పేదలంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదు
* వైఎస్ పథకాలన్నింటికీ తూట్లు పొడిచారు
* కాంగ్రెస్, టీడీపీలను కట్టగట్టి బంగాళాఖాతంలో పడేసే రోజు దగ్గరలోనే ఉంది 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కాదని, ప్రతి నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. చంద్రబాబును ఈ రాష్ట్రానికి పట్టిన విలన్‌గా అభివర్ణించారు. ప్రజల కష్టాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిస్సిగ్గుగా గొడుగుపడుతున్నారంటూ ఎండగట్టారు. సినీ నటుడు చిరంజీవి పార్టీని నేరుగా కాంగ్రెస్‌లో కలిపేస్తే.. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తెరచాటున కాంగ్రెస్‌కు అమ్మేశారని విమర్శించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో అంటకాగుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 89వ రోజు బుధవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట, తాడికొండ నియోజకవర్గాల్లో సాగింది. ఫిరంగిపురం మండల కేంద్రంలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రసంగ పూర్తి పాఠం ఆమె మాటల్లోనే..

అయినా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరట..
‘‘కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. ఈ ప్రభుత్వం మాకొద్దంటూ ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అయినా చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు. అవినీతి ఆరోపణల్లో అరెస్ట్ భయంతో కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు చేసుకుని ఆయన ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారారు. రాష్ట్ర ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడుతుంటే రెప్పవాల్చకుండా కళ్లప్పగించి చూస్తున్నారు. వారి ఆర్తనాదాలు చంద్రబాబుకు వినిపించడం లేదు. చంద్రబాబుది మనసా? రాతి బండా? ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న వ్యక్తిని నాయకుడని ఎందుకనాలి? ఆయన అవిశ్వాసం పెట్టరట. వైఎస్సార్ సీపీగానీ, టీఆర్‌ఎస్‌గానీ తీర్మానం పెడితే మద్దతివ్వరట. నిస్సిగ్గుగా బాహాటంగా కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన్ను అందుకు పనికిరారని ప్రజలు నిర్ధారించారు. కానీ ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పనికిరారని స్వయంగా నిరూపించుకుంటున్నారు.

వైఎస్ పథకాలన్నింటికీ తూట్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ పథకాలన్నింటికీ తూట్లు పొడిచింది. ఈ ప్రభుత్వ పాలనలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అటకెక్కింది. కుయ్..కుయ్ అనే 108 మూగబోయింది. అభయహస్తం అంతర్థానమైంది. గ్రామాలలో చీకట్లు అలుముకున్నాయి. వడ్డీల మీద వడ్డీలు మహిళలు, రైతుల నడ్డివిరుస్తున్నాయి. ధరలు ఆకాశాన్నంటాయి. కొత్త పన్నులు, చార్జీలు సామాన్యుడికి మోయలేని భారంగా మారాయి. కరెంటు సర్‌చార్జీ రూపేణా రూ.32 వేల కోట్లను ప్రభుత్వం సామాన్యుడి నుంచి వసూలు చేస్తోంది. కానీ వైఎస్ ఐదేళ్ల పాలనలో కరెంటు, ఆర్టీసీ, గ్యాస్ ధరలు పెంచలేదు. ప్రజలపై ఎలాంటి పన్నుల భారమూ మోపలేదు.

పైగా లెక్కకుమిక్కిలి సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టారు. వైఎస్ ఉండుంటే రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా అయ్యేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం మూడు గంటలు కూడా కరెంటివ్వడంలేదు. ఆ ఇచ్చేది కూడా ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు రోజంతా పొలంలోనే గడుపుతున్నారు. గ్రామాల్లో నాలుగ్గంటలు కూడా విద్యుత్ లేదు. మబ్బులోనే తింటున్నారు. మబ్బులోనే ఉంటున్నారు. పరీక్షల సమయంలో పిల్లలు చదువుకోవాలంటే కరెంటు ఉండడం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కివెళ్లిపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత మూడున్నరేళ్లలోరాష్ట్రం అతలాకుతలమైపోయింది. ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా దొరకని దుస్థితి. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోయాయి. నిత్యావసరాలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నంత కరెంటు సంక్షోభాన్ని గతంలో ఎన్నడూ చవిచూడ లేదు. దీనికి కారణం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం.

కాంగ్రెస్, టీడీపీలు మట్టికొట్టుకుపోయే రోజులొస్తాయి..
ప్రజలను ఇంతగా వేధిస్తున్న కాంగ్రెస్, టీడీపీలు మట్టికొట్టుకుపోయే రోజు త్వరలోనే వస్తుంది. ఇది తథ్యం. ఈ రెండు పార్టీల దుకాణాలనూ మూసి కట్టగట్టి బంగాళాఖాతంలో ప్రజలు పడేసే రోజొస్తుంది. కుట్రలతో జగనన్నను జైల్లో పెట్టారు. కుట్రలను ఛేదించుకుని జగనన్న త్వరలోనే బయటకొస్తాడు. మీ అందరి ఆదరాభిమానాలతో రాజన్న రాజ్యం తిరిగి స్థాపిస్తాడు. రాష్ట్రం సుభిక్షంగా పరిఢవిల్లే స్వర్ణయుగాన్ని తెస్తారు. అప్పటి వరకూ ప్రజలంతా అండగా ఉండండి.’’

13.5 కిలోమీటర్ల పాదయాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 89వ రోజు బుధవారం షర్మిల 13.5 కిలోమీటర్లు నడిచారు. చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం కొండవీడులో యాత్ర ప్రారంభమై తాడికొండ మండలం హౌస్ గణేష్‌పేట, ఫిరంగిపురం, వేములూరిపాడు మీదుగా సాగింది. వేములూరుపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. పాదయాత్రలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, మర్రి రాజశేఖర్, డాక్టర్ హరికృష్ణ, జంగా కృష్ణమూర్తి, కొమ్మారెడ్డి ప్రవీణ్‌రెడ్డి, గౌతంరెడ్డి, స్థానిక నేతలు దేవళ్ల రేవతి, కొల్లిపాటి రాజేంద్రప్రసాద్, ఈపూరి అనూప్, రావి వెంకట రమణ, కావటి మనోహర్ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి, బండారు సాయిబాబు మాదిగ, మేరాజోతు హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: