ఉప ఎన్నికలు జరిగేలా చూడండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికలు జరిగేలా చూడండి

ఉప ఎన్నికలు జరిగేలా చూడండి

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

శాసనసభ సాక్షిగా విప్‌లను ధిక్కరించాం.. మాపై వేటు వేసి ఎన్నికలకు మార్గం సుగమం చేయండి
ఎన్నికలు తప్పించుకునేందుకే కాంగ్రెస్, టీడీపీల కుట్ర.. మా అనర్హతపై తక్షణమే నిర్ణయం తీసుకోండి
కాంగ్రెస్‌తో కుమ్మక్కైన బాబు ప్రతిపక్ష నేతగా అనర్హుడు
ఆయన స్థానంలో వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నేత విజయమ్మను ఎంపిక చేయండి

 శాసనసభ సమావేశాల సాక్షిగా తాము పార్టీల విప్‌లను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశామని, స్పీకర్ సమక్షంలోనే విప్ ఉల్లంఘించినందున దీనిపై విచారణలతో పనిలేకుండా తక్షణమే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. సత్వరమే నిర్ణయం ప్రకటించడం ద్వారా ఉప ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, టీడీపీలు ఉప ఎన్నికలు రాకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నాయని, ఇందులో స్పీకర్ భాగస్వాములు కారాదని విన్నవించారు. తమపై అనర్హత చర్యలు తీసుకున్నా ఉప ఎన్నికలు రాకుండా ఆయా నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై ప్రజల్లోనే తేల్చుకునేందుకు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఉమ్మడి అభ్యర్థులతో పోటీ చేసినా, విడివిడిగా పోటీచేసినా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా విఫలమైనందున ఆయన్ను తొలగించి వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షనేత విజయమ్మను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని కోరారు. పార్టీల విప్‌లను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆయా శాసన సభ్యులకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. వీటిపై ఇప్పటికే వివరణ లేఖలు అందించిన ఆయా ఎమ్మెల్యేలు గురువారం స్వయంగా స్పీకర్‌ను కలసి తమ వివరణలను వినిపించారు. ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, మద్దాల రాజేష్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జోగి రమేష్, వనిత.. స్పీకర్‌ను కలసి ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డిలు తమ వివరణ పత్రాలను ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు పంపారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం ఆయా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

ప్రజా సమస్యలను గాలికొదిలింది: పేర్ని నాని

‘‘కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నా ప్రధాన ప్రతిపక్షం ఆ పార్టీతో కుమ్మక్కైంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది. చిన్న ప్రతిపక్షాలు ప్రజల తరఫున పోరాటం చేస్తూ అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తే మేమంతా ఓటు వేశాం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రజల నమ్మకాన్ని వంచించిన మంత్రివర్గం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రభుత్వ విప్‌గా ఉన్నా విద్యుత్ సర్‌చార్జీలు సరికాదని సీఎంతో అంటే.. నోట్లు ముద్రించమంటావా? ప్రజల నుంచి కాకుండా ఎక్కడి నుంచి తేవాలని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ సమక్షంలోనే విప్‌ను ధిక్కరించినందున విచారణలతో పనిలేకుండా మాపై చర్యలు తీసుకోవాలి. వేటు వేసి ఉప ఎన్నికలు పెట్టించాలని అడుగుతున్నాం. మే 14 తర్వాత ఒక్క సంవత్సరం గడువు కూడా ఉండదు. ఆ తర్వాత అనర్హత ప్రకటిస్తే ఉప ఎన్నికలు రావన్న ఉద్దేశంతో ప్రభుత్వం కాలయాపన చేయిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’.

ప్రతిపక్ష నేతగా బాబు అనర్హుడు: కొడాలి నాని

‘‘టీడీపీ నుంచి నాకు విప్ ఇవ్వలేదు. విప్ ఇచ్చినట్లు స్పీకర్ విశ్వసించిన పక్షంలో వెంటనే నాపై చర్య తీసుకొని ఉప ఎన్నికలు జరిగేలా చూడండని కోరాను. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలన్నట్టు విప్ ఇచ్చినందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా అనర్హుడు. ఆయన్ను తప్పించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ప్రతిపక్ష నేతగా ప్రకటించాలి. ఎన్టీఆర్ స్ఫూర్తిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన చివరి వరకు కాంగ్రెస్ వ్యతిరేకి. నేను కూడా కాంగ్రెస్‌ను చివరి వరకు వ్యతిరేకిస్తాను. మాపై అనర్హత నిర్ణయం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, స్పీకర్ చేతుల్లోనే ఉంది. కాలయాపనతో పనిలేకుండా మాపై అనర్హత వేటు వేయాలి’’.

ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టాలి: మద్దాల రాజేష్

‘‘కాంగ్రెస్‌కు, శాసనసభ్యత్వానికి నేను రాజీనామా చేసి ఆరు నెలలైనా అవి ఏమయ్యాయో ఇప్పటి వరకు తేల్చలేదు. రాజీనామా లేఖను నవంబర్‌లో ఇచ్చినా స్పీకర్ నుంచి స్పందన రాలేదు. నా రాజీనామాలపై తేల్చకుండానే నాకు విప్ ఇవ్వడం హాస్యాస్పదం. విప్ తీసుకున్నప్పుడే అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని చెప్పాను. ప్రభుత్వమో, చంద్రబాబో ఇచ్చే డెరైక్షన్లో కాకుండా చట్టబద్ధంగా వెంటనే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వానికి ధైర్యముంటే రాజీనామా ఆమోదించి ఎన్నికలు నిర్వహించాలి’’

కాంగ్రెస్, టీడీపీ పారిపోతున్నాయి: జోగి రమేష్

ఉప ఎన్నికలు ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్, టీడీపీ పారిపోతున్నాయి. దొడ్డిదారిన ఏడాదిపాటు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ టీడీపీలకు ఒక్కటే సవాల్ విసురుతున్నాం. ఉప ఎన్నికలు పెట్టించండి. మీరిద్దరు కలసికట్టుగా కానీ, విడివిడిగా కానీ ఉమ్మడి అభ్యర్థులను పెట్టుకొని కానీ మాపై పోటీ చేయాలి. ఆ సత్తా ఉందో లేదో చెప్పాలి. ఏడాదిపాటు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా లేకుండా చేసినా ప్రజల్లో మాపై మరింత విశ్వాసం పెరుగుతుందే తప్ప మరేమీ కాదు. స్పీకర్ ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తికాదు కనుక సరైన నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకోకపోతే అధికార పార్టీకి తొత్తుగా మారినట్లు భావించాల్సి ఉంటుంది.’’

ఇంకా వివరణలెందుకు: ద్వారంపూడి

స్పీకర్ ఉన్న అధికారాలతో మాపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వివరణలతోనో, ఫార్మాట్‌లో రాజీనామా లేఖల తోనో అవసరం లేదు. నిండు సభలో పార్టీ విప్ ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే ఇక మా వివరణలు, రాజీనామా లేఖలతో పనేంటి? వెంటనే అనర్హత చర్యలు తీసుకొని ఎన్నికలు పెట్టించండి. ప్రజల తీర్పు కోరి ఎవరిపై వారికి విశ్వాసముందో తేల్చుకుందాం..’’

కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు దక్కవు: పెద్దిరెడ్డి

ఉప ఎన్నికలొస్తే వైఎస్సార్ కాంగ్రెస్ అన్నీ సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడం ఖాయం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన నిలవాలి. ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజ్యాంగాన్ని గౌరవించినట్లవుతుంది. ఎన్నికలొస్తే చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కదు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఓడిపోవడం ఖాయం.
Share this article :

0 comments: