ఇక ప్రజల్లోనే ఉండండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక ప్రజల్లోనే ఉండండి

ఇక ప్రజల్లోనే ఉండండి

Written By ysrcongress on Sunday, March 4, 2012 | 3/04/2012

మాజీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లోప్రజల ఘనస్వాగతం 
సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకునాయకులు సన్నద్ధం 
హైదరాబాద్‌లో జగన్‌ను కలిసిన బాలినేని, మేకతోటి, పిన్నెల్లి తదితరులు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇచ్చిన మాట ప్రకారం రైతులు, రైతు కూలీల పక్షాన నిలబడి, విప్‌ను ధిక్కరించి అనర్హులైన 17 మంది వైఎస్సార్ అభిమాన మాజీ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సంక్షేమం పట్ల సర్కారు నిర్లక్ష్య ధోరణిని ప్రజల్లో ఎండగట్టటానికి సంసిద్ధమవుతున్నారు. శాసనసభ స్పీకర్ మనోహర్ శుక్రవారం రాత్రి అనర్హత నిర్ణయం ప్రకటించే సమయానికి వీరిలో చాలా మంది హైదరాబాద్‌లో లేరు. తమ సొంత నియోజకవర్గాలకు బయలుదేరిన ఎమ్మెల్యేలకు మార్గమధ్యంలో ఉండగా అనర్హత సమాచారం అందింది. పలువురు మాజీ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాలకు చేరుకోగానే వారికి వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. 

నియోజకవర్గాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేల్లో పలువురు దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి ప్రజలను కలవటం మొదలు పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనను ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో.. నగరంలో అందుబాటులో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, చెన్నకేశవరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్‌తో సమావేశమయ్యారు. 

ప్రజల్లోనే ఉండాలి...

‘ఇకపై మీరు జనంలోనే ఉండాలి.. ఉప ఎన్నికలు ఎపుడు జరుగుతాయని ఆలోచించాల్సిన పని లేదు.. ఎపుడు జరిగినా మనం ప్రజల్లోనే ఉంటాం కనుక భయపడాల్సిన పనిలేదు. ప్రజాభిప్రాయం మనకు అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న ప్రజలను ఓట్ల రూపంలో మలచుకోవటంలోనే మనం నిమగ్నమై ఉండాలి. అవసరమైతే తప్ప హైదరాబాద్‌కు కూడా రావాల్సిన పనే లేదు. నన్ను కూడా మీరు కలవాల్సిన పనిలేదు. నేనే మీ నియోజకవర్గాలకు వచ్చి మిమ్మల్ని కలుస్తా. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి..’ అని తనను కలిసిన ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. జూలైలో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నందున ఇప్పటికే అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం అంతకు ముందే (నోటిఫికేషన్‌కు 60 రోజుల ముందుగా) ఉప ఎన్నికలు జరగాలి. ఎన్నికల కమిషన్ కచ్చితంగా సంప్రదాయాలను పాటిస్తే కనుక ఎన్నికలు మే నెలలో జరిగే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే దేశంలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నట్లుగా ఢిల్లీ నుంచి వెలువడుతున్న వార్తలు ఉదహరిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అప్పటి వరకూ నియోజకవర్గాల్లో విసృ్తత పర్యటనలు చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. 

23 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో ఒకేసారి 24 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఎదుర్కోవటానికి జంకి.. 17 చోట్ల విడిగా నిర్వహించే విధంగా ఎత్తుగడ వేసి ఆలస్యంగా అనర్హత వేటు వేయించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమర్పించిన రాజీనామా ఫలితంగా నెల్లూరు లోక్‌సభ స్థానం ఖాళీ అయినందున మొత్తం 22 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉప ఎన్నికలను ఎదుర్కోక తప్పని పరిస్థితి కిరణ్ సర్కారుకు ఏర్పడింది. 

అనర్హత నిర్ణయంతో ఖాళీ అయిన పరకాల, నరసన్నపేట, పాయకరావుపేట, నర్సాపురం, పోలవరం, రామచంద్రాపురం, మాచర్ల, ప్రత్తిపాడు, ఒంగోలు, ఉదయగిరి, అనంతపురం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, కోడూరు, రాయచోటి, రాయదుర్గంతో పాటుగా.. నెల్లూరు లోక్‌సభా స్థానం పరిధిలోని నెల్లూరు (సిటీ), నెల్లూరు (రూరల్), కావలి, కోవూరు, ఆత్మకూరు, కందుకూరు (ప్రకాశం జిల్లా) ఆరు అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ తన బలం ఏమిటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ లోక్‌సభా స్థానం పరిధిలోని ఉదయగిరి అనర్హతకు గురైన 17 స్థానాల్లో ఒకటిగా ఉంది కనుక అక్కడ ఆరు స్థానాల్లో అదనంగా లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. 

కోవూరులో రెండుసార్లు పోలింగ్... 

అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంలో జాప్యం జరిగిన కారణంగా ఈ నెల 18వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న కోవూరులో మళ్లీ లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా రెండో సారి పోలింగ్ జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు అక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
Share this article :

0 comments: