ఆరోగ్యశ్రీ మీద సర్కారు నిర్లక్ష్య వైఖరిపై షర్మిల ధ్వజం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరోగ్యశ్రీ మీద సర్కారు నిర్లక్ష్య వైఖరిపై షర్మిల ధ్వజం

ఆరోగ్యశ్రీ మీద సర్కారు నిర్లక్ష్య వైఖరిపై షర్మిల ధ్వజం

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

ఈ పథకం అందక వందలాది మంది 
నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు 
వైఎస్ మరణించాక ఆరోగ్యశ్రీ పరిధిలోకొచ్చే 
రోగాల సంఖ్య కుదించారు ఈ పాలకులు
మహానేత ఉన్నప్పుడు 108కు ఫోన్ చేస్తే.. కుయ్.. కుయ్ అంటూ 20 నిమిషాల్లో వచ్చేది
ఇప్పుడు ఫోన్ చేస్తే.. అంబులెన్స్‌లో డీజిల్ లేదంటున్నారు
ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు 
మద్దతివ్వకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
వైఎస్ పెట్టిన ప్రతిపథకానికీ జగనన్న జీవం పోస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 124, కిలోమీటర్లు: 1,679.9

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘తాను అనారోగ్యానికి గురైనప్పుడు ఏవిధంగానైతే పెద్దాసుపత్రికి పోయి వైద్యం చేయించుకుంటానో.. అలాగే పేదోడికి కూడా రోగమొచ్చినప్పుడు వారు కూడా ధైర్యంగా అదే పెద్దాసుపత్రికి వచ్చి తన మంచం పక్కనే ఒక మంచం వేసుకొని వైద్యం చేయించుకోవాలనే గొప్ప ఆలోచనతో మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు. ఆయన మరణించిన తర్వాత ఈ పాలకులు పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ పథకంలోని రోగాల సంఖ్యను కుదించారు. 

దీంతో పథకం వర్తించక, తాము భరించే ఆర్థిక స్తోమత లేక, ఆత్మీయుల్ని గాలికొదిలేసి చంపుకోలేక ప్రజలు నరకం చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ తాత మదార్ సాహెబ్ అల్లుళ్ల మరణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాలకులను నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సాగింది. 

ఈ సందర్భంగా వీరులపాడు మండల కేంద్రం మీదుగా షర్మిల వెళుతున్నప్పుడు మదార్ సాహెబ్ అనే ఓ నిర్భాగ్యుడు ఆమెను కలిసేందుకు ముందుకురావడానికి యత్నించాడు. అది చూసి రోడ్డు దిగి ఆయన దగ్గరకే వెళ్లి షర్మిల పలకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం అందకపోవడం వల్ల తన కుటుంబం చితికిపోయిందని, తన అల్లుళ్లు మరణించారని గోడు చెప్పుకొంటూ సాహెబ్ కన్నీరుమున్నీరయ్యాడు. అది విని చలించిపోయిన షర్మిల ఉద్వేగంగా మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు.

ఏమైందీ సాహెబ్ కుటుంబానికి?

షేక్ మదార్ సాహెబ్(70) ఓ పేద ముస్లిం. కాయకష్టం చేయడం తప్ప మరో వ్యసనం లేని వ్యక్తి. పేదోడే కానీ కూడుకు లోటు లేదు. ఐదుగురు ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు. వచ్చిపోయే చుట్టాలు, మనవళ్లు, మనవరాళ్లతో ఆయన ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉండేది. వైఎస్సార్ హయాంలో ఈయనకు పక్కా ఇల్లు, వృద్ధాప్య పింఛన్ వచ్చాయి. 2009లో మూత్ర కోశ వ్యాధి సోకితే దర్జాగా కార్పొరేటు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చిన 15 రోజుల తరువాత వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు. అది తెలిసి తట్టుకోలేక మదార్ సాహెబ్ మంచాన పడ్డాడు.. 15 రోజుల పాటు తిండిలేదు.. ఐదుగురు బిడ్డలు.. అల్లుళ్లు వచ్చారు. ‘జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తున్నారు. 

మన బతుకులకు ఇబ్బంది ఉండదు, దిగులుపడొద్దు’ అని ధైర్యం చెప్పారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఏడాది కాలం కాలగర్భంలో కలిసిపోయింది. మూడో అల్లుడు జబ్బు పడ్డాడు. ప్రాణాపాయం ఉందని తెలిస్తే.. మదార్ సాహెబ్ అల్లుని కోసం అతను ఉంటున్న నిదానపురం గ్రామం వెళ్లాడు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని తాను ఆపరేషన్ చేయించుకున్న ఆసుపత్రికే అల్లుడిని కూడా తీసుకెళ్లాడు. అది చెల్లదని, మీ అల్లుడికి వచ్చిన రోగాన్ని ఆరోగ్యశ్రీ నుంచి తీసేశారని, డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెగేసి చెప్పాయి. తాను భవిష్యత్తు కోసం వెనకేసుకున్న రూ. 30 వేలు ఖర్చు చేశాడు.. కానీ అవి ఏమాత్రం సరిపోలేదు. విధిలేని పరిస్థితిలో అల్లుడిని ఇంటికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులకు అతను చనిపోయాడు. దీంతో సాహెబ్ కుంగిపోయాడు.

మరో అల్లుడు కూడా..

మరో ఏడాది గడిచిపోయింది. పెద్ద కూతురు నాగులు భర్తకు కూడా ఆరోగ్యం చెడిపోయింది. ఆయనకూ అదే పరిస్థితి.. ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదని చెప్పారు. వైద్యం చేయించడానికి చిల్లిగవ్వలేక పెద్దల్లుడిని తిరిగి ఇంటికే తీసుకొచ్చాడు. నెల రోజుల్లో పెద్దల్లుడు కూడా చనిపోయాడు. ఇది సాహెబ్‌ను కుంగదీసింది. ఇంతలో జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టారని తెలిసింది. వైఎస్ అన్నా.. ఆయన కుటుంబమన్నా సాహెబ్‌కు వల్లమాలిన అభిమానం. వరుస సంఘటనలలో మదార్ సాహెబ్ మంచాన పడ్డాడు. ఓ రోజు రాత్రి సమయంలో ఇంటి ముందు మంచంలో కూర్చొని ఉండగా.. ఏదో విష పురుగు కుట్టింది. ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేక నాటు వైద్యం చేయించుకున్నాడు. కాలుకు విషం పాకినంత వరకు పుండుగా మారింది. ఆసుపత్రికి తీసుకొని వెళితే కాలు తీసేయాలని చెప్పారు. మనసు అంగీకరించక ఇంటికి తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆయన చాలా కష్టంగా నడుస్తున్నాడు. కాలు తీసి కాలు వేయడానికి నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈయన కన్నీటి గాథ విని షర్మిల తీవ్ర ఉద్యేగానికి లోనయ్యారు.. ఏదైనా మంచి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాలని పక్కనే ఉన్న డాక్టర్ హరికృష్టను కోరారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అందక ప్రజలు మరణిస్తున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ‘‘వైఎస్సార్ సువర్ణయుగంలో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే... ఫోన్ చేసిన 20 నిమిషాల లోపు కుయ్..కుయ్..కుయ్.. అనుకుంటూ అంబులెన్స్ వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని పోయేది. ఇప్పుడు 108కు ఫోన్ చేస్తే మా అంబులెన్స్‌లో డీజిల్ లేదు.. మా ఉద్యోగులకు జీతాలు లేక ధర్నా చేస్తున్నారనే సమాధానం చెప్తున్నారు. ప్రజల్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. తాతా.. మీకు మాటిచ్చి చెప్తున్నాను. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న రాజ్యంలో ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలతో పాటు వైఎస్సార్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికి జగనన్న జీవం పోస్తారు. అంతవరకు మీరు ఓపిగ్గా, ధైర్యంగా ఉండండి’’ అని ఆమెకు భరోసా ఇచ్చారు.

14.1 కి.మీ. మేర యాత్ర..

పాదయాత్ర 124వ రోజు గురువారం కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం తోటమూల నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వీరులపాడు, పల్లంపల్లి, దాములూరు మీదుగా యాత్ర చేసిన షర్మిల.. కొణతాత్మకూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. గురువారం ఆమె 14.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,679.9 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, నేతలు వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతంరెడ్డి, స్థానిక నాయకులు వెస్లీ, పర్సా పురుషోత్తం, వేజెండ్ల శివశంకర్, కె. గురువయ్య తదితరులున్నారు.
Share this article :

0 comments: