ఎస్పీ ‘మద్దతు’ కోసం ఐదేళ్ల నాటి సీబీఐ కేసును మళ్లీ ముందుకు తెచ్చి వ్యూహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎస్పీ ‘మద్దతు’ కోసం ఐదేళ్ల నాటి సీబీఐ కేసును మళ్లీ ముందుకు తెచ్చి వ్యూహం

ఎస్పీ ‘మద్దతు’ కోసం ఐదేళ్ల నాటి సీబీఐ కేసును మళ్లీ ముందుకు తెచ్చి వ్యూహం

Written By ysrcongress on Thursday, March 8, 2012 | 3/08/2012

ఎస్పీ ‘మద్దతు’ కోసం ఐదేళ్ల నాటి సీబీఐ కేసును మళ్లీ ముందుకు తెచ్చి వ్యూహం 
ములాయం, ఆయన కుమారులపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ‘ఆస్తుల కేసు’ 
2008లో అణు ఒప్పందంపై విశ్వాస తీర్మానంలో యూపీఏకు మద్దతిచ్చిన ములాయం
దానికి ప్రతిఫలంగా.. కేసును ఉపసంహరించుకుంటామని ‘సుప్రీం’కు సీబీఐ దరఖాస్తు
కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకపోతే.. ములాయంకు వేధింపులు తప్పవంటున్న పరిశీలకులు

న్యూఢిల్లీ నుంచి డబ్ల్యూ చంద్రకాంత్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. అయినా కూడా.. యూపీలో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకున్న సమాజ్‌వాది పార్టీని బ్లాక్ మెయిల్ చేయటం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవటానికి తెరవెనుక వ్యూహ రచన మొదలుపెట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం అవమాన భారంతో కుంగిపోయినప్పటికీ.. ఎస్‌పీ అధ్యక్షుడు ములాయంసింగ్‌యాదవ్, ఆయన కుమారుల మెడపై ‘సీబీఐ కత్తి’ వేలాడుతోందన్న విషయాన్ని తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా గుర్తుచేయటం మాత్రం మరిచిపోలేదు. ములాయం, ఆయన కుమారులు అఖిలేష్, ప్రతీక్, కోడలు డింపుల్‌లపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ కేసును సీబీఐ మళ్లీ పునఃప్రారంభించే అవకాశం ఉందని.. తెరవెనుక ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. 

ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ సాధించి అధికారంలోకి రాలేకపోయినా.. కనీసం 80 నుంచి 100 సీట్లు గెలుచుకోగలమని.. రాష్ట్రంలో హంగ్ పరిస్థితి ఏర్పడితే ఎస్‌పీకో, బీఎస్‌పీకో మద్దతిచ్చి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని.. తద్వారా ఆ పార్టీ నుంచి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి బేషరతు మద్దతు పొందవచ్చని కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ.. అనూహ్యంగా ఎస్‌పీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి సంపూర్ణ మెజారిటీ సాధించటం కాంగ్రెస్ పార్టీకి పిడుగుపాటుగా మారింది. రాష్ట్రంలో తన అవసరం ఎవరికీ లేకుండా పోవటంతో ఎస్‌పీ కానీ, బీఎస్‌పీ కానీ తనకు బేషరతుగా మద్దతిచ్చే అవకాశం లేకపోవటం కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. 

అంతేకాదు.. రానున్న రాజ్యసభ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లోనూ యూపీఏ సారథి కాంగ్రెస్ పార్టీకి మరిన్ని తీవ్రమైన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇప్పటివరకూ తను అనుకున్నది బలవంతంగా అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇకపై ఏ అంశంపై అయినా పూర్తిగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. నిజానికి.. కేంద్రంలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వమైనప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. యూపీఏలో కాంగ్రెస్ తర్వాత అదిపెద్ద భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఇప్పటికే ఆరోపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ నాయకత్వాన్ని నయానో భయానో ‘తమ దారి’కి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఆలస్యం చేయకుండా పాత ఫైళ్ల దుమ్ము దులుపుతోంది. ఆ మేరకు అత్యంత తెలివిగా ఒక కథనం ఒక జాతీయ పత్రికలో ప్రచురితమయ్యేలా తెరవెనుక కథ నడిపింది. ఈ కథనం గురించి ఏఐసీసీ నాయకత్వాన్ని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. వారు ఏమీ మాట్లాడకుండా నర్మగర్భంగా నవ్వి ఊరుకున్నారు. 

ములాయంసింగ్‌యాదవ్ కుటుంబంపై ఐదేళ్ల నాటి ఆస్తుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. వారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారనేందుకు తమ వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని.. వారిపై కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని.. సీబీఐ 2007 అక్టోబర్ 26వ తేదీన సుప్రీంకోర్టును కోరింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం ఆధారంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం, ఆ ఉత్వర్వులను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును అఖిలేష్ కోరటం కూడా జరిగింది. అయితే.. ఈలోగా 2008లో యూపీఏ సర్కారు అమెరికాతో అణు ఒప్పందం వ్యవహారంలో పార్లమెంటులో విశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ఈ తీర్మానంపై ఓటింగ్‌లో గట్టెక్కటానికి కాంగ్రెస్‌కు మరింత మంది ఎంపీల మద్దతు అవసరమైంది. సమాజ్‌వాది పార్టీ తన ఎంపీల మద్దతు అందించి యూపీఏను గట్టెక్కించారు. దీనికిగాను ఆ పార్టీకి ప్రతిఫలం దక్కింది. ములాయం కుటుంబానికి సంబంధించి ‘‘ఆస్తులు లెక్కగట్టటంలో తీవ్రమైన పొరపాటు జరిగింది’’ అని పేర్కొంటూ, వారిపై కేసు కొనసాగించటానికి అనుమతి కోరుతూ ఇంతకు ముందు వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ సుప్రీంకోర్టుకు దరఖాస్తు సమర్పించింది. దీనిపై జస్టిస్ అల్తమాస్ కబీర్, జస్టిస్ సిరియాక్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం.. తన ఆదేశాలను రిజర్వులో పెట్టింది. ఈ లోగా జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ చేయటంతో.. సీబీఐ విజ్ఞప్తిని మళ్లీ కొత్తగా విచారించాల్సి రావచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ కోరుకున్న అంశాలపై సమాజ్‌వాది పార్టీ మద్దతు ఇవ్వకపోతే.. ఆ పార్టీ నాయకత్వానికి వేధింపులు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు.
Share this article :

0 comments: