నేటి నుంచి జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి జగన్ పర్యటన

నేటి నుంచి జగన్ పర్యటన

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012

మూడు రోజులపాటు కోవూరు ఉపఎన్నికల ప్రచారం 
ఉదయం ఆరు గంటలకు కావలికి రాక 
అక్కడ నుంచి రోడ్డు మార్గాన కొడవలూరుకు 
ప్రసన్నకు మద్దతుగా ఫ్యాను గుర్తుకు విస్తృత ప్రచారం 

నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి : కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజుల పర్యటన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్నారు. రాజధాని నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం ఆరు గంటలకు కావలి చేరుకుం టారు. కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి చెందిన ఆర్‌ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడే అల్పాహారం పూర్తిచేసుకుని రోడ్డు మార్గంలో కొడవలూరుకు వెళ్తారు. 

మండల కేంద్రం నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రచారం నార్తురాజుపాళెం బహిరంగసభతో తొలిరోజు ముగుస్తుంది. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయానికి ఢోకా లేనప్పటికీ భారీ మెజారిటీ సాధన దిశగా ప్రచారం చేసేందుకు ఆ పార్టీ నాయకులు వ్యూహ రచన చేశారు. ప్రధానంగా కోవూరు శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలకు దారితీసిన పరిస్థితులు, ఆ తరువాత పరిణామాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు వివరించే అవకాశాలు ఉన్నాయి. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుతో రికార్డు స్థాయి ఆధిక్యత సాధించడమే కాకుండా ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. కోవూరులోనూ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఫ్యాను గుర్తు రావడంతో కార్యకర్తలు, వైఎస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున గుర్తును ఓటర్లలోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని వారు భావిస్తున్నారు. ఇందుకు అధినేత ప్రచారం ఉపకరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం తొలివిడత ప్రచారం విడవలూరు మండలం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని కారణలతో 4వ తేదీన జరగాల్సిన పర్యటనను ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేసుకున్నారు.

మండల ఇన్‌చార్జులు, ముఖ్యులతో సమావేశాలు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం విస్తృతంగా చర్చించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో ఆయా మండలాలకు ఎన్నికల కోసం నియమించిన పార్టీ ఇన్‌చార్జులు, ముఖ్యులు పాల్గొన్నారు. తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసాల్లో వేర్వేరుగా ఈ సమావేశాలు జరిగాయి. పార్టీ గెలుపు కంటే అభ్యర్థికి వచ్చే మెజారిటీపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి దిశానిర్ధేశం చేశారు. గెలుపు కోసం ప్రత్యర్థి పార్టీలు అడ్డదారుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నందున వారి ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు సమాయత్తం కావాలని సూచించారు. 

ఈ సమావేశాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నెలవల సుబ్రమణ్యం, ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి, రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, వంశీకృష్ణయాదవ్, చెన్నారెడ్డి పెంచలరెడ్డి, రాధాకృష్ణ(ఆర్‌కే) తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రూట్ మ్యాప్ వ్యవహారాలను మాజీ కార్పొరేటర్ రూప్‌కుమార్‌యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. 



ఉప ఎన్నికలకు దారితీసిన పరిస్థితులను వివరించిన వైఎస్ జగన్
పర్యటన మరో రోజు పొడిగింపు
8న కోవూరులో ర్యాలీ, బహిరంగ సభ
తొలిరోజు పర్యటనకు అనూహ్య స్పందన
జగన్‌కు పల్లెల్లో ఆత్మీయ స్వాగతం
ఫ్యాన్ చూపుతూ విస్త్రత ప్రచారం

కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కొడవలూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి చోటా జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు. వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు. జగన్ కూడా పలుచోట్ల ప్రచార రథం దిగి జనంతో మమేకమయ్యారు. యువనేత చేతి స్పర్శ కోసం జనం ఎగబడ్డారు. ఆయన మహిళలను ఆప్యాయంగా పలుకరించారు. పలుగ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికలకు దారి తీసిన పరిస్థితులను వివరించడంతోపాటు ఫ్యాను గుర్తుకు ఓటేసి ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 

నెల్లూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి రోజు పర్యటన ఆద్యంతం ఆత్మీయత, అనురాగాల మధ్య సాగింది. అవ్వ.. తాత, అక్క చెల్లెళ్లు.. సోదరులు.. స్నేహితులంటూ ఆయన ఆప్యాయంగా పలుకరించడంతో జనం పులకించి పోయారు. రోడ్డుమీదుగా వెళ్తున్న ఆయన్ను చూసేందుకు జనం రోడ్దుపైకి వచ్చి గంటల తరబడి వేచి ఉండటం కనిపించింది. జనం ఉన్న చోట వాహనాన్ని ఆపి వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు కదిలారు. అంతే ఆత్మీయంగా వృద్దులు, మహిళలు జగన్‌ను గుండెలకు హత్తుకున్నారు. సమావేశం ముగించుకు వెళ్లే ప్రతి గ్రామంలో ఉంటాన్నవ్వా.. ఉంటాను తాతయ్యా.. అమ్మా .. టాటా చెల్లమ్మా’ అంటూ చేయి ఊపుతూ ముందుకు సాగుతుండగా.. ఆత్మీయ బంధువు వీడి వెళ్తున్నంతగా మహిళలు కంట తడిపెట్టారు.

కొడవలూరు ప్రారంభమైన ఆత్మీయతలు.. అనురాగాలు దారి పొడవునా కన్పించాయి. కొడవలూరు మండలం పెయ్యలపాళెంలో ఊరంతా రోడ్లు పుష్పాలు, రంగవల్లులతో అలంకరించారు. వైఎస్ జగనన్నకు జై అని ఓ చోట, ఫ్యాను గుర్తును మరో చోట వేసి ఆత్మీయ స్వాగతం పలికారు. కోవూరు అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు ఒకటి రెండు నెలల్లో నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డిని కూడా గెలిపించాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కవుతున్న తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో రెండు పార్టీలు మినహా మూడో పార్టీకి.. మూడో వ్యక్తి అవకాశం ఉండకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ఈ సమయంలో జనం నుంచి విశేష స్పందన లభించింది. 

చిన్నారులకు నామకరణం 
పల్లె జనానికి మహానేత కుటుంబంపై ఉన్న అభిమానం అడుగడుగునా కనిపించింది. చంద్రశేఖర్‌పురంలో ఇద్దరు చిన్నారులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో నామకరణం చేయించుకున్నారు. అబిద్‌నక్‌బాబు, ఉషారాణి కుమార్తెకు విజయమ్మ అని, అభిషేక్, హరిబాబు కుమారునికి రాజశేఖర్‌రెడ్డి అని నామకరణం చేయించుకున్నారు. ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ముద్దాడి విజయమ్మ, వైఎస్సార్ అని పేరుపెట్టగానే ఆ తల్లిదండ్రుల్లో చెప్పలేని ఆనందం కనిపించింది. 

భరోసా ఇచ్చిన పల్లెజనం
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ జనం అధికార, ప్రతిపక్ష పార్టీ టీడీపీపై మండిపడడం కనిపించింది. వృద్ధులను దగ్గరకు తీసుకుని ముద్దాడిన సమయంలో అనేక మంది కన్నీరు పెట్టుకున్నారు. ‘నాయనా నీకేం భయంలేదు.. అండగా మేమంతా ఉన్నాం. ధైర్యంగా ఉండు’ అంటూ వైఎస్ జగన్‌ను బుగ్గను తడుముతూ కన్నబిడ్డలా చూసుకున్నారు. మహిళలు జగనన్నా అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ.. చేతులూపుతూ వీర తిలకం దిద్ది పంపారు.

అడుగడుగునా అడ్డంకులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడవ లూరు మండలంలో పలుగ్రామాల్లో పర్యటించిన వైఎస్ జగన్ ప్రచారం సాఫీగా సాగిపోతున్నా పోలీసులు కోడ్ ఉందంటూ మీడియా వాహనాలను అడ్డుకున్నారు. అలాగే సమయం మించిపోయిందంటూ ప్రచారాన్ని అర్థాంతరంగా ఆపేశారు. రాజుపాళెంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సభకు వచ్చిన ప్రజలు పోలీసుల తీరుపై మండిపడ్డారు.

నేడు జగన్ పర్యటించే గ్రామాలు 
జేజేపేట, డేవిస్‌పేట, కొత్తూరు, ఇందుకూరుపేట, మొత్తలు, సోమరాజుపల్లె, కొరుటూరు, మైపాడు, నరసాపురం, గంగనపట్నం, రాముడుపాళెం, కుడితిపాలెం, ముదివర్తి, నిడుముసలి, పల్లెపాడు, లేబూరు, పున్నూరు, రావూరు, కొమరిక. ఇక్కడ ప్రచారం ముగించుకున్న తరువాత విడవలూరు మండలం ముదివర్తి వెళ్తారు. అక్కడ పార్టీ నేత వెంకటసుబ్బారెడ్డి నివాసంలో బస చేస్తారు.
Share this article :

0 comments: