రాష్ట్రంలో 40 శాతం రూట్లు ప్రైవేటు పరం చేసేందుకు ప్రతిపాదనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో 40 శాతం రూట్లు ప్రైవేటు పరం చేసేందుకు ప్రతిపాదనలు

రాష్ట్రంలో 40 శాతం రూట్లు ప్రైవేటు పరం చేసేందుకు ప్రతిపాదనలు

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012


* చంద్రబాబు ‘ప్రైవేట్’ ప్రతిపాదనలను పక్కన పెట్టిన దివంగత నేత వైఎస్ 
* ఇప్పుడు ఆ ప్రతిపాదనలనే బయటకు తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
* కొత్త రూట్లు, కాంట్రాక్టు క్యారేజీలకూ ఇదే అదనుగా నిర్ణయాలు
* బడా ఆపరేటర్ల కోసమేనన్న విమర్శలు.. కార్మిక సంఘాల ఆగ్రహం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ)ని ప్రైవేటు బాట పట్టించేందుకు సర్కారు సిద్ధమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి హయాం నాటి ప్రతిపాదనలను ప్రస్తుత సర్కారు బయటకు తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం రూట్లను ప్రైవేట్‌పరం చేసేందుకు అంతర్గతంగా కసరత్తు సాగుతోంది. దశల వారీగా రూట్లను ప్రైవేటుపరం చేయాలనే ఎత్తుగడతోనే ఇది సాగుతోంది. ప్రస్తుతం 8,000 రూట్లలో నడుస్తున్న పల్లె వెలుగు సర్వీసులను దశల వారీగా రద్దు చేసి వాటిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనే అంశంపై అధికారుల స్థాయిలో నిర్ణయం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫలితంగా ఆర్‌టీసీ పల్లెవెలుగు బస్సులను వెంటనే రద్దు చేయటానికి వీలు కలుగుతుంది. 

ప్రాథమికంగా గ్రామీణ రూట్లను ప్రైవేటు పరం చేసి ఆ తరువాతే ప్రధాన రూట్లనూ ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అధికారుల స్థాయిలో దీనికి సంబంధించి ప్రతిపాదనలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ‘ప్రైవేటు’ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ఆయన ఉదయం అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఆర్‌టీసీని దశల వారీగా ప్రైవేటీకరించాలని ఆలోచిస్తున్నామని, పల్లె ప్రాంతాల్లోని కొత్త రూట్లను ప్రైవేటీకరించాలని భావిస్తున్నామని, పల్లెవెలుగు బస్సులనూ ప్రైవేటీకరించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు. 

దీనిపై ఆర్‌టీసీ కార్మిక సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తం కావటంతో సాయంత్రానికి అలాంటిదేమీ లేదంటూ మాట మార్చారు. 2004కు పూర్వం నాటి సీఎం చంద్రబాబు ఆర్‌టీసీని ముక్కలు చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే యోచన చేశారు. దానికి తగ్గట్టుగానే అప్పట్లో ప్రపంచ బ్యాంక్‌కు హామీ ఇచ్చారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆర్‌టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. సంస్థను లాభాల బాటలోకి తెచ్చేందుకు అనేక మార్పులు తీసుకువచ్చారు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించారు. 

ఆర్థిక సంక్షోభం సాకు చూపి... 
ఆర్‌టీసీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న సాకు చూపి రూట్లను ప్రైవేటు పరం చేయాలనేది ప్రభుత్వం ఎత్తుగడగా కనిపిస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ ప్రైవేటు మాట వినిపిస్తోందని, నాటి చంద్రబాబు విధానాలను అమలు చేసేందుకు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. సంస్థను ఒడ్డున పడేసే చర్యలు మానేసి.. దానిని వదిలించుకుని బడా ఆపరేటర్లకు ధారాదత్తం చేయాలనే ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో మారుమూల మార్గాలను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ సూచనను దీనికి అనువుగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలోని పాత రూట్లకు తోడు 5,000 కొత్త రూట్లను సైతం ప్రైవేటీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టు క్యారేజీలుగా అక్రమంగా తిరుగుతున్న 1,100 బస్సులకూ పర్మిట్లు జారీ చేసి చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది. ఇప్పటికే టూరిస్టు బస్సుల నిర్వహణలో తలపండిన అధికార పార్టీ నేతలు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇతర రాష్ట్రాల్లో విఫల ప్రయోగం... 
ఐదేళ్ల కిందట రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలను ప్రైవేటు పరం చేసిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్ రాష్ట్రాలకు ఇప్పుడు కొత్త చిక్కులొచ్చాయి. ఈ ప్రయోగం ఆయా రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలకు తావిచ్చింది. కేవలం ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు తిప్పుతూ మారుమూల ప్రాంతాలను పూర్తిగా విస్మరించటంతో గ్రామీణులు నానా అవస్థలు పడుతున్నారు. మారుమూల పల్లెలకు రవాణా వసతులు కరువయ్యాయి. లాభనష్టాలతో సంబంధం లేకుండా బస్సులను తిప్పాల్సిన ప్రభుత్వాలు.. వాటిని పట్టించుకోకుండా ప్రైవేటు పరం చేయటం మంచిది కాదని అఖిల భారత రోడ్డు రవాణా సంస్థల సమాఖ్య (ఏఎస్‌ఆర్‌టీయూ) అభిప్రాయపడింది. ఈ క్రమంలో తక్షణమే పూర్వవిధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని సూచిస్తూ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు లేఖలు రాసింది. 

ప్రభుత్వంపై పోరాడుతాం: ఎన్‌ఎంయూ 
‘‘ప్రభుత్వ, యాజమాన్య లోపభూయిష్టమైన విధానాల వల్లే ఆర్‌టీసీ నష్టాలు చవిచూస్తోంది. ఎలుకలు పడ్డాయని ఇల్లు తగలబెట్టుకున్న చందాన.. నష్టాల పేరుతో ఆర్‌టీసీని ప్రైవేటీకరించాలనే ఆలోచన దుర్మార్గమైంది. జోన్ల వారీగా విడగొడితే కార్మిక ద్రోహంగా పరిగణించి ప్రభుత్వంపై పోరాడుతాం’’. 

ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: ఈయూ 
‘‘కార్మిక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆర్‌టీసీ ప్రైవేటీకరణకు యత్నించడం గర్హనీయం. సంస్థ పరిరక్షణకు కార్మికులు పోరాటాలు సాగించయినా ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ప్రజారవాణాను ప్రైవేటీకరించాలనుకోవటం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం’’. 

కండక్టర్లెందుకు దండగ! 
నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు సిబ్బందికి కత్తెర పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్గత సామర్థ్యం పెంచుకోవటంలో చతికిలపడ్డ ఆర్‌టీసీ యాజమాన్యం కార్మికులను తగ్గించుకోవటం ద్వారా జీతభత్యాల వ్యయాలను మిగిల్చుకోవాలని భావిస్తోంది. తద్వారా నష్టాలను కొంత మేర కుదించుకోవచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కండక్టర్లపై దృష్టి సారించింది. కండక్టర్ లెస్ సర్వీసులను ఎక్కువ శాతం నిర్వహించటం ద్వారా వ్యయాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 332 బస్సులు కండక్టర్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. 

దూర ప్రాంతాల మధ్య నడిచే ఈ బస్సుల్లో డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ జారీ యంత్రాలు (టిమ్స్)ను విరివిగా ఉపయోగించటం ద్వారా కండక్టర్లకు కోత పెట్టాలని భావిస్తోది. దీంతో నెలకు బస్సుకు సగటున రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు వ్యయం తగ్గించుకోవచ్చని అనుకుంటోంది. సంస్థ పరిధిలో 46,000 మంది కండక్టర్లు, 42,000 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. దీంట్లో కండక్టర్ల సంఖ్యను సగానికి కుదించుకున్నా.. సంస్థకు ఆర్థికంగా కలిసివస్తుందని అంచనా వేస్తోంది.
Share this article :

0 comments: