అధికార పార్టీని బెంబేలెత్తిస్తున్న ఉప ఎన్నికల ప్రమాదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » అధికార పార్టీని బెంబేలెత్తిస్తున్న ఉప ఎన్నికల ప్రమాదం

అధికార పార్టీని బెంబేలెత్తిస్తున్న ఉప ఎన్నికల ప్రమాదం

Written By ysrcongress on Sunday, March 4, 2012 | 3/04/2012

* ఇన్నాళ్లుగా ‘వేటు’ ఆపినా.. ముంచుకొస్తున్న ఉపద్రవం 
* అధికార పార్టీని బెంబేలెత్తిస్తున్న ఉప ఎన్నికల ప్రమాదం 
* పార్టీ, ప్రైవేటు సర్వేల ఫలితాలతో నేతల వెన్నులో వణుకు 
* ఇక కాంగ్రెస్ కొంప మునగటం ఖాయమన్న ఆందోళన 
* అసలే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత 
* ఇప్పుడు ఉప ఎన్నికలతో కాంగ్రెస్‌కు చావుదెబ్బ ఖాయం 
* బాహాటంగానే అంగీకరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు 
* ఎప్పుడు ఎన్నికలు జరిగినా గట్టి దెబ్బేనన్న కోస్తా ఎంపీ సర్వే నివేదిక! 
* ఇంటెలిజెన్స్ నివేదికలు, సీఎం సొంత సర్వేల్లోనూ అవే ఫలితాలు 
* ఉప ఎన్నికల్లో ప్రచారానికీ వెనుకాడుతున్న కాంగ్రెస్ నేతలు 
* ప్రచారంపై చిరంజీవి విముఖత.. సీనియర్లూ దూరం దూరం

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. విప్ ఉల్లంఘించిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయాన్ని ఉప ఎన్నికల భయంతో ఇన్నాళ్లూ అడ్డుకుంటూ వచ్చిన అధికార పార్టీ.. ఇప్పుడా ఉప ఎన్నికల ఉపద్రవం ముంచుకు వస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన ఏడు స్థానాల ఉప ఎన్నికలను ఎలా నెట్టుకురావాలో తెలియక తలలు పట్టుకున్న కాంగ్రెస్ నాయకులు.. మరో 17 అసెంబ్లీ స్థానాలకు కూడా సమీప భవిష్యత్తులో ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావటం కొరివితో తల గోక్కున్నట్లేనని భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవని సొంత సర్వేలు, ప్రైవేటు సంస్థల సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలూ ఘోషిస్తుండటంతో కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకుపుడుతోంది. 

స్వయంకృతాపరాధాలతో పార్టీ, ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న సమయంలో ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ కొంపముంచటం ఖాయమన్న ఆందోళన పార్టీ నేతలను పట్టిపీడిస్తోంది. ఈ ఉప ఎన్నికలను ఎదుర్కొనలేకే.. రైతుల కోసం విప్ ఉల్లంఘించిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హతను ఆలస్యం చేయించినప్పటికీ రాజ్యసభ ఎన్నికలు గండికొట్టటంపై కాంగ్రెస్‌లో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఒక దశలో విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా తమ దారిలోకి తెచ్చుకుని బండి నడిపిద్దామన్న ఆలోచనలు కూడా చేసిన పార్టీ నేతలు కొంతకాలం ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బతీయటానికి తెరవెనుక రకరకాల ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఈ రకంగా నేరుగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు రావటం నేతలకు మింగుడుపడటం లేదు. 

వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలోనా? 
అంతులేని విద్యుత్ కోతలు, ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు, సంక్షేమ పథకాల్లో భారీ కోతలు, విద్యార్థులకు అందని ఫీజులు, 104, 108 పథకాల అమల్లో వైఫల్యాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఉప ఎన్నికలు కాంగ్రెస్‌ను చావు దెబ్బతీస్తాయని పార్టీ నేతలు భయపడుతున్నారు. ఈ సమయంలో ప్రచారాలకూ వెళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ నేతలది. ఇప్పటికే తెలంగాణలోని ఆరు, కోస్తాలోని ఒక స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రచారాలకు వె ళ్తున్న నాయకులకు ప్రజల నుంచి ప్రతికూలత ఎదురవుతోంది. 

కామారెడ్డిలో శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, విప్ అనిల్‌లను విద్యుత్ కోతలపై ప్రజలు నిలదీయటంతో ప్రచారం చేయకుండానే వారు వెనుదిరిగి వచ్చేశారు. ‘ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇప్పటివరకూ అనర్హత నిర్ణయం తీసుకోలేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. వీటికి ప్రభుత్వంపై వ్యతిరేకత తోడవటంతో కాంగ్రెస్ నేతలు ముందుకు అడుగేయలేని స్థితిలో పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మీసాలు మెలేసిన వారిపై చర్యలు ఆలస్యం చేసి మీసాల్లేని పార్టీగా కాంగ్రెస్ మిగిలింది’ అని సీనియర్ నేత జె.సి.దివాకర్‌రెడ్డి వంటి నేతలు బాహాటంగానే పార్టీ పరిస్థితిని బహిరంగపరిచారు. 

ఘోషిస్తున్న సర్వేలు, నివేదికలు 
రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలతో సహా అన్నిటిలోనూ కాంగ్రెస్‌కు పరాజయం తప్పదని ఓఆర్‌జీ, నీల్సన్ వంటి సంస్థలు, పలు టీవీ చానళ్లు నిర్వహించిన సర్వేల నివేదికల్లో తేటతెల్లమైందని గత కొద్ది రోజులుగా మంత్రుల మధ్య చర్చ సాగుతోంది. సర్వేల ప్రకారం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశాలు లేవని రాయలసీమకు చెందిన ఒక సీనియర్ మంత్రి అసెంబ్లీ లాబీల్లో మీడియా ముందే కుండబద్దలు కొట్టారు. కోస్తా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు చేయించిన సర్వేల్లోనూ అవే రకమైన ఫలితాలు కనిపించాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని తేలింది. ఈ వివరాలతో ఆయన పార్టీ అగ్రనేతలకూ ప్రత్యేక నివేదికలను పంపించారు. ఈ సర్వేల్లోనే కాదు సాక్షాత్తూ ప్రభుత్వ అజమాయిషీలోని ఇంటెలిజెన్స్ నివేదికల్లోనూ ఇవే చేదు నిజాలు వెల్లడయ్యాయని మంత్రులు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా చేయించుకుంటున్న సర్వేల్లోనూ ఇవేరకమైన వాస్తవాలు తేలాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భయంతోనే ఇన్నాళ్లూ వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హతను జాప్యం చేయిస్తూ వచ్చారు. పార్టీ పరువుపోతోందంటూ సీనియర్ల నుంచి ఫిర్యాదులు, విమర్శలు రావటం.. రాజ్యసభ ఎన్నికలు ముంచుకు రావటంతో తప్పనిసరై అనర్హతను ప్రకటించారు. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయిందని, ఇదివరకే వేటు పడి ఉప ఎన్నికలు ముగించి ఉంటే లోపాలను సరిదిద్దుకునేందుకు వీలుండేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇపుడు ఎన్ని చేసినా ఫలితాల తర్వాత పార్టీ ప్రమాదంలో పడక తప్పదని సీనియర్లే వ్యాఖ్యానిస్తున్నారు. అనర్హత స్థానాలన్నీ కాంగ్రెస్‌కు సంబంధించినవేనని, ఉప ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లూ రాని పరిస్థితుల్లో ఫలితాల తరువాత కాంగ్రెస్ ఉనికికే ప్రమాదముందని మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి వంటి మంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగే ఏడు స్థానాల్లో ఒక్కటీ కాంగ్రెస్‌కు వచ్చే పరిస్థితి లేదని, ఆ ప్రభావం తదుపరి ఉప ఎన్నికలపైనా తీవ్రంగా పడుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలతోనే కాంగ్రెస్ పరిస్థితేమిటో బయటపడనుందని మాజీ మంత్రి శంకర్రావు గత రెండు రోజులుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా దయనీయంగానే ఉందని కాంగ్రెస్ నేతలు విశ్లేషించటమే కాకుండా.. టీడీపీలోని సీనియర్లు సైతం అంగీకరిస్తున్నారు. ఆ పార్టీ కూడా ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో పరిస్థితులపై సర్వే చేయించుకుంది. 

ఎన్నికల్లో కరిష్మా చూపే నాయకుడేడీ? 
ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని విజయ పథాన ముందుకు తీసుకుపోగలిగే కరిష్మా ఉన్న నాయకులూ కనిపించటం లేదు. అచ్చంగా దానికోసమే విలీనం చేసుకున్న ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఇష్టపడటం లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నాయని, ప్రచార బాధ్యతలు తీసుకుంటే ఆ అపప్రథ మొత్తం తనమీద పడుతుందని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణపై యూ-టర్న్ తీసుకున్న చిరంజీవి తెలంగాణలో అడుగుపెట్టేందుకూ జంకుతున్నారు. అయితే ఏరికోరి తెచ్చుకున్న చిరంజీవిని ఎన్నికల్లో ప్రచారానికి తిప్పకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. అందుకే ఆయన్ను ఏదోలా ఒప్పించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

సీఎం, పీసీసీ అధ్యక్షుడి ప్రచార తేదీలు ఖరారైనా చిరంజీవి ప్రచార తేదీలు నిర్ణయం కాకపోవటానికి కారణమిదేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదో మొక్కుబడిగా కోవూరులో ప్రచారాన్ని ముగించి చేతులు దులుపుకొనే యోచనలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం. ప్రచారాల విషయంలో కాంగ్రెస్ నేతలూ దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు ఈ ఉప ఎన్నికలు తమ కొంపముంచేలా ఉన్నాయన్న ఆందోళనతో ఉన్నారు. ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయని, అదే సాకుచూపి తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నారు. అందుకే ఈ ఎన్నికల ప్రచారం, గెలుపు బాధ్యతలు తమ ఒక్కరిదే కాదని, సీఎం, పీసీసీ అధ్యక్షులకూ వర్తిస్తుందని ముందే మెలిక పెడుతున్నారు. 

ఇక పార్టీ ఎమ్మెల్యేలు పదవుల విషయంలో అసంతృప్తికి గురై ఎన్నికలకు దూరంగా ఉండాలన్న అభిప్రాయానికి వచ్చారు. పదవులను చిరంజీవికి, ఆయన వర్గానికే పరిమితం చేసినందున ఎన్నికల బాధ్యతలూ వారికే అప్పగించాలని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుత తమ నియోజకవర్గాల్లో పార్టీకి గడ్డు పరిస్థితులు ఉండటంతో మంత్రులతో సహా ఎమ్మెల్యేలు సురక్షితమైన ఇతర నియోజకవర్గాల వేటలో పడ్డారు. 

మంత్రి ముఖేష్‌గౌడ్ తన నియోజకవర్గాన్ని వదిలి పార్లమెటుకు పోటీ చే స్తామంటున్నారు. విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తదితరులూ అదే బాటపట్టారు. తామే కష్టాల్లో ఉన్న తరుణంలో ఉప ఎన్నికల బాధ్యతలు తాము వహించేది లేదని దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ స్థానంపై ఆశలు పెట్టుకున్న నేతలు పార్టీ వాటిని డబ్బున్న ప్రముఖులకు, లాబీయింగ్ చేసే వారికి కట్టబెట్టే పరిస్థితుల్లో ఉండటంతో ముందే నిరాశలో పడుతున్నారు. పదవుల కోసం తమ పేర్లను సైతం పరిశీలనకు తీసుకోనప్పుడు ఉప ఎన్నికల్లో తామెందుకు పనిచేయాలంటూ దూరంగా జరుగుతున్నారు.
Share this article :

0 comments: