తప్పడం ‘టైమ్స్ నౌ’ కు అలవాటే ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తప్పడం ‘టైమ్స్ నౌ’ కు అలవాటే !

తప్పడం ‘టైమ్స్ నౌ’ కు అలవాటే !

Written By news on Thursday, April 18, 2013 | 4/18/2013

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై ‘టైమ్స్ నౌ’ టీవీ చానల్ ప్రసారం చేసిన సర్వే వట్టి బూటక మని.. దానికి ఏ మాత్రం శాస్త్రీయత లేదని, కచ్చితత్వం అసలే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. దాన్ని విశ్వసనీయత లేని సర్వేగా అభివర్ణించారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టైమ్స్ నౌ-సీఓటర్’ గతంలో ఇలాగే అనేకసార్లు ప్రకటించిన సర్వేలు వాస్తవం కాదని రుజువైందంటూ ఆ సంస్థల సర్వేల డొల్లతనంపై పలు ఉదాహరణలను చెప్పారు. ‘ఇదే చానల్ 2009 సాధారణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మే 6న ఎగ్జిట్ పోల్ సర్వేను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 15 లోక్‌సభ సీట్లు, టీడీపీ నేతృత్వంలోని మహాకూటమికి 22(వామపక్షాలతో కలిపి), పీఆర్పీకి 4, ఎంఐఎంకు 1 సీటు వస్తాయని పేర్కొంది. తీరా 15న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు 33 సీట్లు, మహాకూటమికి 8(అందులో టీడీపీకి 6 సీట్లు) వచ్చాయి. పీఆర్పీకి ఒక్కటి కూడా దక్కలేదు. ఇదీ వారి కచ్చితత్వం. 

వారి విశ్వసనీయత. పీఆర్పీకి నాలుగు లోక్‌సభ సీట్లు వస్తాయని ప్రకటించిన ఏకైక చానల్ తమదేనని టైమ్స్ నౌ వారు అప్పట్లో డబ్బా కొట్టుకున్నారు. ఫలితాలు వెలువడిన తరువాత ఏమైంది? పీఆర్పీకి వచ్చింది సున్నా’ అంటూ టైమ్స్ నౌ గతంలో ప్రకటించిన సర్వేను అంబటి ఉటంకించారు. వీళ్ల సర్వేకు వాస్తవ ఫలితాలకు ఎంత తేడా ఉందంటే 2009లో మహాకూటమికి 22 స్థానాలు వస్తాయని చెబితే.. వారికి వచ్చింది 8 మాత్రమేనన్నారు. ‘ఇప్పటి సర్వేలో టీడీపీకి 9 వస్తాయని చెప్పారంటే.. ఇక ఎన్నికల తరువాత వచ్చేది సున్నా సీట్లే’ అని అన్నారు. ఇలాంటి సంస్థ చేసిన సర్వే చూసి చంబు(చంద్రబాబు) బృందం చంకలు కొట్టుకుంటోందని.. చంద్రబాబునాయుడైతే తన చేతికి చక్రం దొరికినట్లుగా.. తాను కేంద్రంలో దానిని తిప్పినట్లుగా అప్పుడే కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 

ప్రభంజనం తప్పదు..
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ 35 లోక్‌సభ, 200 అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీకి క్రమంగా ఓట్ల శాతం క్షీణిస్తోందన్నారు. ‘ఎన్టీఆర్ నుంచి పార్టీని గుంజుకునే నాటికి టీడీపీకి 1994లో వచ్చిన ఓట్ల శాతం 45గా ఉండేది. అది క్రమంగా తగ్గుతూ 2009 ఎన్నికల నాటికి 28 శాతానికి పడిపోయింది’ అని తెలిపారు. 

2010లో ‘మూడ్ ఆఫ్ ది నేషన్’, ‘మూడ్ ఆఫ్ ది స్టేట్స్’ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక నిర్వహించిన సర్వేలో టీడీపీకి 28 శాతం ప్రజల మద్దతు ఉందని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారి 20 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ‘టైమ్స్ నౌ తాజా సర్వే ఆధారంగా ఈనాడు పత్రిక తొలి పేజీలో వార్తను ప్రచురించింది. 2004 ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రంలో టీడీపీ 180 సీట్లు గెల్చుకుని, అధికారంలోకి వస్తుందని ఈనాడు ఓ సర్వేను ప్రచురించింది. అయితే, ఫలితాల్లో టీడీపీకి 45 సీట్లు మాత్రమే వచ్చాయి’ అని గుర్తు చేశారు. 

తప్పని రుజువైనా.. పశ్చాత్తాపం ప్రకటించలేదు..
టైమ్స్ నౌ సర్వేలు తప్పని ఎన్నోసార్లు రుజువైనా.. వారెప్పుడూ పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదని అంబటి అన్నారు. ‘ఆ చానల్ తాను ప్రకటించిన సర్వేపై చర్చ సందర్భంగా పాదయాత్రలో ఉన్న చంద్రబాబును ప్రత్యేకంగా లైన్లోకి తీసుకున్నారు. మీరు మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే రోజు వచ్చిందంటూ ఆ చానల్ జర్నలిస్టు గోస్వామి సన్నాయి నొక్కులు నొక్కడం.. అందుకు చంద్రబాబు అవునని పొంగిపోవడం, మీరు ఢిల్లీలో చక్రం తిప్పే రోజుల్లో నేను తరచూ మిమ్మల్ని కలిసేవాడినని గోస్వామి చెప్పడం చూస్తుంటే వీరిద్దరి మధ్యా ఏదో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్నాం’ అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. 

రాజకీయ ప్రతిష్ట అట్టడుగు స్థాయికి దిగజారి అవస్థ పడుతూ.. నడుస్తున్న చంద్రబాబును ప్రమోట్ చేయడానికే ఈ సర్వే చేసినట్లుగా భావిస్తున్నానని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సర్వేను ఆధారంగా చేసుకుని టీడీపీకి అనుకూలంగా ఉన్న పత్రికలు చంద్రబాబుకు బాకా ఊదుతున్నాయని విమర్శించారు. ‘ఇప్పటివరకు ఎన్నో సర్వేలు వెలువడ్డాయి. ఏరోజైనా ఈనాడులో మొదటి పేజీలో వాటిని ప్రచురించారా? టైమ్స్ నౌ సర్వేను ప్రముఖంగా ప్రచురించారంటే చంద్రబాబును ప్రమోట్ చేయడానికి కాకపోతే మరెందుకు?’ అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పరిస్థితి అంతబాగుంటే అవిశ్వాసం సందర్భంగా పార్టీ విప్‌ను ఉల్లంఘించి ఓటేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలకు ఎందుకు సిద్ధం కారు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 

సర్వేపై ధీమా ఉంటే.. ‘అవిశ్వాసానికి’ మద్దతివ్వలేదేం: మైసూరా
సాక్షి, హైదరాబాద్: టైమ్స్ నౌ-సీఓటర్ సర్వేపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అంత ధీమా ఉండి ఉంటే.. ప్రజాకంటక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు, సర్కారుకు వ్యతిరేకంగా ఓటెందుకు వేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ప్రశ్నించారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగితే టీడీపీకి పుట్టగతులు ఉండవనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసని, అందుకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వకుండా పారిపోయారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ‘టైమ్స్ నౌ’ సర్వే ప్రజలు నమ్మేదిగా లేదన్నారు. ఆ సర్వే పూర్తిగా శాస్త్రీయత లోపించిందని, ఇష్టానుసారంగా అంకెలు వేశారని, దీన్ని చూస్తే నవ్వొస్తోందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 30 లోక్‌సభ స్థానాలు ఖాయంగా గెలుచుకుంటుందని చెప్పారు. 

ఆ సర్వేకు విశ్వసనీయత లేదు: కొణతాల
టైమ్స్ నౌ సంస్థ వెలువరించే సర్వే ఫలితాలకు విశ్వసనీయత ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘2009 సాధారణ ఎన్నికల సందర్భంగా ఇదే టైమ్స్ నౌ సంస్థ చేసిన సర్వే అవాస్తవమని రుజువైంది. అప్పట్లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. కానీ 33 స్థానాలు దక్కాయి. ఇప్పుడు మాకు 12 స్థానాలని చెబుతోంది అంటే.. వారి లెక్క ప్రకారం 27 సీట్లు వస్తాయన్న మాట’ అని కొణతాల పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్ర వల్ల ఆయన గ్రాఫ్ పెరిగిందని, అందుకే 6 ఎంపీ స్థానాల నుంచి 9కి పెరిగిందంటున్నారని, అలాగైతే పాదయాత్ర ఆపితే సున్నాకు పడిపోతారా? అని ప్రశ్నించారు. బాబు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు 3 స్థానాలు పెరిగాయంటున్న టీడీపీ నేతలు.. 20 సీట్లు గెలవడానికి ఆయనతో 20వేల కిలోమీటర్లు నడిపిస్తారా? అని కొణతాల ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: