మాజీ సీఎంను సీబీఐ రక్షిస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాజీ సీఎంను సీబీఐ రక్షిస్తోంది

మాజీ సీఎంను సీబీఐ రక్షిస్తోంది

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012


రాజకీయ దురుద్దేశంతోనే సాయిరెడ్డి అరెస్టు 
ఆడిటర్‌గా ఆయన సలహా మాత్రమే ఇచ్చారు
ఆయన్ను నిందితునిగా చేర్చడం చట్టవిరుద్ధం
కుట్రలో సాయిరెడ్డిదే కీలకపాత్ర: సీబీఐ
వాదనలు మార్చి 16కు వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రిని రక్షించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆడిటర్ విజయసాయిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ సోమవారం విచారించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసు రాజకీయ వాతావరణంలో నడుస్తోందని, రాజకీయ కుట్రలో భాగంగా.. ఎవరినో సంతృప్తిపరిచేందుకే సాయిరెడ్డిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. 

దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేయడంలేదని, రాజకీయ ఉద్దేశాలకు అనుగుణంగానే నడుస్తున్నాయని చెప్పారు. 2002లో ఓబీసీ డెరైక్టర్‌గా సాయిరెడ్డి పనిచేసిన సమయంలో రఘురామ్ సిమెంట్‌కు రుణం ఇచ్చారని, ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ.. 2004కు ముందు మాజీ ముఖ్యమంత్రి అక్రమాలపై విచారణ చేయాలని కోరితే మాత్రం స్పందించడంలేదన్నారు. పైగా అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రిని రక్షించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఆరునెలలుగా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ రోజు వరకూ ఒక్క ప్రభుత్వ అధికారినీ గుర్తించలేదని తెలిపారు. ఈ కేసులో ఆడిటర్‌గా సలహాలు ఇచ్చిన విజయసాయిరెడ్డిని మినహా ఒక్కరినీ అరెస్టు చేయలేదన్నారు. 2004 నుంచి 2009 మధ్య జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పదవిలో లేరని, అలాంటప్పుడు ఆయనపై క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా అనుమతులిచ్చిన అధికారులు, మంత్రులను విడిచిపెట్టి రాజకీయ కక్షతో జగన్‌ను టార్గెట్ చేసుకొని దర్యాప్తు సాగుతోందని వివరించారు. 

ఐపీసీ 409 సాయిరెడ్డికి వర్తించదు..

ఆడిటర్‌గా జగన్‌కు వృత్తిపరమైన సలహాలు ఇచ్చిన సాయిరెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందని సుశీల్‌కుమార్ ఆరోపించారు. న్యాయవాదిగా తాను కక్షిదారులకు సలహాలు ఇస్తానని, అలాగే సాయిరెడ్డి తన క్లెయింట్‌కు కంపెనీల్లో పెట్టుబడుల విషయంలో సలహాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. జగన్‌కు చెందిన డబ్బును ఆయన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించడంలో మాత్రమే సాయిరెడ్డి పాత్ర ఉందని సీబీఐ కౌంటర్‌లో పేర్కొందని.. అలాంటప్పుడు క్విడ్‌ప్రోకో, ఇతర కుట్రలతో సాయిరెడ్డికి సంబంధం లేదని సీబీఐ అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. సీబీఐ కౌంటర్‌లో పేర్కొన్న మేరకు ఐపీసీ 409 సాయిరెడ్డికి వర్తించదని, ఆయనపై మోపిన ఇతర సెక్షన్లలో 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని నివేదించారు. ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయని నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వవచ్చని విజ్ఞప్తి చేశారు. 

విదేశాల్లోని సాక్షులను ప్రభావితం చేస్తారా ?

విదేశాల నుంచి జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని, వాటిపై విచారణ జరిపేందుకు ఆరు దేశాలకు లెటర్ రొగెటరీలు (ఎల్‌ఆర్) పంపామని, సాయిరెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ ఆరోపించడం హాస్యాస్పదమని సుశీల్‌కుమార్ పేర్కొన్నారు. విదేశాల్లోని సాక్షులను సైతం సాయిరెడ్డి ప్రభావితం చేస్తారా అని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌లకు ఆయా దేశాలు స్పందించడానికి ఏళ్ల సమయం పడుతుందని, అప్పటి వరకు సాయిరెడ్డిని నిర్బంధంలోనే ఉంచడం తగదన్నారు. సాక్షులను బెదిరిస్తారని ఆరోపిస్తున్న సీబీఐ.. అందుకు సంబంధించిన ఒక్క ఆధారాన్ని చూపడంలేదన్నారు. ఆధారాలను చూపకుండా ఈ కారణంతో బెయిల్ అడ్డుకోరాదని అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

2జీ కేసులో ప్రైవేటు వ్యక్తులకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. సాయిరెడ్డి సాక్షులను బెదిరిస్తారని భావిస్తే రాష్ట్రం వెలుపల ఉండేలా ఆదేశిస్తూ బెయిల్ ఇవ్వవచ్చని సూచించారు. గుజరాత్‌లో మంత్రి అమిత్‌షాకు బెయిల్ మంజూరు చేసిన అక్కడి న్యాయస్థానం గుజరాత్‌లో ఉండరాదని షరతు విధించిన విషయాన్ని నివేదించారు. సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని, దర్యాప్తును ఆయన అడ్డుకోరని పేర్కొన్నారు. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెలువరించిన తర్వాతే సాయిరెడ్డి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కుట్రలో సాయిరెడ్డిదే కీలకపాత్ర: సీబీఐ

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సాయిరెడ్డి కీలకపాత్ర పోషించారని, 2002లోనే జగన్‌కు చెందిన రఘురామ్ సిమెంట్స్‌కు ఓబీసీ బ్యాంక్ నుంచి రూ.200 కోట్ల రుణం ఇప్పించారని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ తెలిపారు. జగతి పబ్లికేషన్స్‌లో సాయిరెడ్డి ఆడిటర్‌గా ఉన్నారని, మారిషస్‌కు చెందిన 2ఐ క్యాపిటల్ నుంచి రూ.105 కోట్లు సండూర్ పవర్స్‌లోకి నిధులు పెట్టుబడుల రూపంలో రావడం వెనుకా సాయిరెడ్డి పాత్ర ఉందని పేర్కొన్నారు. జగన్‌కు చెందిన కంపెనీ కార్యకలాపాల్లో సాయిరెడ్డి కీలకపాత్ర పోషించారని, ఈ విషయాన్ని ఇతర డెరైక్టర్లే స్పష్టం చేశారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సాయిరెడ్డి తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు.


సాయిరెడ్డి రిమాండ్ 16 వరకు పొడిగింపు...

ఆడిటర్ విజయసాయిరెడ్డి రిమాండ్‌ను ఈనెల 16 వరకు పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. సాయిరెడ్డి రిమాండ్ ముగియడంతో సోమవారం ఆయన్ను న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ ఎదుట హాజరుపర్చారు. విదేశాల నుంచి పెట్టుబడులు రావడంపై దర్యాప్తు కొనసాగుతోందని, సాయిరెడ్డి రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించాలని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి.. సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16న వాదనలు విననున్న నేపథ్యంలో రిమాండ్‌ను కూడా 16 వరకు పొడిగించారు.
Share this article :

0 comments: